CM KCR: “అప్పుడెట్లుండె తెలంగాణ… ఇప్పుడెట్లైంది తెలంగాణ”
మూడు గంటలే కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. మీకు 24 గంటలు కరెంటు కావాలా వద్దా అని ప్రజాశీర్వాద సభల్లో కేసీఆర్ జనాన్ని ప్రశ్నించారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు దరఖాస్తు చేసుకున్నా.. రైతు బంధు నేరుగా ఖాతాల్లో వేస్తున్నామని తెలిపారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రైతు బంధు కింద రూ.16 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రచారహోరులో బీఆర్‌ఎస్ జోరు చూపిస్తుంది. ప్రజంట్ కారు టాప్ గేరులో దూసుకెళ్తోంది. హ్యాట్రిక్ టార్గెట్‌గా తెలంగాణ దంగల్‌లో గులాబీ గులాల్ వ్యూహం అమలు చేస్తుంది. రాపిడ్ ఫైర్‌లా కేసీఆర్ ప్రజాశీర్వాద సభలు సాగుతున్నాయి. భైంసా, ఆర్మూర్, కోరుట్ల…. మూడు సభలు.. ఆరు బుల్లెట్లు అన్నట్లుగా ఉంది వ్వవహారం. ఒకప్పుడు తెలంగాణ ఎట్లుండే..ఇప్పుడెట్లుంది… కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎలా ప్రగతి పథంలో దూసుకెళ్తోందో నిదర్శనాలు కళ్ల ముందున్నాయన్నారు కేసీఆర్.
ధరణిపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టారాయన. ధరణి వుంది కాబట్టీ ఇవాళ టింగ్ టింగ్ అంటూ ఠంచణ్‌గా రైతు బంధు సొమ్ము ఖాతాల్లో పడుతుందన్నారు. ధరణి కావాలా? దళారి వ్యవస్థ కావాలా ? ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సకల జనుల సమగ్రాభివృద్ది బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారాయన. రైతు బంధు, దళిత బంధు కొనసాగుతాయన్నారు. అన్ని వర్గాలను సమంగా చూసేవాళ్లు కావాలా? మతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్లు కావాలా? అని ప్రశ్నించారు కేసీఆర్.
కాంగ్రెస్, బీజేపీల మాటలను నమ్మి ఆగం ఆగం కావద్దన్నారు కేసీఆర్. అభివృద్ది, సంక్షేమం కేవలం బీఆర్‌ఎస్‌తో మాత్రమే సాధ్యమన్నారాయన. ఓటు వజ్రాయుధం.. ఆలోచించి సరైన నిర్ణయంతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కేసీఆర్. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. బతికున్నంత వరకు సెక్యులరిజం విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. 93 లక్షల మంది రేషన్ కార్డుదారులకు వచ్చే సంవత్సరం మార్చి నెల నుంచి సన్నబియ్యం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఎలక్షన్ కోడ్ కారణంగా కొద్ది మందికి మాత్రమే రుణమాఫీ ఆగిపోయిందన్నారు. తొందరలో అవి కూడా కంప్లీట్ చేస్తామన్నారు. తెలంగాణలోని ప్రజలతో సమానంగా మహారాష్ట్రలో ప్రజలకు ఉండాల్సిన సౌకర్యాలు లేవన్నారు. నిజానికి మహారాష్ట్ర ఏర్పడి దాదాపు 70 ఏళ్లు కాగా, తెలంగాణ కేవలం తొమ్మిదిన్నరేళ్ల పసి వయస్సులోనే ఎంత అభివృద్ధి సాధించిందన్నారు. మహారాష్ట్రలోని రైతులు తెలంగాణలో భూమిని కొనడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు. నీరు పుష్కలంగా ఉండటం, ఉచిత విద్యుత్ సరఫరా అందుకు కారణమన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..