KTR-Congress: నెల రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రతిష్టపాలైందన్న కేటీఆర్.. ఓడిన ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారన్న కాంగ్రెస్

అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణ కోసం పోరాడేదీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే కేటీఆర్‌ మాటలకు అంతే ధీటుగా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఓడిన ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారన్న కాంగ్రెస్ నేతలు అటాక్‌కు దిగారు.

KTR-Congress: నెల రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రతిష్టపాలైందన్న కేటీఆర్.. ఓడిన ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారన్న కాంగ్రెస్
Mla Ktr
Follow us

|

Updated on: Jan 07, 2024 | 8:05 PM

అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణ కోసం పోరాడేదీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే కేటీఆర్‌ మాటలకు అంతే ధీటుగా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఓడిన ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారన్న కాంగ్రెస్ నేతలు అటాక్‌కు దిగారు.

కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్‌ సీఎం కానుందుకు బాధపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ప్రజల్లో కేసీఆర్ పట్ల ఉన్న అభిమానం ఏ మాత్రం చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణ కోసం పోరాడేది ఒక్క బీఆర్‌ఎస్ మాత్రమే అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ 39 స్థానాలు గెలిచిందని, ఇది తక్కువ సంఖ్య ఏమీ కాదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే అప్రతిష్ట మూటగట్టుకుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అపుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని తెలిపారు. తెలంగాణ అప్పులను సాకుగా చూపించి, హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ సమావేశంలో కామెంట్ చేశారు. జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో హన్మంత్ షిండే ఓడిపోతారని ఊహించలేదన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కూడా ఊహించని ఫలితాలు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దన్న కేటీఆర్, పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

ఇక ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ నేతలు ఓడిపోయిన ఫ్రస్టేషన్‌లో ఏవేవో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. తాము అధికారంలోకి వచ్చి నెల రోజులకే విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ బీఆర్‌ఎస్ నెరవేర్చలేకపోయిందని ధ్వజమెత్తారు. మరో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కేటీఆర్‌ తీరును తప్పుబట్టారు. కొత్త ప్రభుత్వంపై కేటీఆర్ టీమ్‌కు అసహనం కనబడుతోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని గుర్తు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…