Telangana BJP: తెలంగాణ బీజేపీలో కొత్త, పాత లీడర్ల మధ్య కోల్డ్ వార్.. అధ్యక్ష రేసుపై ఆసక్తికర చర్చ
తెలంగాణ బీజేపీలో కొత్త, పాత నేతల మాటల ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రాష్ట్ర కాషాయ పార్టీ సారథిగా ప్రస్తుతం కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో మరోమారు ఛాన్స్ దక్కించుకున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి స్థానంలో కొత్తవారిని నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ బీజేపీలో కొత్త, పాత నేతల మాటల ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రాష్ట్ర కాషాయ పార్టీ సారథిగా ప్రస్తుతం కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో మరోమారు ఛాన్స్ దక్కించుకున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి స్థానంలో కొత్తవారిని నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాత వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తుంటే.. మరోవర్గం నేతలు సామార్థ్యాన్ని, స్థాయిని బట్టి పార్టీ అధిష్టానం పదవులు ఇస్తుందని అంటున్నారు. పార్టీ కొత్త, పాత అంటూ రెండూగా బీజేపీ చీలిపోయినట్లు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో కీలక నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పాలమూరు ఎంపీ డీ కే అరుణ ఎవరికి వారు పార్టీ చీఫ్ పోస్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణ రెడ్డి సైతం స్టేట్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నామని చెబుతున్నారు. ఇంకోవైపు సంఘ్ పరివార క్షేత్రాల్లో పనిచేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, చింతల రామచంద్రారెడ్డి, కాసం వెంకటేశ్వర్లు లాంటి నేతలు రాష్ట్ర పార్టీ బాధ్యతల కోసం గట్టి లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామాకం తర్వాతే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమించే అవకాశముంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతల మధ్య పాత, కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. రాజకీయ పార్టీకి సంపూర్ణ విజయం దక్కాలంటే కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు అవసరమంటున్నారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. పార్టీలో పాత, కొత్త నాయకులలో ఎవరు ఎక్కువ కాదు.. ఎవరు తక్కువ కాదన్న కామెంట్స్ ఇప్పుడు కాషాయదళంలో కాకరేపుతున్నాయి. ఎప్పుడు వచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా ? లేదా ? అన్నదే పాయింట్ అన్నట్లుగా ఈటల… బీజేపీ చీఫ్ పోస్ట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ మాట్లాడిన కొద్దిగంటల్లోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. దేశం, ధర్మం, పార్టీ పై భక్తి ఉన్న నేతకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని సంచలన కామెంట్ చేశారు. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు సహా అందరి ఒపీనియన్ తీసుకున్నాకే రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక చేయాలని అధిష్టానానికి ఎమ్మెల్యే రాజాసింగ్ సూచన చేశారు.
వీరిద్దరూ ఇలా మాట్లాడగా.. మెదక్ ఎంపీ రఘునందన్ మరోరకంగా రియాక్ట్ అయ్యారు. కొత్తగా వచ్చిన నేతలకు పదవులు రావనేది ఏమీ లేదని.. అసోం సీఎం హిమంతబిశ్వశర్మకు సీఎం పదవి దక్కిన విషయాన్ని గుర్తు చేశారు రఘునందన్ రావు. తెలంగాణ బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య రాజుకున్న వివాదం ఎక్కడికి దారితీస్తుందోనని పార్టీలో చర్చ మొదలైంది. ఈ నెల చివరి నాటికి పార్టీ కొత్త సారథిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా తెలంగాణ బీజేపీలో పాత, కొత్త వివాదాన్ని పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి మరి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..