Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. తాండూరు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

Telangana Politics: బీఆర్ఎస్ తొలి జాబితా తెలంగాణాలో రాజకీయ సంచలనాలకు తెరతీసింది. కొన్నిచోట్ల ఊహించని చిత్ర విచిత్రాలు కూడా జరుగుతున్నాయి. అందులో ఒకటి... పూర్తిగా మారిన తాండూరు రాజకీయ ముఖచిత్రం. నియోజకవర్గంలో సమాంతర శక్తులుగా ఉన్న ఇద్దరు బద్ధశత్రువుల్ని ఏకం చేసి... ఔరా అనిపించుకుంది బీఆర్‌ఎస్ హైకమాండ్‌. రానున్న ఎన్నికల్లో తాండూరులో తనకు సపోర్టుగా నిలవాలని పైలట్​ రోహిత్​రెడ్డి మహేందర్​రెడ్డి ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కి కోరారు.

Telangana Elections: ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. తాండూరు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
Pilot Rohit Reddy Meets Patnam Mahender Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 21, 2023 | 10:51 PM

పైలట్ వర్సెస్ పట్నం… తాండూరులో వీళ్లిద్దరూ ఎప్పుడూ ఉప్పూనిప్పే. సిట్టింగ్ ఎమ్మెల్యే, అతడి చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే… ఇప్పుడు ఒకే పార్టీలో ఉండాల్సి రావడం, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఎవ్వరికన్న స్థాయిలో పోటాపోటీ వాతావరణం నెలకొనడం… ఇదీ కొన్నాళ్లనుంచి తాండూరులో నడుస్తున్న రాజకీయం. ఆ ఇంటర్నల్ వార్‌కి ఇంటిలిజెంట్‌గా చెక్ పెట్టేసింది బీఆర్‌ఎస్ అధిష్టానం.

కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో తాండూరు ఎమ్మెల్యే టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి దక్కింది. ఇది… సహజంగానే మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి వర్గానికి షాక్. తాండూరులో వీళ్లిద్దరి మధ్య అగ్గి ఇంకా రాజుకునే ప్రమాదం ఉందని పసిగట్టిన హైకమాండ్‌.. పట్నం మహేందర్‌రెడ్డికి క్యాబినెట్‌లో బెర్త్ కన్ఫమ్ చేసింది. ప్రమాణస్వీకారానికి రెడీ అవుతున్న పట్నంని… ఇంటికెళ్లి కలిశారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి. ఎన్నికల్లో మద్దతిచ్చి తనను గెలిపించాలంటూ.. కాళ్లు పట్టుకుని మరీ అభ్యర్థించారు.

పైలట్ వెళ్లి పట్నం ఆశ్వీర్వాదం తీసుకోవడం అనేది తాండూరు పాలిటిక్స్‌లో అత్యంత ఆసక్తికర ఘట్టం. 2014 ఎన్నికల్లో 16 వేల మెజారిటీతో గెలిచిన పట్నం మహేందర్‌రెడ్డి… 2018 ఎన్నికల్లో పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో దాదాపు 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌నుంచి బీఆర్ఎస్‌లో చేరిన పైలట్‌కీ, పట్నంకీ మధ్య నిన్నటిదాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. టిక్కెట్ తనకంటే తనకంటూ నియోజకవర్గంలో ఎవరికి వారు ప్రచారం చేసుకున్నారు. హైకమాండ్ దగ్గర లాబీయింగ్ కూడా జోరుగా సాగింది. చివరికి… వీళ్లిద్దరి మధ్య గ్యాప్‌ని తగ్గించి ఆ విధంగా తాండూరు రాజకీయాల్ని కీలక మలుపు తిప్పేసింది బీఆర్‌ఎస్ హైకమాండ్.

ఇదిలావుంటే.. బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలు కల్లోలం రేపుతున్నాయ్‌!. అభ్యర్ధుల ప్రకటనవేళ బీఆర్‌ఎస్‌ అధినాయకత్వాన్నే ప్రశ్నించేలా హరీష్‌పై చెలరేగిపోయారు. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌కు కొన్ని గంటల ముందు మైనంపల్లి చేసిన హాట్‌ కామెంట్స్‌ డైరెక్ట్‌గా హైకమాండ్‌కే తగిలాయ్‌!. దాంతో, మైనంపల్లి వ్యాఖ్యలపై సీరియస్‌ అయ్యారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. హరీష్‌రావుపై మైనంపల్లి చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. బీఆర్‌ఎస్‌కు హరీష్‌ మూలస్తంభం, పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో హరీష్‌రావు ఒకరు, ఆయనపై ఒక ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకారమన్నారు. ట్విట్టర్‌ వేదికగా హరీష్‌కు అండగా నిలిచిన కేటీఆర్‌…

మైనంపల్లి ప్రవర్తనను తప్పుబట్టారు. బీఆర్‌ఎస్‌ హైకమాండ్ రియాక్షన్‌ ఇలాగుంటే, మరోవైపు మైనంపల్లికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు కార్యకర్తలు. మెదక్‌లో మైనంపల్లి హన్మంతరావు దిష్టిబొమ్మ తగలబెట్టి ర్యాలీ చేసింది గులాబీ కేడర్‌. ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్‌ఎస్వీ ఆందోళన చేపట్టింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం