AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JP Nadda: బండి సంజయ్ దీక్షను చూసి కేసీఆర్ ప్రభుత్వం భయపడింది.. అరెస్ట్ ఖండిస్తున్నామన్న జేపీ నడ్డా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని అభివర్ణించారు.

JP Nadda: బండి సంజయ్ దీక్షను చూసి కేసీఆర్ ప్రభుత్వం భయపడింది.. అరెస్ట్ ఖండిస్తున్నామన్న జేపీ నడ్డా
Jp Nadda
Balaraju Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 03, 2022 | 4:46 PM

Share

BJP Chief JP Nadda on Bandi Sanjay Arrest: రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని అభివర్ణించారు. కోవిడ్‌ రూల్స్‌ పాటిస్తూ బండి సంజయ్‌.. తన ఆఫీసులో ఉపాధ్యాయుల సమస్యలపై జాగరణ దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టు చేశారని జేపీ నడ్డా మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు.

తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన బండి సంజయ్ చేస్తున్న పోరాటం భేష్ అని జేపీ నడ్డా మెచ్చుకున్నారు. కేసుల గురించి భయపడాల్సి అవసరం లేదన్నారు. బండి సంజయ్ వెనక జాతీయ నాయకత్వం ఉందని స్పష్టం చేశారు. పోరాటంలో మరింత ముందుకెళ్లాలని సూచించారు. మరోవైపు బండి సంజయ్ చేస్తున్న దీక్షను భగ్నం చేయడంపై జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తన కార్యాలయంలో దీక్ష చేస్తున్న బండి సంజయ్‌‌ అరెస్ట్ చేయడం, లాఠీ చార్జి చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. ఈ అమానుష తీరును ఖండించదగినదని చెప్పారు. ఈ దుర్మార్గపు ప్రయత్నాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పోలీసులే బీజేపీ నేతలు, కార్యకర్తలపై హింసకు పాల్పడుతున్నారని నడ్డా ఆరోపించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడిని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తూ ఖండిస్తోందన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 317 గురించి బండి సంజయ్‌ దృష్టికి తీసుకొచ్చేందుకు ఆయన కార్యాలయానికి ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ తీరుకు వ్యతిరేకంగా టీచర్లు, సిబ్బంది చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ బండి సంజయ్ కోవిడ్-19 ప్రొటోకాల్స్ పాటిస్తూ దీక్ష చేపట్టారు. కానీ శాంతియుతంగా చేస్తున్న ఈ దీక్షను చూసి కేసీఆర్ ప్రభుత్వం భయపడింది. అందుకే ఈ దీక్షపై దాడి చేసి చెదరగొట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. తెలంగాణలో కొనసాగుతున్న రాజకీయ కక్షసాధింపు, అరాచకత్వానికి నిదర్శనంగా భారీ పోలీసు బలగాలతో పక్కా వ్యూహాంతో దాడికి పాల్పడ్డారని జేపీ నడ్డా మండిపడ్డారు.

తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ ప్రభుత్వం చాలా కలవరపడుతూ ఆందోళన చెందుతోందన్న జేపీ నడ్డా.. నైరాశ్యంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అమానవీయ, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి అవమానకర, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు బీజేపీ నేతలు, కార్యకర్తలు బెదిరే ప్రసక్తే లేదన్నారు.ప్రజావ్యతిరేక కేసీఆర్‌ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో తమ పోరాటాన్ని కొనసాగించాలి నడ్డా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందన్న నడ్డా అప్రజాస్వామిక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించిన తర్వాతే బీజేపీ విశ్రమిస్తుందని స్పష్టం చేశారు. Jagat Prakash Nadda Letter 

Jp Nadda Letter

Jp Nadda Letter

ఇదిలావుంటే, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు (GO 317) నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కరీంనగర్‌లోని తన ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో చేపట్టిన జాగరణ దీక్ష చేపట్టారు. పోలీసులు తలుపులు పగులగొట్టి.. బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య.. తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ రకంగా బండి సంజయ్ దీక్షను పోలీసులు ఆదివారం రాత్రి భగ్నం చేశారు. అనంతరం ఆయనను మానుకొండూరు పోలీసు స్టేషన్‌కు తరిలించారు. అయితే, ఈ ఉదయం కరీంనగర్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు బండి సంజయ్‌ను తీసుకొచ్చారు.

అయితే ఈ క్రమంలోనే కరీంనగర్ పోలీసులు.. నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచేసారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన బండి సంజయ్ తో పాటు 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు కరీంనగర్ కమీషనర్ సత్యనారాయణ తెలిపారు. మొత్తంగా 70 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. మరోవైపు, బండి సంజయ్ బెయిల్ పిటిషన్ ను కరీంనగర్ కోర్టు సోమవారం నాడు తిరస్కరించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా మరో నలుగురిని పోలీసులు జైలుకు తరలించనున్నారు.

కాగా, బండి సంజయ్ అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని హోంశాఖను ఆదేశించింది. దీంతో కరీంనగర్‌కు అదనపు బలగాలు తరలించారు పోలీసు ఉన్నతాధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. వరంగల్ రేంజ్‌ డీఐజీ, ఐజీ కూడా కరీంనగర్‌ చేరుకుని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా కేసీర్ తీరుపై మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మద్దతుగా శాంతియుతంగా జాగరణ చేస్తున్న బండి సంజయ్ మీద టీఆర్ఎస్ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించి, అధికార మదంతో పోలీసులను ఉపయోగించి వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు. పోలీసు అరెస్ట్ సందర్భంగా గాయపడిన నాయకులు,కార్యకర్తలు తగిన వైద్యాన్ని తీసుకుని ధైర్యంగా ఉండమని, రాబోయేది మన ప్రభుత్వమే అని తెలియజేస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు.