AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Press Meet : కేంద్రంపై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్.. బీజేపీపై హాట్ హాట్ కామెంట్స్‌..

CM KCR on Budget 2022: కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్... దశాదిశ, నిర్దేశం లేని, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్‌తో ప్రయోజనం శూన్యమని అన్నారు.

CM KCR Press Meet : కేంద్రంపై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్.. బీజేపీపై హాట్ హాట్ కామెంట్స్‌..
Cm Kcr Pressmeet Updates
Ram Naramaneni
| Edited By: Shiva Prajapati|

Updated on: Feb 01, 2022 | 8:25 PM

Share

కేంద్ర బడ్జెట్‌పై ఇప్పటికే తన వెర్షన్ వినిపించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. తాజాగా ప్రెస్‌ మీట్ పెట్టి కేంద్ర వైఖరిపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇది పసలేని బడ్జెట్ అని కేసీఆర్ పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ పెదవి విరుపు >>దశ-దిశ లేని బడ్జెట్‌, నిరాశ-నిస్పృహల బడ్జెట్ >>పనికిమాలిన.. పసలేని బడ్జెట్ >>కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగం ఆసాంతం డొల్ల – కేసీఆర్ >>కేంద్రం జబ్బలు చరుసుకోవడం తప్ప ఉపయోగం లేదు >>మసిపూసి మారేడు కాయ చేసిన గోల్‌మాల్ బడ్జెట్ >> వ్యవసాయ రంగానికి చేస్తోంది శూన్యం >> ఐటీ స్లాబ్‌లు మార్చకపోవడంతో వేతన జీవుల ఉస్సూరు >> ప్రపంచం హెల్త్, ఇన్‌ఫ్రాపై దృష్టిపెడుతుంటే.. దేశంలో మాత్రం ఆ ఊసే లేదు >> దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టలేదు.. హెల్త్‌కి ఇచ్చిందేమీ లేదు

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Feb 2022 08:24 PM (IST)

    నోటిఫికేషన్లపై సీఎం స్పందన.. ఉద్యోగాల భర్తీ ఎప్పుడంటే..

    తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనలు విడుదల చేస్తామన్నారు. మల్టీ జోనల్ విధానంతో కేవలం 5 శాతం నాన్ లోకల్ వారు మాత్రమే వస్తారని సీఎం వివరించారు. పరిపాలన గురించి తెలియని వారే 317 జీవోను విమర్శిస్తున్నారని అన్నారు. ఈ జీవోతో స్థానికులకు ఉద్యోగవకాశాలు వస్తాయన్నారు.

  • 01 Feb 2022 08:22 PM (IST)

    భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది..

    ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక అంశాలపై రాజ్యాంగంలో స్పష్టత లేదని అన్నారు. అస్పష్ట రాజ్యాంగాన్ని పదే పదే సవరించడం కాదని, మార్చాలని కోరారు సీఎం కేసీఆర్. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఫెడరల్ వ్యవస్థలకు తూట్లు పొడుస్తూ రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందని సీఎం విమర్శించారు. ఐఏఎస్‌లపై కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నించారు.

  • 01 Feb 2022 08:19 PM (IST)

    ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదు.. స్పష్టం చేసిన సీఎం కేసీఆర్..

    తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తుందంటూ వస్తున్న వదంతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈసారి 95 నుంచి 100కు పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఎన్నికలకు 6 నెలలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి తమ వద్ద బ్రహ్మాండమైన మంత్ర ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

  • 01 Feb 2022 07:16 PM (IST)

    హైదరాబాద్‌లో రిటైర్డ్ అఖిల భారత అధికారుల సదస్సు

    ప్రజల సహకారంతో పోరాడి తెలంగాణను సాధించాం.. ఇప్పుడు దేశ ప్రజల్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రిటైర్డ్ అఖిల భారత అధికారుల సదస్సు హైదరాబాద్‌లో జరుపబోతున్నామన్నారు. దేశం ఏ పంథాలో ముందుకెళ్లాలో చర్చ జరుపుతామన్నారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. కేంద్రం బుర్రలేని పనులపై యువత పోరాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

  • 01 Feb 2022 07:12 PM (IST)

    ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సెమీ ఫైనల్ కాదు..

