Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: ఆ ఆలోచనను పక్కన పెట్టాలి.. ఎవరైనా ఎమ్మెల్యేగా గెలవచ్చు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం రేవంత్ హామీనిచ్చారు. కళాశాల సమయంలో భవిష్యత్ కు బంగారు పునాదులు వేసుకోవాలని సూచించారు. విద్యార్థి దశలోనే వీలైనంత ఎంజాయ్ చేస్తూనే భవిష్యత్ వైపునకు సరైన దిశలో అడుగులు వేయాలని సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిస కాకూడదని చెప్పారు.

CM Revanth Reddy: ఆ ఆలోచనను పక్కన పెట్టాలి.. ఎవరైనా ఎమ్మెల్యేగా గెలవచ్చు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Revanth Reddy
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 22, 2023 | 3:13 PM

డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచనను పక్కన పెట్టాలి.. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలవచ్చు.. అది కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని తెలిపారు. శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ అల్‌మని మీట్, గ్రాడ్యుయేషన్ డేలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిని అయ్యానని, ఎంతో మంది పోటీలో ఉన్నా కూడా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తనకు అవకాశం ఇచ్చారని తెలిపారు. గడ్డం వివేక్, వినోద్ రామాయణంలో లవకుశలు లాంటివారని కొనియాడారు. ఎంత సంపాదించామనేది కాదు.. సమాజానికి ఎంత పంచామనేది సామాజిక బాధ్యత అనేది కాకా విధానమన్నారు. అటువంటి కాకా వెంకటస్వామి వర్థంతి రోజు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం గొప్ప కార్యక్రమమని అన్నారు.

గత 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత కాకా సొంతమని రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ నిర్మాణంలో ఆయన వారి సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదేనని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలో కాకా ఫ్యామిలీ ముందుందన్న సీఎం రేవంత్.. ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్ కూడా కాకా పేరునే ఉందని తెలిపారు. దేశ నిర్మాణంలో కూడా కాకా పాత్ర ఉందన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎలానో తెలంగాణకు కాకా కుటుంబం అలా అని చెప్పుకొచ్చారు. బీఆర్ అంబేద్కర్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి చేయూతనందించేందుకు సిద్దమని రేవంత్ హామీ ఇచ్చారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు తాము అండగా ఉంటామన్నారు.

రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం రేవంత్ హామీనిచ్చారు. కళాశాల సమయంలో భవిష్యత్ కు బంగారు పునాదులు వేసుకోవాలని సూచించారు. విద్యార్థి దశలోనే వీలైనంత ఎంజాయ్ చేస్తూనే భవిష్యత్ వైపునకు సరైన దిశలో అడుగులు వేయాలని సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిస కాకూడదని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు. అందుకే విద్యార్థులంతా మంచిగా చదువుకుని సర్కార్ కొలువు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంతకుముందు కాలేజీలో కాకా విగ్రహాన్ని సీఎం రేవంత్ అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.