AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TELANGANA STATE: తెలంగాణలో విలీన, విమోచన వేడుకల రాజకీయం.. కేంద్ర రాష్ట్రాలవి వేర్వేరు బాటలు.. సమగ్రతా దినమంటున్న ఎంఐఎం

గత కొంతకాలంగా బీజేపీతో ఉప్పూ, నిప్పులా వున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం పంపినా ఆయన హాజరు కాకపోవచ్చు. ఎందుకంటే అమిత్ షాతో డయాస్ పంచుకోవడం కేసీఆర్ కిపుడు సుతరామూ ఇష్టం వుండదు. ఎందుకంటే...

TELANGANA STATE: తెలంగాణలో విలీన, విమోచన వేడుకల రాజకీయం.. కేంద్ర రాష్ట్రాలవి వేర్వేరు బాటలు.. సమగ్రతా దినమంటున్న ఎంఐఎం
Telangana State Map + Kcr + Kishanreddy + Asad + Revanth
Rajesh Sharma
|

Updated on: Sep 03, 2022 | 7:20 PM

Share

TELANGANA STATE TO CELEBRATE DIAMOND JUBLEE YEAR OF INDEPENDECE:  తెలంగాణలో రాజకీయం రోజుకోరకంగా రంజుగా మారుతోంది. మునుగోడు సెంట్రిక్‌గా గత కొంతకాలంగా పొలిటికల్ గేమ్స్ కొనసాగుతుండగా.. తాజాగా తెలంగాణ విమోచన దినోత్సం కేంద్రంగా రాజకీయం రంగు మారుతున్నట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ (పాత హైదరాబాద్ స్టేట్) భారత దేశంలో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS) పార్టీలు పోటీపోటీ ఉత్సవాలకు సిద్దమవుతున్న తరుణంలో ఎంఐఎం (MIM), కాంగ్రెస్ (CONGRESS) పార్టీలు ఎంట్రీ ఇవ్వడంతో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. 1948 సెప్టెంబర్ 17వ తేదీన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ (SARDAR VALLABH BHAI PATEL) సారథ్యంలోని భారత సైన్యం నిజాం రాజును లొంగదీసుకుని, హైదరాబాద్ స్టేట్‌ (HYDERABAD STATE)ని దేశంలో విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. నిజాం ప్రభువు చెర నుంచి విమోచన పొందినందున సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని చాలా కాలంగా బీజేపీ నేతలు (BJP LEADERS) డిమాండ్ చేస్తున్నారు. కానీ రాజకీయ కారణాల వల్ల టీఆర్ఎస్ ఇంతకాలం ఈ డిమాండ్‌ను పట్టించుకోలేదన్న అభిప్రాయం చాలా మందిలో వుంది. తాజాగా హైదరాబాద్ స్టేట్ దేశంలో విలీనమై 74 ఏళ్ళు పూర్తయి.. 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఇటీవల దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను నిర్వహించుకున్నట్లుగానే హైదరాబాద్ స్టేట్ భారత దేశంలో విలీనమైన సందర్భాన్ని కూడా వజ్రోత్సవ వేడుకలుగా నిర్వహించుకోవాలని పలువురు తెలంగాణ సర్కార్‌ (TELANGANA GOVERNMENT)కు సూచించినట్లు కథనాలు వచ్చాయి. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించడంతో తెలంగాణ వజ్రోత్సవ వేడుకలకు ప్రభుత్వం సిద్దమైంది. నిజానికి హైదరాబాద్ స్టేట్‌లో ప్రత్యేక అస్తిత్వంతో వున్న ప్రాంతం ఒక్క తెలంగాణనే. హైదరాబాద్ స్టేట్‌లో భాగమైన ఔరంగాబాద్ (హైదరాబాద్ నగరం కంటే ముందు ఔరంగాబాద్ (AURANGABAD) నుంచే నిజాం రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు) సహా మరఠ్వాడా (MARATWADA) ప్రాంతం ఇపుడు మహారాష్ట్రలో వుంది. అదేసమయంలో కల్యాణ్ కర్నాటక పేరుతో వున్న గుల్బర్గా (GULBARGA), బీదర్ (BIDAR), రాయచూర్ (RAICHUR) వంటి ప్రాంతాలిపుడు కర్నాటక (KARNATAKA)లో వున్నాయి. ఇక ప్రత్యేక అస్తిత్వంతో వున్నది ఒక్క తెలంగాణే కాబట్టి తెలంగాణ విమోచన, విలీన దినోత్సవంగా సెప్టెంబర్ 17న జరుపుకోవాలన్న డిమాండ్లు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలు ఈ అంశాన్ని ప్రతీ ఏటా లేవనెత్తుతున్నారు. అయితే ఇంతకాలం ఈ డిమాండ్‌ను కేసీఆర్ పట్టించుకోలేదు. తాజాగా హైదరాబాద్ స్టేట్ దేశంలో విలీనమై 75 వసంతాలకు చేరుకోబోతున్న తరుణంలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం తెలంగాణ విలీన దినోత్సవాలను ఏడాదిపాటు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకాస్త దూకుడుగా నిర్ణయాలు తీసుకుందనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తేదీన సికింద్రాబాద్ (SECUNDERABAD) పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని, కేంద పారామిలిటరీ బలగాల పరేడ్ నిర్వహించాలని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (UNION HOME MINISTER AMIT SHAH) ఈ పరేడ్‌ను స్వీకరించాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఉత్సవాలలో పాల్గొనాల్సిందిగా పూర్వపు హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రాంతాలున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర హోం శాఖ ఆహ్వానించింది. ఈ నిర్ణయం బీజేపీ వ్యూహాత్మకంగా తీసుకున్నట్లు ఏ మాత్రం రాజకీయ పరిఙ్ఞానం వున్న వారికైనా అర్థమవుతుంది. గత కొంతకాలంగా బీజేపీతో ఉప్పూ, నిప్పులా వున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం పంపినా ఆయన హాజరు కాకపోవచ్చు. ఎందుకంటే అమిత్ షాతో డయాస్ పంచుకోవడం కేసీఆర్ కిపుడు సుతరామూ ఇష్టం వుండదు. ఎందుకంటే ఆయనీ మధ్యే బీజేపీ ముక్త భారత్ స్లోగన్ ఎత్తుకుని బీజేపీయేతర, బీజేపీ అంటే పొసగని పార్టీల నేతలతో మంతనాలు కొనసాగిస్తున్నారు. తాజాగా వినాయక చవితి నాడు బీహార్ (BIHAR) వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ (NITISH KUMAR)ని కలిసి వచ్చారు. కేసీఆర్ సంగతిలా వుండగా.. కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మై (బీజేపీ), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే (శివసేన రెబల్ వర్గం) ఎలాగో ఈ ఉత్సవాలకు హాజరవుతారు. కేసీఆర్ హాజరు కాకపోతే దాన్ని రాజకీయంగా వాడుకునేందుకే బీజేపీ నేతలు ఈ ఎత్తుగడ వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఏడాదిపాటు తెలంగాణవ్యాప్తంగా విమోచన వేడుకలను నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి (G KISHAN REDDY) తెలిపారు.

