Women’s Reservation Bill: కవితతో రష్యా అధికారిక న్యూస్ ఏజెన్సీ ఇంటర్వ్యూ.. మహిళా రిజర్వేషన్లపై కీలక కామెంట్స్..
Women's Reservation Bill: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందడంతో మహిళా లోకం సంబరాలు చేసుకుంటోంది. అయితే, ఇదే సమయంలో ఓ నిరాశ మహిళలను వెంటాడుతోంది. అదే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లలో ఓబీసీ, మైనార్టీ కోటా కల్పించాలని కోరుతూ డిమాండ్స్ స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జాతీయ స్థాయిలో పోరాడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..
Women’s Reservation Bill: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందడంతో మహిళా లోకం సంబరాలు చేసుకుంటోంది. అయితే, ఇదే సమయంలో ఓ నిరాశ మహిళలను వెంటాడుతోంది. అదే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లలో ఓబీసీ, మైనార్టీ కోటా కల్పించాలని కోరుతూ డిమాండ్స్ స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జాతీయ స్థాయిలో పోరాడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడారు. బిల్లుపై పాస్ అవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూనే.. అందులోని లోపాలను ప్రశ్నించారు. రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్లను తక్షణమే ఎందుకు అమలు చేయడం లేదని కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల నుంచే రిజర్వేషన్లు అమలు కావన్న అసంతృప్తి మహిళల్లో ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో బిజెపికి రాజకీయంగా ప్రయోజనం ఉండదని, ఆ క్రెడిట్ అంతా మహిళలదే అని చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఎమ్మెల్సీ కవిత తాజాగా రష్యా అధికారిక వార్తా సంస్థ అయిన స్పుత్నిక్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమే అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై మహిళల్లో ఉన్న సందేహాలను లేవనెత్తారు. మరి కవిత ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం..
ప్రశ్న : మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. మీ అభిప్రాయం ఏమిటి?
కవిత : రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగడానికి మొదటి అడుగుపడినందుకు సంతోషంగా ఉంది. దేశంలో కుల వ్యవస్థ ఉన్న నేపథ్యంలో బిల్లులో ఓబీసీల గురించి ప్రస్తావన లేదు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేదు. చాలా రాష్ట్రాల్లో అణగారిన వర్గాలు ఉన్నాయి. చట్టసభల్లో ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉండేది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల లోక్ సభలో మహిళా సభ్యుల సంఖ్య 181కి చేరుతుంది, ఇప్పుడు కేవలం 80 మంది మాత్రమే ఉన్నారు.
ప్రశ్న : పార్లమెంటులో బిల్లుపై చర్చ సమయంలో ఈ బిల్లు క్రెడిట్ తమదే అని అన్ని రాజకీయ పార్టీలు అన్నాయి. ఈ క్రెడిట్ ఎవరు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు ?
కవిత : ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ వ్యక్తికి క్రెడిట్ ఇచ్చే బదులు ఈ క్రెడిట్ దేశ మహిళలకు వెళ్లాలన్నది నా భావన. దేశానికి స్వతంత్రం తర్వాత మహిళలు, పురుషులకు సమాన ఓటు హక్కు కలిగింది. కానీ చాలా దేశాల్లో ఓటక్కు కోసం మహిళలు పోరాటం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అది ఒక గొప్ప విజయం. దూరదృష్టి కలిగిన మన నాయకులు మహిళలకు ఓటు హక్కు కల్పించారు. నిజానికి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది మహిళా నాయకులు రిజర్వేషన్ వద్దని అన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మహిళలకు సరైన వాటా దక్కుతుందని వారి ఆలోచనగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు గత 75 ఏళ్లలో చట్టసభల్లో మహిళలకు సరైన భాగస్వామ్యం లభించలేదు. అందు వల్లనే 1970ల తర్వాత రాజకీయాల్లో సరైనా భాగస్వామ్యం కోసం మహిళా రిజర్వేషన్ల డిమాండ్ వచ్చింది. ఆ పోరాట ఫలితమే 33 శాతం రిజర్వేషన్లు. ఇందుకు ఎవ్వరూ క్రెడిట్ తీసుకోవద్దు. ఎందుంటే 75 ఏళ్లుగా ఏ రాజకీయ పార్టీ మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాధాన్యత కల్పించలేదు. 10 రోజుల క్రితం మహిళా రిజర్వేషన్ల కోసం మా పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలోనే మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని తీర్మానం చేశాము. మా పార్టీ ఈ అంశాల పట్ల చిత్తశుద్ధితో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ గత తొమ్మిదిన్నరేళ్లుగా మహిళా రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించింది. రాజకీయ ఒత్తిడితోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలన్న నిర్ణయం జరిగింది. ఈ బిల్లుపై హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా తీర్మానం చేసింది. మహిళా బిల్లుకు అనుకూలంగా డిమాండ్లు వస్తుండడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తీర్మానం చేయడం వంటి వాటి వల్ల బిల్లును ప్రవేశపెట్టాలన్న ఒత్తిడి ప్రభుత్వంపై వచ్చింది.
ప్రశ్న: పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినప్పటికీ డీలిమిటేషన్ తర్వాతనే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అంటే డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు మహిళలు వేచి చూడాల్సిందేనా ?
