CONGRESS PARTY: పీసీసీ అధ్యక్షుల ఎంపికపై తుదిదశకు కసరత్తు.. ఈ వారమే ప్రకటించనున్న హైకమాండ్
చిరకాలంగా పెండింగులో వున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు తుది దశకు చేరుకుంది. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణ పీసీసీతోపాటు వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాల ప్రాంతీయ కాంగ్రెస్...
CONGRESS PARTY TO APPOINT PCC PRESIDENTS: చిరకాలంగా పెండింగులో వున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు తుది దశకు చేరుకుంది. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణ పీసీసీ (TELANGANA PCC)తోపాటు వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు (ASSEMBLY ELECTIONS) జరగనున్న పలు రాష్ట్రాల ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించనున్నట్లు హస్తిన వర్గాల భోగట్టా. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో పార్టీ నేతల మధ్య వున్న భిన్నాభిప్రాయలను పరిష్కరించేందుకు, ఏకాభిప్రాయంతో పీసీసీ అధ్యక్షులను ప్రకటించేందుకు సీనియర్ నేతలను రంగంలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం (CONGRESS HIGH COMMAND).
2022లో ఉత్తరప్రదేశ్ (UTTAR PRADESH), ఉత్తరాఖండ్ (UTTARAKHAND), పంజాబ్ (PUNJAB), గుజరాత్ (GUJRAT), గోవా (GOA), మణిపూర్ (MANIPUR), హిమాచల్ ప్రదేశ్ (HIMACHAL PRADESH) రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలో అక్కడ గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఈ ఆరు రాష్ట్రాల్లో ఒక్క పంజాబ్ మినహా ఎక్కడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. దాంతో ఎలాగైనా పార్టీ పరిస్థితి మెరుగు పరచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడంతోపాటు మిగిలిన రాష్ట్రాలలో సత్తా చాటాలని చూస్తోంది. అయితే.. పంజాబ్ మినహా మిగిలిన అయిదు రాష్ట్రాలలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని రాజకీయ విశ్లేషకులు (POLITICAL ANALYSTS) భావిస్తున్నారు. ఎంతో కొంత ఉనికి వున్న చోట పార్టీలో గ్రూపు తగాదాలు పెద్ద ఎత్తున వుండడమతో పీసీసీ అధ్యక్షుల నియామకం సర్వసమ్మతంగా పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇక తెలంగాణ, కేరళ (KERALA) వంటి రాష్ట్రాలకు కూడా మరో రెండు, మూడు రోజుల్లో పీసీసీ అధ్యక్షులను ప్రకటించనున్నది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ పీసీసీ అధ్యక్ష నియామకంపై ఇదివరకే అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. అయితే.. అప్పట్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక (NAGARJUN SAGAR BY-ELECTION) రావడంతో ఆ ఎన్నికపై ప్రభావం చూపే ప్రమాదం వుందని సీనియర్ నేత, సాగర్ అభ్యర్థి కే.జానారెడ్డి (K JANAREDDY) పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీని కోరడంతో పీసీసీ అధ్యక్షుని ప్రకటన నిలిపి వేశారు. ఇపుడు అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసి పోయిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుని ప్రకటనపై కసరత్తు మళ్ళీ మొదలుపెట్టారు. తెలంగాణ పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి (REVANTH REDDY), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (KOMATIREDDY VENKAT REDDY) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ఇక కేరళ (KERALA) పీసీసీ రేసులో కే.సుధాకరన్, కొడిక్కుణ్ణిల్ సురేశ్, పీటీ థామస్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో సుధాకరన్, సురేశ్‌లిద్దరు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిలో సుధాకరన్ వయస్సు 73 ఏళ్ళు. సురేశ్ వయస్సు 58 ఏళ్ళు.. అధిష్టానం 71 ఏళ్ళ పీటీ థామస్ వైపు మొగ్గుచూపుతున్నట్లుగా సంకేతాలున్నాయి. కానీ.. ‘‘ కాల్ సుధాకరన్, సేవ్ కాంగ్రెస్’’ అనే నినాదంతో సుధాకరన్ నాయకత్వమే పార్టీకి అవసరమంటూ శ్రేణులు పెద్ద ఎత్తున అధిష్టానానికి ఈమెయిల్స్ పంపుతున్నారు. పెద్ద వయస్కుడైనా సుధాకరన్ తీసుకునే నిర్ణయాలు, దూకుడు రాజకీయాలే కేరళలో కాంగ్రెస్ పార్టీకి అవసరమన్నది ఈమెయిల్స్ సారాంశం. పినరయి విజయన్ సారథ్యంలో ఎల్డీఎఫ్ రెండోసారి కేరళలో ఇటీవలనే అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కనీసం పదేళ్ళ తర్వాతైన అధికారం రావాలంటే సుధాకరన్ నేతృత్వం అవసరమని పార్టీ వర్గాలంటున్నాయి.
మరోవైపు ఏఐసీసీలోనూ భారీగా మార్పులకు హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ఏఐసీసీలోని ఖాళీలను భర్తీ చేయడంతో రాహుల్, ప్రియాంకల మార్కు వుండేలా ప్లాన్ జరుగుతున్నట్లు హస్తిన వర్గాలంటున్నాయి. సంస్థాగత ఎన్నికల ద్వారా ఏఐసీసీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎవరు విఙ్ఞప్తి చేసినా ఆయన అధ్యక్ష స్థానంలోకి తిరిగి రాలేదు. దాంతో తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీనే నిర్వహిస్తున్నారు. సోనియా గాంధీ అనారోగ్యం దృష్ట్యా రాహుల్ గాంధీ త్వరలోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను రెండో దఫా చేపడతారని ప్రచారం జరుగుతోంది.
ALSO READ: ఆగని డ్రాగన్ కుట్రలు.. ఇండో-చైనా సరిహద్దులో భారీగా నిర్మాణాలు