357 బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్స్ నిలిపివేసిన DGGI.. ఇటు సన్నీ యాదవ్‌పై లుకౌట్ నోటీస్
జనం ప్రాణాలతో చెలగాటమా? ఇంత మంది చావులకు కారణమవుతారా? అంటూ బెట్టింగ్ యాప్స్‌పై కేంద్రం సీరియస్ అయ్యింది. ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను బ్లాక్ చేసింది. మరోవైపు బయ్యా సన్నీ యాదవ్ సూర్యాపేట పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. ఇదంతా ఇలా జరుగుతుండగానే కరీంనగర్‌లో మరో విషాదం చోటుచేసుకుంది.

బెట్టింగ్ యాప్స్.. గల్లీ టు ఢిల్లీ దడ పుట్టిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టండి అంటూ యాడ్స్ ఇచ్చి సెలబ్రిటీలు డబ్బులు సంపాదిస్తుంటే ఈ యాప్స్ మాత్రం అనేక కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం చర్యలకు దిగింది. ఆన్‌లైన్ మనీ గేమింగ్ యాప్స్, వెబ్‌సైట్స్‌పై కొరడా ఝులిపించింది. ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను బ్లాక్ చేసింది డైరెక్టరెట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్-DGGI. చట్టవిరుద్ధమైన, ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ మనీ గేమింగ్ ఎంటిటీల 357 వెబ్‌సైట్‌లు, URLలను నిషేధించింది. గేమింగ్ సంస్థలకు చెందిన 2,400 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి 126 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసింది. అదే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది, ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ వాడొద్దని హెచ్చరించింది. గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌తో లింక్ చేసి ఉన్న 166 మ్యూల్ ఖాతాలను బ్లాక్ చేసింది, ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశాం, విచారణ కొనసాగుతుందని DGGI ప్రకటించింది.
ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెర్ బయ్యా సన్నీ యాదవ్‌పై పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. సన్నీ యాదవ్‌పై ఈ నెల 5న సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సన్నీ యాదవ్ వాఘా సరిహద్దు నుంచి పాకిస్తాన్ వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. ఏ మార్గంలో ఇండియాకి వచ్చినా సన్నీని అరెస్ట్ చేస్తామని సూర్యాపేట డీఎస్పీ ప్రకటించారు. ఈ పరిణామాల క్రమంలో సన్నీ యాదవ్ హైకోర్టును ఆశ్రయించాడు. నూతనకల్ పీఎస్‌లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు.
ఆన్‌లైన్ గేమ్స్‌పై ఇంత చర్చ జరుగుతుండగానే కరీంనగర్ జిల్లా్లో మరో విషాదం చోటుచేసుకుంది. గేమ్స్ ఆడి అప్పుల పాలైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన నిఖిల్ రావు హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన నిఖిల్ అప్పులు చేశాడు. గతంలో ఈ గేమ్స్ ఆడి పెద్ద మొత్తంలో నష్టపోతే తల్లిదండ్రులు హెచ్చరించారు. అయినా నిఖిల్‌లో మార్పు రాలేదు. మరోసారి పేరెంట్స్ దగ్గర ముఖం చెల్లదని గ్రహించిన నిఖిల్ వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
మరోవైపు బెట్టింగ్ యాప్ ప్రోత్సహిస్తున్న వారిపై జనసేన విద్యార్థి విభాగం ఓయు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జబర్దస్త్ వర్ష, హర్ష సాయిపై కంప్లైంట్ చేసింది. బెట్టింగ్ యాప్‌లతో చావులకు కారణమైన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..