మీ ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు నా దగ్గర ఉన్నాయి.. తీరు మార్చుకోండి.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్గ విభేదాలు, గొడవలను పక్కన పెట్టి కార్యకర్తలతో కలిసి పని చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయంపై ఫోకస్ చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా ప్రచారం నిర్వహించాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

మీ ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు నా దగ్గర ఉన్నాయి.. తీరు మార్చుకోండి.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్!
Cm Revanth Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 02, 2025 | 7:21 AM

కొత్త సంవత్సరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సరికొత్త టాస్క్‌ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేల అందరి జాతకాలు ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో తన దగ్గర ఉన్నాయన్నారు. పనితీరు మెరుగుపర్చుకోవాలన్నారు. ఇప్పటికైనా వర్గవిభేదాలను పక్కనబెట్టి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

‘నేను మారాను.. మీరూ మారండంటూ’ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ తన దగ్గర ఉందన్నారు. ఎవరు ఏం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? లేదా? అన్న విషయాలపై తన దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉందని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని ఎమ్మెల్యేలకు సూచించారు. వర్గ విభేదాలు, గొడవలను దూరం పెట్టి సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలన్నారు ముఖ్యమంత్రి. కార్యకర్తలకు సమయం కేటాయించాలన్నారు. తాను కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. త్వరలో కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు ఉంటాయకన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు పార్టీల నుంచి ముఖ్యనేతల చేరికలు ఉంటాయన్నారు.

బీఆర్ఎస్‌ నుంచి గెలిచిన 20 నుంచి 29 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆయన చెప్పినట్టు ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారితో సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..