AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking News: ఇండియాకు అమెరికా అప్పు.. కీలక సమాచారాన్ని వెల్లడించిన అమెరికన్ మెంబర్.. మనకివ్వాల్సింది ఎంతంటే?

అగ్ర రాజ్యం అమెరికా అప్పుల్లో కూరుకుపోతోంది. చైనా, జపాన్‌లకు పెద్ద ఎత్తున అప్పు పడ్డ అమెరికా మన దేశానికి సైతం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వుంది. ఈ అంశాన్ని మరెవరో కాదు ఆ దేశ చట్ట సభ సభ్యడే స్వయంగా వెల్లడించాడు.

Shocking News: ఇండియాకు అమెరికా అప్పు.. కీలక సమాచారాన్ని వెల్లడించిన అమెరికన్ మెంబర్.. మనకివ్వాల్సింది ఎంతంటే?
Rajesh Sharma
|

Updated on: Feb 27, 2021 | 5:31 PM

Share

America debt to India disclosed by statutory member: అమెరికా గురించి ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా అగ్రదేశం, సంపన్న రాజ్యం, ప్రపంచానికి పెద్దన్న.. ఇలాంటి ఉపమానాలను వల్లిస్తూ వుంటాం. అదే మన దేశం విషయానికి వస్తే అభివృద్ధి చెందుతున్న దేశంగానే గత నాలుగైదు దశాబ్ధాలుగా అంటూ వున్నాం.. అంటుంటే వింటూ వున్నాం.. రాస్తున్నాం.. రాస్తుంటే చదువుతూ వున్నాం. కానీ.. అగ్ర రాజ్యం అమెరికా మన దేశానికి బాకీ వుందన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. ఎస్.. ఇది వంద శాతం నిజం. ఎంతంటే ఏకంగా అమెరికా చట్ట సభ సభ్యుడు స్వయంగా ఆందోళన వ్యక్తం చేసినంతటి నిజం.

అగ్రరాజ్యంగా, ప్రపంచ పెద్దన్నగా భావిస్తూ, ఆ దేశం ఏ దేశ అంతర్గత అంశాల్లో వేలు పెట్టినా ప్రశ్నించలేమని భావిస్తున్న తరుణంలో అమెరికన్ చట్ట సభ సభ్యుడు అలెక్స్ మూనీ పెద్ద బాంబు పేల్చాడు. అమెరికా పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోతుందని, పరిస్థితిని గాడిలో పెట్టకపోతే కష్టమని మూనీ అధ్యక్షుడు బైడెన్‌ను హెచ్చరించారు. ఈ పరిణామం అమెరికన్ కాలమానం ప్రకారం ఫిబ్రవరి 26 అర్ధరాత్రి దాటిన తర్వాత (భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 27 ఉదయం జరిగింది.

అమెరికా అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయంటూ ఆ దేశ కీలక చట్టసభ సభ్యుడు అలెక్స్‌ మూనీ.. బైడెన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అమెరికా అప్పుల్లో అధిక శాతం ప్రస్తుతం తమ దేశం ప్రత్యర్థులుగా భావిస్తున్న దేశాలకు ఉండడం మరింత ఆందోళన కలిగించే పరిణామమని మూనీ వ్యాఖ్యానించారు. అంటే అమెరికా శతృదేశాలుగా భావించే చైనా, జపాన్‌లకే ఆ దేశం అందరికంటే ఎక్కువ అప్పులుందన్నమాట. అమెరికాకు అన్ని రంగాల్లో సవాల్‌ విసురుతున్న చైనా నుంచి పరోక్షంగా పెద్ద మొత్తంలో అప్పులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మూనీ భారత దేశం పేరును ప్రస్తావించారు. భారత్‌కు సైతం 216 బిలియన్‌ డాలర్లు (సుమారు 1.58 లక్షల కోట్ల రూపాయలు) మేరకు అమెరికా రుణపడి ఉన్నట్లు మూనీ వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా దేశ అప్పులు మొత్తం 29 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు 21.3 లక్షల కోట్ల రూపాయలు) చేరినట్లు తెలిపారు.

2020 నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లుగా ఉండేవని మూనీ తెలిపారు. అంటే ఆ దేశంలో ఒక్కొక్కరిపై సగటున 72,309 డాలర్ల అప్పు ఉన్నట్లు వివరించారు. గత ఏడాది కాలంలో తీసుకున్న అప్పును ఒక్కొక్కరికీ పంచితే 10,000 డాలర్లు వస్తుందని తెలిపారు. ఇలా తీసుకువచ్చిన అప్పుల డబ్బు ఎక్కడికి వెళుతున్నాయనే విషయంలో క్లారిటీ లేదని మూనీ వ్యాఖ్యానించారు. తప్పుడు లెక్కలుగా కనిపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. అమెరికాకు ప్రత్యర్థి దేశాలుగా భావస్తున్న చైనా, జపాన్‌కే ఎక్కువగా రుణపడి ఉన్నామని వ్యాఖ్యానించారు. ఈ రెండు దేశాల్లో ఒక్కోదానికి ఒక ట్రిలియన్‌ డాలర్లకు పైగా అమెరికా రుణపడి ఉందని మూనీ వివరించారు. రెండు ట్రిలియన్‌ డాలర్ల విలువ చేసే కరోనా ఉద్దీపన పథకాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా చట్టసభలో జరిగిన చర్చలో పాల్గొన్న మూనీ తన ప్రసంగంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

2000 సంవత్సరంలో 5.6 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న అమెరికా అప్పులు బరాక్ ఒబామా పాలించిన ఎనిమిది సంవత్సరాలలో రెండింతలైనట్లు మూనీ వివరించారు. దీన్ని రోజురోజుకీ పెంచుతూ పోతున్నామని. దీంతో జీడీపీలో అప్పుల నిష్పత్తి నియంత్రణలో లేకుండా పోతోందని మూనీ ఆందోళన వ్యక్తంచేశాడు. ఈ నేపథ్యంలో కొత్త ఉద్దీపన పథకాన్ని ఆమోదించే ముందు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సహచర చట్టసభ సభ్యులను సూచించారు. ఈ పథకంలో చాలా వరకు నిధులు కరోనా ఉపశమన పథకాలకు వెళ్ళే అవకాశాలు కనిపించడం లేదని మూనీ వ్యాఖ్యానించారు.

ALSO READ: అయిదు అసెంబ్లీల ఎన్నికలు.. ఏ లెక్కన చూసినా అన్ని పార్టీలకు కీలకమే

ALSO READ: సోషల్ మీడియా, ఓటీటీ చట్టంలో కొత్త మార్గదర్శకాలు.. కొత్త నిబంధనలను ఎందుకోసం? ఎవరికోసం?