Big News Big Debate: పండిన పంట అమ్మేదెలా? కొనేదెవరు.? ధాన్యంపై అన్నదాతలను దగా చేస్తున్నదెవరు?
Paddy War: కొత్తగా వస్తున్న యాసంగి ధాన్యం నిల్వ చేసేందుకు సరిపడా గోదాములు లేవు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా ఉంటే.. పార్లమెంట్ నుంచి గల్లీ దాకా ఈ వ్యవహారం రాజకీయ సెగలు రేపుతోంది.
కేంద్రం పారాబాయిల్డ్ రైస్ అవసరం లేదంటోంది. రాష్ట్రం సొంతంగా కొనేందుకు అవకాశం లేదు. మరి పండిన పంట ఏం చేయాలి? వానాకాలంలో పంట ఇంకా మిల్లర్ల దగ్గర స్టాక్ ఉంది. కొత్తగా వస్తున్న యాసంగి ధాన్యం నిల్వ చేసేందుకు సరిపడా గోదాములు లేవు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా ఉంటే.. పార్లమెంట్ నుంచి గల్లీ దాకా ఈ వ్యవహారం రాజకీయ సెగలు రేపుతోంది. విమర్శలు.. ప్రతి విమర్శలతో దమ్కీ రాజకీయాలు దద్దరిల్లుతున్నాయి.రాజ్యాంగంలోనూ, చట్టాల్లోనూ ఎక్కడా రైస్ లేదని… ప్యాడీ అని మాత్రమే ఉందని కేంద్రం కొనాల్సిందే అంటోంది తెలంగాణ ప్రభుత్వం.
గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్న విధంగా రా రైస్‌ను మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రమంత్రి గోయెల్ అంటున్నారు. కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పదేపదే దమ్కీ ఇస్తున్నారని పార్లమెంటులోనే తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు గోయల్. రా రైస్ ఎంత ఇచ్చినా కొనడానికి సిద్దంగా ఉన్నామని వాళ్లకు ఎంత చెప్పినా ఎందుకు అర్ధం కావడం లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు పీయుష్. అయితే దమ్కీ ఇస్తుంది TRS కాదని.. మంత్రులు వచ్చినప్పుడు నూకలు తినడం అలవాటు చేసుకోవాలని తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడింది నిజం కాదా అని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. పార్లమెంట్ సాక్షిగా దమ్కీ అంటూ చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి హరీశ్.
వాస్తవానికి యాసంగిలో వరి వేయొద్దని ప్రత్యామ్నాయ పంటలే వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయినప్పటికీ అటు నీరు.. ఇటు విద్యుత్ అందుబాటులో ఉండటంతో 35లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు చేశారు రైతులు. దాదాపు 80లక్షల ఎకరాల పంట చేతికి వస్తుంది. కేంద్రం రా రైస్ అంటోంది. ఇటు రాష్ట్రం వడ్లనే కొనాలంటోంది. 20 లక్షల టన్నులు మిల్లర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరో 10లక్షలు స్థానిక విత్తనాలు ఇతర అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన 40లక్షల మెట్రిక్ టన్నుల పంట కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు అమోమయంలో ఉన్నారు. ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తే ధర రాదని, తరుగు పేరుతో దోపిడీ పెరుగుతుందనే భయాలూ ఉన్నాయి. మరి దమ్కీ రాజకీయాలు ఆపేసి వెంటనే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేస్తాయా.?
– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్
ఈ అంశంపైనే డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..