AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly polls: తెలంగాణ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు.. పార్టీలతో విడి విడిగా చర్చించిన ఈసీ ప్రతినిధులు..

Telangana Assembly Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. మూడు రోజుల పాటు తెలంగాణలో ఉండి.. కీలక సమీక్షలు నిర్వహిస్తోంది సీఈసీ బృందం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఈ టీమ్ వరుస సమావేశాలతో బిజి బిజీగా గడపనుంది. ఇందులో భాగంగా మంగళవారం రాజకీయ పార్టీలతో భేటీ అయింది.

Telangana Assembly polls: తెలంగాణ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు.. పార్టీలతో విడి విడిగా చర్చించిన ఈసీ ప్రతినిధులు..
Central Election Commission
Sanjay Kasula
|

Updated on: Oct 03, 2023 | 9:57 PM

Share

పది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు అధికారులు. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీలతో విడి విడిగా చర్చించారు ఈసీ ప్రతినిధులు. ఈ సమావేశంలో ఆయా పార్టీలు తమ అభ్యంతారాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల గుర్తు పెద్ద టెన్షన్‌గా మారింది. ఇతర రాజకీయ పార్టీలకు కారు గుర్తును పోలి ఉండే సింబల్స్ కేటాయిస్తుండటంతో.. ఇప్పటికే ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కారును పోలిన సింబల్స్ గతంలో బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టిన నేపథ్యంలో కారును పోలిన గుర్తులను ఎవరికి కేటాయించవద్దని ఇప్పటికే ఎన్నికల సంఘానికి గులాబీ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. తాజా మీటింగ్ లోనూ ఈ అంశం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు బీఆర్‌ఎస్‌ నేతలు.

అటు.. తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేయించుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన అసెంబ్లీ, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు వినిస్తున్నాయి. బోగస్‌ ఓట్లు గురించి.. ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి..

తెలంగాణలో ఓట్లను చెల్లాచెదురు చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. దాంతో పాటు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేశారని రాష్ట్ర అధికారులే ఈ దొంగ ఓట్ల నమోదుకు సహకరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయగా.. తాజా సమావేశంలో..కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సీఈసీ సమావేశమైంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఉచిత కానుకలకి అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర బృందానికి.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు సీఈఓ వికాస్‌ రాజ్‌..

బుధవారం జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో CEC బృందం సమావేశం అవుతుంది. రాష్ట్ర సరిహద్దు జిల్లాపై ప్రత్యేక నిఘా, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత, రాజకీయ పార్టీల నేతల కోడ్ ఉల్లంఘన వంటి అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రజెంటేషన్ ఇస్తారు.

గురువారం ప్రభుత్వపరంగా అందిస్తున్న సహకారంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోనూ CEC బృందం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. మొత్తానికి.. రానున్న వారం, పది రోజుల్లోపు ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం