MSR: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ క‌న్నుమూత‌.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఎం స‌త్యనారాయ‌ణ రావు (87) క‌న్నుమూశారు. గత కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.

MSR: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ క‌న్నుమూత‌.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి
Former Minister M Satyanarayana Rao
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 27, 2021 | 8:13 AM

Former Minister MSR Passed Away: కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఎం స‌త్యనారాయ‌ణ రావు (87) క‌న్నుమూశారు. గత కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఇవాళ తెల్లవారుజామున 3.45 గంట‌ల‌కు తుదిశ్వాస‌ విడిచారు. అదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యలు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం డాక్టర్లు వెంటిలేటర్‌పైనే చికిత్స అందించారు. ఇదే క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఎమ్మెస్సార్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ చైర్మన్‌గా, దేవాదాయ, క్రీడ‌, సినిమాటోగ్రఫీ శాఖ‌ల మంత్రిగా పనిచేశారు.

ఎమ్మెస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఎంఎస్‌ఆర్ జనవరి 14, 1934లో కరీంనగర్ జిల్లా వెదిరే గ్రామంలో జన్మించారు. 1980 నుంచి 83 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి ఎంపీగా ఎంఎస్‌ఆర్ గెలుపొందారు. అనంతరం మరో రెండు పర్యాయాలు కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 14 ఏళ్ల పాటు ఎంపీగా కొనసాగారు. 1990-94 వ‌ర‌కు ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2000 నుంచి 2004 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంఎస్‌ఆర్ పనిచేశారు. 2004-07 వ‌ర‌కు దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌ రెడ్డి మంత్రివ‌ర్గంలో దేవాదాయ, క్రీడ‌, సినిమాటోగ్రఫీ శాఖ‌ల మంత్రిగా పనిచేశారు.  2007 తర్వాత ఆర్టీసీ చైర్మన్‌గా ఎం.సత్యనారాయణ రావు తిరిగి సేవలందించారు. 2006లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో స‌వాల్ చేసి క‌రీంన‌గ‌ర్‌ లోక్‌స‌భ ఉపఎన్నిక‌కు కార‌ణ‌మ‌య్యారు.

ఎమ్మెస్సార్‌ మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎమ్మెస్సార్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ వాదిగా, ఎంపీగా, మంత్రిగా ఎమ్మెస్సార్‌ ప్రత్యేక శైలి కనబరిచారు. రాజకీయాల్లో ఎమ్మెస్సార్‌ ముక్కుసూటి మనిషిగా పేరొందారు. ఎమ్మెస్సార్‌ మృతి పట్ల శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భాగవంతుడిని ప్రార్థించారు. ఎమ్.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన మరణం కాంగ్రెస్‌కు తీరని లోటని అన్నారు. కాగా, ఈ రోజు మధ్యాహ్నం జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానం స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.

Read Also…  Face Mask Painting: ఫేస్ మాస్క్‌కు బదులు పెయింటింగ్.. అందాలను ఆరబోస్తూ తీసిన వీడియో వైరల్.. సీన్ కట్ చేస్తే పాస్‌పోర్ట్ సీజ్!