President Tour: హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

సెప్టెంబర్ 28వ తేదీన తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఖరారు అయ్యింది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులతో సమావేశమై సమీక్షించారు.

President Tour: హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
Draupadi Murmu
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 21, 2024 | 3:26 PM

సెప్టెంబర్ 28వ తేదీన తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఖరారు అయ్యింది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్రానికి తన ఒకరోజు పర్యటన సందర్భంగా తీసుకోవాలని చర్యలపై చర్చించారు, రాష్ట్రపతి ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను రాష్ట్రపతి ముర్ము ప్రారంభిస్తారు.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్‌ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను కోరారు. అదేవిధంగా, విమానాశ్రయం, రాష్ట్రపతి నిలయం, అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక పరికరాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

రాష్ట్రపతి కార్యాలయ అవసరాలకు అనుగుణంగా సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని, అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతి కుమారి ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. అదేవిధంగా, రాష్ట్రపతి కాన్వాయ్ ఉపయోగించాల్సిన రోడ్ల మరమ్మతులను కంటోన్మెంట్ బోర్డు, GHMC అధికారులతో సమన్వయంతో చేపట్టాలని R&B శాఖకు ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో పాములు పట్టేవారిని అందుబాటులో ఉంచాలని, అలాగే రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద, తేనెటీగలు వంటి వాటి నివారణకు ప్రత్యేక బృందాలను జీహెచ్‌ఎంసీ సమన్వయంతో ఏర్పాటు చేయాలని అటవీ శాఖను ఆదేశించారు.

రాష్ట్రపతి సందర్శనకు వెళ్లే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..