AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Review: నల్గొండ టౌన్, సాగర్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ఫోన్‌లో మంత్రి, అధికారులకు ఆదేశాలు!

నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

CM KCR Review: నల్గొండ టౌన్, సాగర్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ఫోన్‌లో మంత్రి, అధికారులకు ఆదేశాలు!
Cm Kcr
Balaraju Goud
|

Updated on: Apr 28, 2022 | 4:53 PM

Share

CM KCR Review on Nalgonda: నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం నార్కట్ పల్లిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్.. అనంతరం నల్గొండ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

గతంలో ఆదేశించిన మేరకు పనుల పనితీరుపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. నల్లగొండ టౌన్‌లో అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైన రీతిలో ‘నల్లగొండ కళాభారతి ‘ సాంస్కృతిక కేంద్రాన్ని 2000 మంది సామర్థ్యంతో తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. పానగల్లు ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ ను పచ్చదనంతో సుందరీకరించాలన్నారు. నల్లగొండ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు సెలవుల్లో వచ్చి కుటుంబ సభ్యులు, పిల్లలతో ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్టుల నుంచి డిజైన్లు తెప్పించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

ఇక, ఇప్పటికే ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను సీఎం పర్యవేక్షించారు. ఫోటోలు నివేదికల ద్వారా పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇతర అధికారులు సీఎం కేసీఆర్‌కు పనుల పురోగతిపై సీఎంకు వివరించారు. కుటుంబంతో కలసి మార్కెట్‌కు వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి, వారికి రక్షణతో కూడిన పచ్చని పార్కు, ఆటస్థలంతో కూడిన చిల్డ్రన్ కేజ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. నల్లగొండ టౌన్ లో వీలైన చోటల్లా అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో పచ్చదనం, నర్సరీల గురించి సీఎం ఆరా తీశారు. విరివిగా మొక్కలు నాటడంతో పాటు, రహదారుల విస్తరణ, తదితర కారణాలతో తొలగిస్తున్న పెద్ద పెద్ద వృక్షాలను ట్రాన్స్ లొకేషన్ చేస్తున్నామనీ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సీఎంకు వివరించారు.

అదే సమయంలో నాగార్జున సాగర్ అభివృద్ధి పనులపై సీఎం ఆరా తీశారు. సాగర్‌తో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతి గురించి ఎమ్మెల్యే భగత్‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు. వీటికి సంబంధించి టెండర్లు ఈ మధ్యే పూర్తియిన విషయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఇందుకు సంబంధించిన నిధులు మంజూరై చాలా రోజులయ్యాయనీ, పనులు వేగవంతం చేయాలని సీఎం ఆధికారులను ఆదేశించారు.

ఇదే సందర్భంలో నల్గొండ మర్రిగూడ బైపాస్ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్, నల్లగొండలో క్లాక్ టవర్ జంక్షన్ వద్ద ఆర్ ఎండ్ బి గెస్ట్ హౌస్, సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్ అండ్ బి ఆఫీస్‌ల నిర్మాణాలను సీఎం మంజూరు చేశారు. సమీక్షా సమావేశం నుండి రోడ్లు భవనాలు శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసి, నిర్మాణానికి సంబంధించిన జీవోలు జారీ చేయాలన్నారు. ఆరు నెలల్లోపు వాటికి సంబంధించిన నిర్మాణ పనులు పూర్తి కావాలన్నారు. అదే విధంగా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిందిగా కార్యదర్శి స్మిత సబర్వాల్‌కు ఫోన్‌లో సీఎం ఆదేశించారు. మిర్యాలగూడలో కోర్టు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు.

Read  Also…. Kishan Reddy on TRS: మంత్రిగా ఉండి కేబినెట్‌కు వెళ్లలేని వాళ్లు.. దేశాన్ని ఏం ఉద్ధరిస్తారుః కిషన్ రెడ్డి