Telangana: తెలంగాణలో సర్కారు బడులకు మంచి రోజులు.. మారిపోనున్న రూపురేఖలు
ప్రవేట్ స్కూళ్లకు ఇక ఎవరూ వెళ్లరు.. అందరూ ప్రభుత్వ స్కూళ్లకే వస్తారు.. అంతలా సీఎం కేసీఆర్ సర్కారీ బళ్లను డెవలప్ చేస్తున్నారని మంత్రి ఎర్రబెళ్లి తెలిపారు.
భవిష్యత్తులో పేద విద్యార్థులు ఎవరూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రభుత్వ స్కూళ్లను, విద్యను పటిష్టం చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూర్ మండలం, గోపాలగిరి గ్రామంలో 100 స్మైల్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల భవన ఆధునీకరణ స్మార్ట్ క్లాస్ ను ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
పిల్లలకు కావాల్సింది పాఠశాలల్లో మంచి వసతి అని… ఆ ఏర్పాట్లు బాగా ఉంటే పిల్లలకు చదువు బాగా వస్తుందన్నారు. స్కూల్ బిల్డింగ్స్ కోసం సీఎం కేసీఆర్ గారు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అనేక గురుకులాలు పెట్టి రెసిడెన్షియల్ విద్య అందిస్తున్నారని తెలిపారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థికి 1,25,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారని వివరించారు. భవిష్యత్‌లో ఏ ఒక్కరూ ప్రైవేట్ స్కూల్ వెళ్లకూడదని సీఎం ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తున్నారని చెప్పారు.
ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి గారు అక్కడ ఉన్న పిల్లలతో సరదాగా ముచ్చట పెట్టారు. పిల్లలకు చాక్లెట్లు ఇచ్చి అభినందించారు. వసతుల గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. నా పేరు ఏమిటి తెలుసా ? అని మంత్రి దయాకర్ రావు చిన్న పిల్లలను అడిగినప్పుడు వారు చెప్పిన అంబేద్కర్ అని సమాధానం చెప్పడం అక్కడున్న అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంబేద్కర్ ను ఇంతగా గుర్తుపెట్టుకుని అభిమానిస్తున్న పిల్లలని చూసి మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ప్రారంభోత్సవంలో జెడ్పీటీసి మంగళపల్లి శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ పసుమర్తి శాంత, ప్యాక్స్ చైర్మన్ హరి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, ఎంపీపీ అంజయ్య, ఎంపీటీసీలు, నాయకులు, రైతు సంఘాల నేతలు, అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం