Telangana Politics: తెలంగాణలో పొలిటికల్ వార్.. ప్రకంపనలు సృష్టిస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు!
మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం..అనే మాట కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా బీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పలు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మీరు ప్రభుత్వాన్ని కూలుస్తామంటే.. జనాలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకుంటారా?..చెట్టుకు కట్టేసి బట్టలూడదీసి కొడతారంటూ ప్రతిపక్షాలకు గట్టి వార్నింగే ఇచ్చారు.

ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్‌తో చల్లబడిన చర్చ..దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాన్ని కూల్చేయాలని వ్యాపారులు, రియల్టర్లు కోరుకుంటున్నారంటూ ఆయన అన్న ఒకే ఒక్క మాట ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. కేసీఆర్ మాటలే కొత్త ప్రభాకర్ నోటి నుంచి వచ్చాయని…ప్రభుత్వాన్ని పడగొడుతుంటే చూస్తూ కూర్చోవడానికి చేతగానివాళ్లెవరూ లేరంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.
ఇక కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు వరుసగా కౌంటర్స్ ఇస్తున్నారు. వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు తెచ్చుకుని ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి జ్యోతిష్యం తెలుసేమో అంటూ విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి అంటే కేసీఆర్ ఆత్మని.. కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలే కొత్త ప్రభాకర్‌రెడ్డి నోట వచ్చాయని మంత్రి పొంగులేని శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గజ్వేల్ నియోజకవర్గానికి కొత్త ప్రభాకర్ రెడ్డి ఇన్‌చార్జ్‌గా ఉన్నారని.. అక్రమంగా దోచుకున్న ఆస్తిని ప్రభుత్వం తీసుకుంటుందని భావించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిచిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, గుజరాత్ వ్యాపారులతో కలిసి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇదే అంశంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. బీఆర్ఎస్ గత పాలనలో అవినీతిని దాచిపెట్టేందుకే ప్రభాకర్ రెడ్డి ఇలాంటి కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉందని, బీఆర్ఎస్ ఇలాంటి వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచలేదని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…