Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం.. ఇంటి మిద్దె కూలి దంపతుల దుర్మరణం..
తెలకపల్లి మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షంతో.. ఇంటి మట్టి మిద్దె కూలింది.
Couple Died in Nagarkurnool District: తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి మట్టి మిద్దె కూలి దంపతులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని తెలకపల్లిలో చోటుచేసుకుంది. తెలకపల్లి మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షంతో.. ఇంటి మట్టి మిద్దె కూలింది. శిథిలాలు దంపతుల మీద పడటంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. మృతులు భోగరాజు చంద్రయ్య (65), వెంకటమ్మ (62) గా గుర్తించారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి పలు వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలాఉంటే.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే.. ఆదివారం నుంచి పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..