BJLP Leader: తెలంగాణ బీజేఎల్పీ నేతపై కొనసాగుతున్న సస్పెన్స్.. రేసులో ఆ నలుగురు..!

తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై కమలనాథులు ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ వాయిస్‌ బలంగా వినిపించిన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డితో పాటు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది.

BJLP Leader: తెలంగాణ బీజేఎల్పీ నేతపై కొనసాగుతున్న సస్పెన్స్.. రేసులో ఆ నలుగురు..!
Bjlp Leader
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 07, 2024 | 7:24 AM

ఇప్పుడిదే తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌..! అసెంబ్లీ సమావేశాల వేళ.. సభలో కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌ నాయకత్వం వహిస్తుండగా, BRSLP నేతగా కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే.. ఇప్పటి వరకూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపై మాత్రం క్లారిటీ రాలేదు. BJLP నేత కోసం.. కమలంలో కసరత్తు కొనసాగుతునే ఉంది. బీజేపీ శాసన సభాపక్ష నేత పదవి కోసం ప్రధానంగా ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. మరీ.. కౌన్‌ బనేగా బీజేఎల్పీ నేత..?

తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై కమలనాథులు ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ వాయిస్‌ బలంగా వినిపించిన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డితో పాటు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది.

తెలంగాణలో కొత్త అసెంబ్లీ ఏర్పడి నెలలు గడుస్తున్నా పార్టీ తరపున ఫ్లోర్ లీడర్ ఎవరన్నది ప్రకటించలేకపోయింది తెలంగాణ బీజేపీ. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌ కూడా గెలిచారు. బీజేపీ కొత్త ఎమ్మెల్యేల్లో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో అనేక అంశాలపై పార్టీ తరపున గళం వినిపించారు. అందరి ప్రశంసలూ పొందారు. దీంతో మహేశ్వర్‌ రెడ్డికి బీజేఎల్పీ లీడర్ పదవిని కట్టబెడతారని ప్రచారం జరిగింది. అయితే మహేశ్వర్‌ రెడ్డి సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే బీజేపీలో చేరడం మైనస్‌ పాయింట్‌ అయ్యే అవకాశం ఉంది.

మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిపై గెలిచిన కాటిపల్లి వెంకట రమణారెడ్డికి బీజేఎల్పీ లీడర్ పదవి ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా జరిగింది. అయితే వెంకట రమణారెడ్డి తొలినుంచీ తన నియోజకవర్గంపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. దీంతో బీజేపీ అధిష్టానం ఆయన్ను బీజేఎల్పీ నేతగా ఎంపిక చేసే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది.

మరోవైపు బీజేఎల్పీ నేత ఎంపికలో బీసీ అంశం కొత్తగా తెరపైకి వచ్చింది. గెలిచిన వారిలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీసీ సామాజికవర్గానికి చెందిన వారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని సూర్యాపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో బీసీ అభ్యర్థిని శాసనసభాపక్ష నేతగా చేస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. రాజాసింగ్‌కు తెలుగు భాషపై అంతగా పట్టు లేకపోవడం మైనస్‌ పాయింట్‌గా భావిస్తున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా రాజాసింగ్‌కు భాష అవరోధంగా మారే అవకాశం ఉంది. అటు ఈ అంశంపై అంతిమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికే వదిలేశారు రాజాసింగ్‌. బీసీ అభ్యర్థినే బీజేఎల్పీ నేతగా ఎన్నుకోవాలంటే ఇక మిగిలింది పాయల్ శంకరే. ఇటీవలి ఎన్నికల్లో అదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీచేసిన పాయల్ శంకర్ దాదాపు 7వేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నపై విజయం సాధించారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ పార్టీ తరఫున గళం వినిపించేందుకు ఫ్లోర్ లీడర్ అవసరం కావడంతో బీజేపీ అధిష్టానం వెంటనే నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…