కవిత: అవును, వచ్చే ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలు కావడం లేదన్న చిన్న అసంతృప్తి ఉంది. ఇది సరికాదు. ఈ బిల్లును తక్షణమే అమలు చేయాల్సింది. తక్షణమే అమలు చేయడం సాధ్యమే కానీ ప్రభుత్వం అసంబద్ధమైన సాంకేతిక కారణాలు చెప్పి తక్షణమే అమలు చేయడం లేదు. రాజ్యాంగం ప్రకారం 2026 తర్వాతనే డీలిమిటేషన్ జరగాల్సి ఉన్నప్పటికీ దానికి మహిళా రిజర్వేషన్లకు సంబంధం లేదు. ఆ విషయాన్ని ప్రభుత్వం ఎత్తిచూపుతూ రిజర్వేషన్లను జాప్యం చేస్తుంది. ప్రభుత్వం తలుచుకుంటే, రాజకీయంగా చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయవచ్చు. అందుకు 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకోవచ్చు.
ప్రశ్న: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో 2024 ఎన్నికల్లో బిజెపికి లాభం జరుగుతుందని మీరు భావిస్తున్నారా ?
కవిత: నేను ఏ మాత్రం అలా భావించడం లేదు. 2014 2019 ఎన్నికల వివరాలను బట్టి చూస్తే మహిళలు క్రియాశీలక ఓటర్లు అని అర్థమవుతుంది. నా నియోజకవర్గంలో కూడా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మహిళలు రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి బిజెపి ఈ బిల్లును ఎందుకు తీసుకొచ్చిందో వారు అర్థం చేసుకోగలరు. అంతేకాకుండా ఓబీసీ మహిళలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదో, 2024 ఎన్నికల నుంచి రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదో కూడా మహిళలకు తెలుసు. అసలు బిజెపి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అన్నది ఎవరికి తెలుసు ? మహిళా రిజర్వేషన్ల అమలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తోంది. కరోనా వల్ల 2021 లో జరగని జనగననను 2022 లేదా 2023లో జరపాల్సింది. కానీ వాళ్లు జనగణను జరపలేదు . అది మహిళల తప్పు కాదు. ఈ అన్ని పరిణామాలను మహిళలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ బిల్లు వల్ల బిజెపికి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లభించదని నేను అభిప్రాయపడుతున్నాను.
ప్రశ్న : 33% మహిళా రిజర్వేషన్లు రాజ్యసభలో మరియు రాష్ట్రాల శాసనమండలిలో వర్తించవు. దీని గురించి మీరు ఏమి చెబుతారు ?
కవిత : ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా రాజ్యసభకు సభ్యులు ఎన్నికవుతారు కాబట్టి సాంకేతికంగా ఈ రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యం కాదు. కానీ దానికి ప్రత్యామ్నాయంగా మరో పద్ధతిని పాటించవచ్చు. అన్ని నామినేటెడ్ పదవుల్లో 33 శాతం మహిళలకు ఇవ్వాలని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు చెబితే రాజ్యసభలో, శాసన మండళ్ళలో మహిళల సంఖ్య పెరుగుతుంది. ఎన్నికల సంస్కరణల ద్వారా ఈ రెండు సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచవచ్చు. అదృష్టవశాత్తు స్థానిక సంస్థల్లో ఇప్పటికే 14 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు తొలి మెట్టు మాత్రమే. మహిళా సాధికారత కోసము ఎంతో చేయాల్సి ఉంది. అది తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించింది. మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది. తద్వారా దళిత గిరిజన మహిళలు మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్లుగా నియమితులయ్యారు. ఈ తరహాలో అన్ని స్థాయిల్లోనూ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.
ప్రశ్న : ఓబిసి, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించినందుకు నిరసనగా ఎంఐఎం పార్టీ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీనిపై మీ స్పందన ఏమిటి ?
కవిత : వారు లేవనెత్తింది సరైన అంశమే అయినప్పటికీ మతపరంగా రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం అనుమతించబోదు. ఇక్కడ కొన్ని అవరోధాలు ఉన్నాయి. గతంలో కొన్ని రాష్ట్రాలు ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తే చేస్తే కోర్టులు వాటిని కొట్టివేశాయి. ఈ సమస్యకు రాజ్యాంగపరంగా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదు.
ప్రశ్న : మహిళా బిల్లు ఆమోదం పొందింది. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలు ఎలా ముందుకెళ్లాలి ?
కవిత : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి నేను చూసిన మహిళ నాయకులు మహిళా నాయకులను ప్రోత్సహించారు. అలా మహిళలను ప్రోత్సహించాలని అందరూ అనుకోవాలి. ఇప్పటివరకు కొంతమంది మహిళలే రాజకీయాల్లోకి ప్రవేశించి పోరాటాలు చేశారు. ప్రస్తుతం దేశంలోని మహిళలు చదువుకున్నారు, రాజకీయంగా అవగాహనతో ఉన్నారు కాబట్టి అదే వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి మార్గం చూపిస్తుంది. బిల్లు ఆమోదం పొందింది కాబట్టి ఇక రాజకీయ పార్టీలే మహిళలను ప్రోత్సహించాలి.
Honored to share my journey and vision for the Women’s Reservation Bill in a candid interview with @SputnikInt. Together, we’re paving the way for long-awaited change, ensuring equal representation for women in politics! #WomensReservationBill #ChangeIsComing…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 22, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..