    త్వరలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలు సెమీ ఫైనల్ కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గెలిస్తే బీజేపీకి అహంకారం మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటేనంటూ ఘాటైన కామెంట్స్ చేశారు. వాళ్లకేం చెప్పినా దున్నపోతు మీద వానపడ్డట్లేనని అన్నారు. 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. రేకు డబ్బాల్లో రాళ్లు వేసి సౌండ్ చేస్తోంది బీజేపీ సర్కార్ అని విమర్శించారు. ఈ దేశానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేసింది? అని ప్రశ్నించారు. చర్చకు తాను సిద్ధం అని సవాల్ విసిరారు సీఎం కేసీఆర్. ఏం వర్గానికి న్యాయం చేసిందో చెప్పాలన్నారు. దేశంలో ఆకలి రాజ్యం పెరిగిందని, దీనిపైనా చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. బెంగాల్‌లో ఎన్నికలు వస్తే ఠాగూర్‌లా వేషధారణ, పంజాబ్‌లో ఎన్నికలు వస్తే సిక్కుల మాదిరిగా వేషధారణ వేస్తారంటూ ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు.

  • 01 Feb 2022 07:04 PM (IST)

    దేశ ఆర్థిక స్థితి ఏమాత్రం బాగోలేదు.. గుణాత్మకమైన మార్పు అవసరం..

    దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రబల పరివర్తన కోసం ప్రయత్నిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం బుర్రలేని పనులపై రియాక్ట్ అవ్వాలని, విప్లవం సాధించాల్సింది యువతే అని అన్నారు. 75 ఏళ్ల తరువాత కూడా మన దేశ ఆర్థిక స్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి సిగ్గుతో తలదించుకునేలా ఉందని, కేంద్రం జీడీపీ లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలేనని అన్నారు.

  • 01 Feb 2022 06:53 PM (IST)

    బీజేపీ పతనానికి ఈ ఎన్నికలే పునాది..

    రాజకీయ పరిపక్వత లేని వాళ్లు, రాజకీయాల పట్ల పూర్తి అవగాహన లేని వాళ్లు.. త్వరలో జరుగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను రాబోయే 2024 జనరల్ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని చెబుతున్నారు. అది తలాతోక లేని ప్రచారం. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ స్థాయి తగ్గుతుంది. ఎవరైనా గెలువచ్చు గానీ.. బీజేపీ స్థానాలు తగ్గుతాయి. ఇది 2024లో బీజేపీ పతనానికి పునాది.

  • 01 Feb 2022 06:50 PM (IST)

    ప్రధాని మోదీ ఒత్తిడి తీసుకువచ్చారు.. కేసీఆర్ ఆరోపణలు..

    అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ సెంటర్‌ను హైదరాబాద్‌లో పెట్టాలని భావిస్తే… అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేయాలని మోదీ ఒత్తిడి తెచ్చారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అహ్మదాబాద్‌లో గిఫ్ట్ సిటీ పేరుతో శిఖండిని ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్.. ఆత్మద్రోహం చేసుకున్నారు కదా? అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రానికి మనసు ఉంటే తెలంగాణ ప్రభుత్వాన్ని పొగిడి ఉండాలని, అహ్మదాబాద్‌లో ఇంకో ఆర్బిట్రేటర్ సెంటర్‌ను పెడుతున్నామని చెప్పి ఉండాల్సిందన్నారు.

  • 01 Feb 2022 06:48 PM (IST)

    నదుల అనుసంధానం బిగ్ జోక్.. కేంద్రంపై కేసీఆర్ ఫైర్..

    నదుల అనుసంధానం అనేది బిగ్ జోక్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘‘మమ్మల్ని అడగకుండా.. మా నీళ్లపై మీరు ఎలా ప్రకటన చేస్తారు? గోదావరి-కృష్ణా-కావేరి నదులను అనుసంధానం చేస్తామని ఎలా చెప్తారు. ఏ అధికారంతో కేంద్రం ఆ ప్రకటన చేసింది. ఎవరిని మోసం చేయడానికి అనుసంధానం ప్రకటన? నోటికి ఏదొస్తే అది చెప్తాం.. ఎవరిని పడితే వారిని తిడతామంటే ఎలా?’’ అని కేంద్రంపై ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్.

  • 01 Feb 2022 06:32 PM (IST)

    తెలంగాణ సొమ్ముతో కేంద్రం సోకులు..

    అభివృ‌ద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అవినీతి లేకుండా రాష్ట్రాన్ని కాపలా కాస్తున్నామన్నారు. రాష్ట్రంలో గుడుంబా గబ్బు లేదు.. పేకాట క్లబ్బు లేదు.. అని అన్నారు. సొల్లు పురాణం పెట్టి కుమ్మరిస్తే కామ్‌గా ఉండాలా? అని కేంద్రంపై ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చేది గుండు సున్నా అని పేర్కొన్న సీఎం.. తెలంగాణ సొమ్ముతో కేంద్రం సోకులు పడుతోందని దుయ్యబట్టారు.

