AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ఎన్నికలు లేకున్నా హీటెక్కిన పాలిటిక్స్‌

విజయోత్సవ సభలతో అధికార పార్టీ ఏడాది పాలన విజయాలపై డప్పు మోగిస్తోంది. ఏడాదిలో తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని బీఆర్ఎస్ మండిపడుతోంది.

విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ఎన్నికలు లేకున్నా హీటెక్కిన పాలిటిక్స్‌
Brs Leaders
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 20, 2024 | 11:03 PM

Share

ఇప్పుడు ఎన్నికలు లేవు, రేపో మాపో నోటిఫికేషన్ వచ్చేదీ లేదు. కాని తెలంగాణ రాజకీయం మాత్రం ఆ స్థాయిలో వేడెక్కింది. విజయోత్సవ సభలతో అధికార పార్టీ ఏడాది పాలన విజయాలపై డప్పు మోగిస్తోంది. ఏడాదిలో తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని బీఆర్ఎస్ మండిపడుతోంది. కేసీఆర్ టార్గెట్‌గా రేవంత్‌ విమర్శలు గుప్పిస్తుంటే గులాబీ దళం అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది.

సీఎం రేవంత్ హనుమకొండ కేంద్రంగా కేసీఆర్‌ టార్గెట్‌గా ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు సంధించారు. వీటిపై గులాబీ దళం నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వచ్చాయి. రేవంత్ గంజాయి మొక్క అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గంజాయి మొక్కను పీకి అవతల పారేస్తామంటూ హెచ్చరించారు. తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్‌ను ఇలా విమర్శిస్తారా అంటూ ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలకుర్తిలో రాక్షసుడిని ఆడబిడ్డ ఓడించిందన్న వ్యాఖ్యలకూ కౌంటర్ ఇచ్చారు ఎర్రబెల్లి. తనను రాక్షసుడు అని అంటున్నారు, అవును ప్రజలకు పనులు చేయడంలో తాను రాక్షసుడినే అన్నారు ఎర్రబెల్లి. కాంగ్రెస్ పార్టీ హనుమకొండలో వంచన సభ నిర్వహించిందన్నారు మాజీ స్పీకర్ మధుసూదన చారి. వటవృక్షంలా ఎదిగిన బీఆర్ఎస్‌ను కట్టడి చేయడం ఎవరి తరం కాదన్నారు. 11 నెలల పాలనలోనే రాష్ట్ర ప్రభుత్వం 85 వేల కోట్ల రూపాయల అప్పు చేసిందని బీఆర్ఎస్ నేత మధుసూదనా చారి ఆరోపించారు.

కేసీఆర్‌పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు చూసి వరంగల్ జిల్లా రైతులు ఆశ్చర్యపోయారని అన్నారు మరో బీఆర్ఎస్‌ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. రైతుల కోసం ఏదైన ప్రకటన ఉంటుందని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురైందన్నారు. పంటల దిగుబడిలో తెలంగాణ సాధిస్తున్న రికార్డు కేసీఆర్ ఘనతే అన్నారు రాజేశ్వర్ రెడ్డి. అంతటి అద్భుత కళా క్షేత్రాన్ని ప్రభుత్వం ప్రారంభించినా ఒక్క కవినీ సన్మానించకపోవడం బాధకరమన్నారు మాజీ మంత్రి రాజయ్య.

కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ అంటున్నారు, అసలు కేసీఆర్ వస్తే ఎదుర్కునే దమ్ము రేవంత్‌కు ఉందా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. రేవంత్ సీఎం అయినప్పటి నుంచి కేసీఆర్ నామస్మరణ చేస్తున్నారని గండ్ర విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ నామరూపాల్లేకుండా చేయడం ఎలా సాధ్యం అవుతుందని బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రశ్నించారు.

విమర్శలు, ప్రతి విమర్శలు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయం రోజు రోజుకు హీట్ ఎక్కుతుంది. అధికార, ప్రతిపక్షాలు ఎవరూ తగ్గడం లేదు..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..