Bandi Sanjay: గుంటనక్క పార్టీలన్నీ ఐక్యతా రాగం.. కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay: సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించడం బీజేపీ సాధించిన విజయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి..

Bandi Sanjay: సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించడం బీజేపీ సాధించిన విజయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తరువాతే కేసీఆర్ ప్రభుత్వం సహా కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు వంటి గుంట నక్క పార్టీలన్నీ దిగొచ్చి ఐక్యతా రాగాన్ని వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని అనేక ఏళ్లుగా పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్నాళ్లూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపలేదో? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎంఐఎం మెప్పుకోసం తెలంగాణ విమోచన చరిత్రనే వక్రీకరిస్తున్న కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియాతో సీఎం కేసీఆర్, ఇతర పార్టీలపై సంచలన వ్యాఖ్యాలు చేశారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాల నిర్వహణ విషయంలో అనేకసార్లు మాట మార్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని, తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి సీఎం రోశయ్యను కేసీఆర్ తిట్టారని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత కేసీఆర్ మాట మార్చారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రమే వచ్చిన తర్వాత ఇంకా విమోచన దినోత్సవాలెందుని అన్నాడని, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని నిర్ణయించగానే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యాడని విమర్శించారు. తెలంగాణ విమోచన చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతోంది.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాలని చెబుతున్న కేసీఆర్‌కు ఆనాడు సర్దార్ పటేల్ ‘ఆపరేషన్ పోలో’ ఎందుకు నిర్వహించారో తెలియదా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు ఒవైసీ చేతిలో ఏ విధంగా కీలుబొమ్మలా మారాయో తెలంగాణ సమాజం ఆలోచించాలని, ఆనాడు తెలంగాణ ప్రజలు పడుతున్న వెట్టి చాకిరి నుండి, బానిస బతుకుల నుండి విమోచనం కలిగించడానికే కదా ఆపరేషన్ పోలో నిర్వహించింది. వాటికేం సమాధానం చెబుతారని బండి సంజయ్ ప్రశ్నించారు.



కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని నిర్ణయిస్తే.. ఈరోజు దిగొచ్చి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహించాలని నిర్ణయించాయంటే ఇది ముమ్మాటికీ బీజేపీ సాధించిన విజయమేనన్నారు. ఓట్లు, సీట్ల కోసం తెలంగాణను దారుస్సలాంకు తాకట్టు పెట్టేందుకు వెనుకడానికి నీచులు కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల నేతలు.. ఇలాంటి దగుల్బాజీ పార్టీలకు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. నిజాం సమాధి ముందు మోకరిల్లిన దేశద్రోహుల పార్టీ కావాలా? సర్దార్ వల్లభాయి పటేల్ ఎదుట మోకరిల్లిన దేశభక్తి పార్టీ కావాలా? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