  • 01 Feb 2022 06:27 PM (IST)

    అలాంటి వారిని మొరిగే కుక్కు అంటాం.. కేసీఆర్ హాట్ కామెంట్స్..

    మతం పేరుతో దేశంలో విభజన తీసుకువస్తున్నారని బీజేపీ విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి కోసం.. పోయిన ఆర్థిక సంవత్సరంలో రూ. 1.51 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని, ఈసారి రూ. 1.80 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని విమర్శించారు. కరోనా పరిస్థితుల్లోనూ రాష్ట్ర రాబడి పెరిగిందని వివరించారు. రాష్ట్రంలో అన్ని పరిస్థితులు బాగున్నాయి కాబట్టే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టించామన్నారు. ఈ పరిస్థితిని విమర్శించే వాళ్లను మొరిగే కుక్కలు అంటాం.. అని ఘాటైన కామెంట్స్ చేశారు. తాము అవినీతిపరులమైతే టీఎస్ ఐపాస్ ఎందుకు పెడతాం? అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో బిల్డింగ్ కట్టాలంటే ఎస్ఎఫ్‌టి చొప్పున లంచం అడుగుతారని అన్నారు.

  • 01 Feb 2022 06:21 PM (IST)

    భారతదేశం అభివృద్ధి చెందాలంటే.. బీజేపీని బంగాళాఖాతంలో కలిపివేయాలి..

    బీజేపీపై, కేంద్ర ప్రభుత్వ విధానాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటైన పదజాలంతో తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి సిగ్గు, శరం ఏమీ లేవు అంటూ తీవ్ర కామెంట్స్ చేశారు. ‘ఎవరికైనా సిగ్గు, శరం ఉంటుంది. కనీసం ఎవరైనా ఏమైనా అనుకుంటరేమో అనే ఆలోచన అయినా ఉంటుంది. కానీ బీజేపీ అవేమీ లేదు. ఛీ ఛీ చాలా దరిద్రమైన పార్టీ. చాలా విషయాల్లో చాలా దరిద్రమైన పార్టీ. భారత సమాజం అనుకున్నది అనుకున్నట్లు పురోగమించాలంటే ఈ దరిద్ర పార్టీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పడేయాలి. వందశాతం ఆ పని మేం చేస్తాం. ఈ పార్టీ నేతలకు పొగరు నెత్తికెక్కింది. ఎవరి మీద పడితే వారి మీద, కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. దేశంలో ఏది అవసరమో అది చేస్తాం.. బీజేపీ కూకటి వేళ్లతో సహా పెకిలిస్తాం. దుర్మార్గాలను భరిస్తూ కూర్చోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఉద్యమిస్తాం. ఇది ప్రజాస్వామ్యం. దేశంలో కురుస బుద్ధి ఉన్న ప్రధాన మంత్రి ఉన్నారు.

  • 01 Feb 2022 06:09 PM (IST)

    దోపిడీ దారులను విదేశాలకు పంపించేది మీరే.. బీజేపీపై కేసీఆర్ హాట్ హాట్ కామెంట్స్..

    నల్ల ధనం తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రతిగా నల్లధనం కలిగిన దోపిడీ దారులను విదేశాలకు పంపించిందంటూ సంచలన కామెంట్స్ చేశారు. నల్లధనం తెస్తాం.. ప్రతీ ఇంటికి రూ. 15 లక్షలు వేస్తాం గప్పాలు చెప్పారంటూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. చెప్పిన నల్లధనం తేకపోగా.. బీజేపీ హయాంలోనే అతి ఎక్కువ బ్యాంకు మోసాలు జరిగాయన్నారు. బ్యాంక్ మోసగాళ్లను విదేశాలకు పంపించింది బీజేపీ ప్రభుత్వమే అని విమర్శించారు. గజదొంగలు, బ్యాంకు దోపిడీదారులు, బ్యాంకులను ముంచిన వాళ్లందరూ బీజేపీ హయాంలోనే విదేశాలకు పారిపోయి ఎంజాయ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘బ్లాక్ మనీ తీసుకురాలే.. మన్ను తీసుకురాలే. 15 లక్షలు ఇస్తమని.. 15 రూపాయలు కూడా ఇవ్వలేదు.’’ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్నివన్నీ బోగస్ మాటలే అని నిప్పులు చెరిగారు.

