AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy on TRS: మంత్రిగా ఉండి కేబినెట్‌కు వెళ్లలేని వాళ్లు.. దేశాన్ని ఏం ఉద్ధరిస్తారుః కిషన్ రెడ్డి

టీఆరెస్ నేతలు, నాయకత్వం పూనకం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి. బీజేపీ అంటే భయపడుతున్నారన్నారు.

Kishan Reddy on TRS: మంత్రిగా ఉండి కేబినెట్‌కు వెళ్లలేని వాళ్లు.. దేశాన్ని ఏం ఉద్ధరిస్తారుః కిషన్ రెడ్డి
Kisanreddy
Balaraju Goud
|

Updated on: Apr 28, 2022 | 4:46 PM

Share

Kishanreddy on TRS Leaders: టీఆరెస్ నేతలు, నాయకత్వం పూనకం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి. బీజేపీ అంటే భయపడుతున్నారన్నారు. నిద్రలో, లేచినా, కూర్చున్నా, ఫామ్ హౌస్‌లో ఉన్నా.. ఎక్కడున్నా బీజేపీ అంటే భయం వారిలో కనిపిస్తోందన్నారు. గురువారం హైద్రాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గుణాత్మక పాలన అంటే నిజాం రాజ్యం లాంటి పాలనా? గుణాత్మకమైన పాలనా అంటే తండ్రీ కొడుకుల పాలనా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అనుకోవడం గుణాత్మక మార్పా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో మార్పు రావాలని, ఆ మార్పు కల్వకుంట్ల కుటుంబంతోనే వస్తుందని అన్నట్టుగా మాట్లాడుతున్నారన్నారు.

దేశంలో ప్రతి పౌరుడికి ప్రజాస్వామ్యబద్ధంగా హక్కు ఉంటుందన్న కిషన్ రెడ్డి.. ఒక పౌరుడిగా ఫ్రంట్ పెట్టుకోవచ్చు, టెంట్ వేసుకోవచ్చు.. దానికి మాకు అభ్యంతరం లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా ఆ హక్కు, వెసులుబాటు ఉంది. అయితే, టీఆర్ఎస్ నాయకులు చెట్ల మీద విస్తారకులు కుడుతున్నారని విమర్శించారు. గత 8 ఏళ్లలో తెలంగాణను ఏదో ఉద్ధరించినట్టు దేశంలో గుణాత్మక పాలన రావాలి అంటున్నారని విమర్శించారు.

అప్పు చేసి అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి KCR పై మండిపడ్డారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా సరే భారత్ అన్నా మోడీ అన్నా ఒక గౌరవం ఉంటుందన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న 22 వేల మంది భారతీయులను సురక్షితంగా ఇండియాకు రప్పించినట్టుగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణను కేసీఆర్ ఏం ఉద్ధరించారని కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర మంత్రి గా ఉండి కూడా ఢిల్లీలో ఉంటూ కేబినెట్ సమావేశాలకు కూడా కేసీఆర్ వెళ్లలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. గల్ఫ్ దేశాల్లో కార్మికులు సగౌరవంగా ఉద్యోగాలు చేస్తున్నారు. గల్ఫ్ పాలకులు, రాజులకు మోడీ అంటే అత్యంత గౌరవం. అందరూ ఆయన్ను ఓ మిత్రుడిలా భావిస్తున్నారని కిషన్ తెలిపారు.

దేశంలో 65 వేల టీఎంసీల నీరు వృధా అవుతుందని కేసీఆర్ చెప్పడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఏం చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. జల వనరుల వినియోగంపై ఇప్పటికే కేంద్రం ఓ విధానాన్ని రూపొందించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. నదుల అనుసంధానంపై కేసీఆర్ ఇల్లెక్కి గగ్గోలు పెడుతున్నారని కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు

విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తారని తెలంగాణలో కేసీఆర్ సర్కార్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిందన్నారు. ఈ విషయమై కేంద్రం చెప్పినా కూడా తప్పుడు చేశారన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా అదే చేశారన్నారు.వరి ధాన్యం విషయమై కూడా ఇదే రకమైన అబద్దాలు ఆడారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అబద్దాలు ప్రచారం చేసే కేసీఆర్‌కు అర్ధం కావడం లేదన్నారు.