  • 01 Feb 2022 06:02 PM (IST)

    ఎల్‌ఐసీని ఎందుకు అమ్మడం?.. బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారా? కేంద్రంపై సంచలన ఆరోపణలు..

    ఎల్‌ఐసీని విక్రయిస్తున్నామని బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. ‘‘నాకు ధిమాక్ కొంచెం తక్కువ. ఎల్‌ఐసిని ఎందుకు అమ్ముతున్నారో అర్థం కావడం లేదు. ఎవరి ప్రయోజనాలు ఆశించి ఎల్ఐ‌సీని అమ్ముతున్నారు. అంతర్జాతీయంగా అమెరికాలో ఉన్న అతిపెద్ద బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారా? వారికి లాభం చేకూర్చేందుకే ఈ నిర్ణయాలా? ఇదేం దందా? ఎవరిని మోసం చేస్తున్నారు.’’ అని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

  • 01 Feb 2022 05:57 PM (IST)

    బీజేపీ సర్కార్ ఎవరికి కోసం ఉంది?.. కేంద్రంపై కేసీఆర్ నిప్పులు..

    ‘‘కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి పెంచలేదు, విద్యకు పెంచలేదు, ఆరోగ్యానికి పెంచలేదు, దళితులకు పెంచలేదు, గిరిజనులకు పెంచలేదు, రైతులకు పెంచలేదు.. మరి ఎవరికి పెంచారు? రేకు డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్లు ఒర్లడం తప్ప.. ఈ బీజేపీ సర్కార్ వల్ల దేశ ప్రజలెవరికీ మేలు జరుగడం లేదు.’’ అని విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్.

  • 01 Feb 2022 05:53 PM (IST)

    ‘‘ఆకలి సూచీలో అట్టడుగున ఇండియా.. ఇదీ బీజేపీ పాలన..’’

    ప్రపంచ ఆకలి సూచీలో భారత్ అత్యంత దారుణమైన స్థితికి దిగజార్చింది బీజేపీ ప్రభుత్వం అని సీఎం కేసీఆర్ విమర్శించారు. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే కూడా అధ్వాన్నమైన స్థితికి ఇండియాను తీసుకువచ్చారని నిప్పులు చెరిగారు. 116 దేశాల్లో సర్వే చేస్తే.. ఇండియా 101వ స్థానంలో నిలిచిందన్నారు. ఇండియా కన్నా 15 దేశాలే అధమ స్థాయిలో ఉన్నాయని, ఇదీ బీజేపీ పాలనా విధానాలు అని విమర్శించారు.

  • 01 Feb 2022 05:49 PM (IST)

    ‘మత పిచ్చి లేపడం, దేశాన్ని అమ్మడమే బీజేపీ పాలసీ..’

    భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే దేశాన్ని అమ్మడే తప్ప మరోటి లేదని విమర్శించారు తెలంగాణ సీఎం కేసీఆర్. నమ్మి ఓట్లేసిన ప్రజలను ముంచడం, దేశాన్ని అమ్మడమే ఆ పార్టీ పని విమర్శించారు. ‘‘మత పిచ్చి లేపాలి.. మంది మీద పడి ఏడవాలి.. దేశ ఆస్తులన్నీ అమ్మాలి.. దానిని కవర్ చేసుకోవడానికి తమాషా చేస్తూ.. మహాభారత శ్లోకం, భాగవత శ్లోకం అని చెప్పి జనాలను గోల్‌మాల్ చేయాలి. ఇదీ బీజేపీ అంటే.’’ అని ఘాటైన కామెంట్స్ చేశారు సీఎం కేసీఆర్.

  • 01 Feb 2022 05:45 PM (IST)

    సంక్షోభ సమయంలో వైద్య రంగంపై నిర్లక్ష్యమా?..

    కరోనా వంటి సంక్షోభ కాలంలో బడ్జెట్‌లో కనీస కేటాయింపులు చేయలేదని విమర్శించారు సీఎం కేసీఆర్. వైద్యానికి సంబంధించి ఎలాంటి ఇన్‌ఫ్ట్రాస్టక్చర్ డెవలప్ చేయలేదని దుయ్యబట్టారు.

  • 01 Feb 2022 05:36 PM (IST)

    పైన పటారం.. లోన లొటారం గుజరాత్ మోడల్.. హాట్ హాట్ కామెంట్స్ చేసిన కేసీఆర్..

    గుజరాత్ మోడల్ అంటూ వచ్చిన మోడీని నమ్మి జనాలు ఓట్లేస్తే.. అందరికీ చిప్ప చేతికిస్తున్నారంటూ విమర్శించారు సీఎం కేసీఆర్. గుజరాత్ మోడల్‌లో ఏముందడని, పైన పటారం లోన లోటారం మాదిరిగా గుజరాత్ మోడల్ ఉంటుందని ఎద్దేవా చేశారు. పేదలను పూర్తి హీనంగా చేసే మోడల్.. గుజరాత్ మోడల్ అని విమర్శించారు.

  • 01 Feb 2022 05:33 PM (IST)

    దేశాన్ని ఏలుతుంది తెలివి తక్కువ ప్రభుత్వం..

    కేంద్ర ప్రభుత్వానికి ఘోరమైన నిర్ణయాలు అని విమర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం పవర్ రిఫార్మ్స్ అనే మెంటల్ పట్టుకుందని ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పించారు సీఎం. ఈ ప్రభుత్వానికి అసలు మెదడే లేదంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు. కేంద్రం అవలంభించేది చెత్త పవర్ పాలసీ అని విమర్శించారు. విద్యుత్ సంస్కరణలతో పేరుతో వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. దేశంలో తెలివితక్కువ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.

  • 01 Feb 2022 05:29 PM (IST)

    ఇవేం విధానాలు.. దేశంలో నిరుద్యోగ రేటు పెరిగింది..

    కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగిపోయిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. జాతీయ సగటు అనేక రాష్ట్రాల కంటే తక్కువగా ఉందని అన్నారు. కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు ఉపాధిని కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో ఉపాధి కల్పించాల్సిన సర్కార్.. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా రూ.25 వేల కోట్లు కోత పెట్టారని విమర్శించారు. మొత్తం రూ. 98 వేల కోట్లు ఉంటే.. 75 వేల కోట్లకు కుదించారని అన్నారు.

  • 01 Feb 2022 05:25 PM (IST)

    ఎరువుల ధరలు పెంచి రైతులకు గిఫ్ట్ ఇచ్చారు..

    కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. రైతులను ఆగమాగం చేస్తున్నారని ఆరోపించారు. రైతులను ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేసి దాదాపు 750 మంది రైతుల మృతికి కారణమైంది కేంద్ర ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు. ప్రధాని క్షమాపణలు చెప్పారు కానీ, బడ్జెట్‌లో వారిని గురించి కనీస ప్రస్తావన లేదని దుయ్యబట్టారు. క్షమాపణలు చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారు గానీ, రైతులపై వేధింపులు పెంచారని వ్యాఖ్యానించారు. రైతులకు సంబంధించి అన్ని పరికరాలపై, ఎరువులపై సబ్సిడీలను తగ్గించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన బహుమతి ఇది అని వ్యాఖ్యానించారు కేసీఆర్.

  • 01 Feb 2022 05:20 PM (IST)

    ఒక రాష్ట్రం కేటాయించినంత కూడా కేటాయించలే..

    గిరిజనులు, దళితుల పట్ల కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక రాష్ట్రం కేటాయించిన స్థాయిలో కూడా కేంద్రం కేటాయించకపోవడం దారుణం. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం 3 వేల కోట్లు పెడితే, దేశం మొత్తానికి కేంద్రం 12 వేల కోట్లే పెట్టడం దుర్మార్గం.

  • 01 Feb 2022 05:17 PM (IST)

    దళిత, గిరిజనుల సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు..

    కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బడ్జెట్‌తో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం జరుగదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా పేదలకు గుండు సున్నానే అని వ్యాఖ్యానించారు. దేశంలో ఎస్సీలు 20 కోట్లు, ఎస్టీలు 10 కోట్ల జనాభా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, ఇవన్నీ తప్పుడు లెక్కలు అని విమర్శించారు. రెండు వర్గాల జనాభా కలిపి 38 నుంచి 40 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇంతమంది జనాభాకు కేంద్ర బడ్జెట్‌లో 12,800 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గం అని విమర్శించారు.

  • 01 Feb 2022 05:11 PM (IST)

    చెప్పింది శాంతి పర్వంలోని శ్లోకం.. ప్రవచించింది అధర్మం..

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ‘‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మహాభారతంలోని శాంతిపర్వంలో ఉండే శ్లోకాలు చెప్పారు. చెప్పిందేమో శాంతిపర్వంలోని శ్లోకాలు.. ప్రవచించింది మాత్రం అధర్మం, అసత్యం.’’ అని దుయ్యబట్టారు. బడ్జెట్ అంతా తప్పుల తడక అని, అంకెల గారడీ అని విమర్శించారు. ఇది చాలా దారుణమైన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు.

Published On - Feb 01,2022 4:52 PM