కాగా సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ పార్టీకి చెందిన అధికార పత్రిక తెలంగాణ ప్రభుత్వం కూడా విలీన దినోత్సవాలను ఏడాదిపాటు వజ్రోత్సవాల పేరిట నిర్వహించేందుకు సంసిద్దమవుతున్నట్లు ఎక్స్‌క్లూజివ్ కథనం రాసింది. కొందరు మేధావులు కేసీఆర్‌ ఎదుట ఈ ప్రతిపాదన వుంచినట్లు, మేధావుల ప్రతిపాదనకు కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొంది. ఆ కథనానికి అనుగుణంగానే సెప్టెంబర్ 3న జరిగిన తెలంగాణ మంత్రివర్గ (TELANGANA CABINET) సమావేశం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వజ్రోత్సవ ప్రారంభ వేడుకలను సెప్టెబర్ 16,17,18 తేదీలలో మూడురోజుల పాటు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. వజ్రోత్సవ ముగింపు వేడుకలను 2023 సెప్టెంబర్ 16,17,18 మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కూడా కేబినెట్ తీర్మానించింది. ‘‘ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరంలోకి అడుగిడుతున్నది.. ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తూ సెప్టెంబర్ 16,17,18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది’’ అన్న సందేశం మీడియాకు చేరింది. అయితే, సెప్టెంబర్ 17న ఈ వేడుకలను ఎక్కడ ప్రారంభిస్తారన్నది ఇక తేలలేదు. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన తెలంగాణ విమోచన వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని పంపుతారా అన్నది కూడా తేలలేదు. ఇక తెలంగాణ విమోచన, విలీన దినోత్సవ అంశంలోకి తాజాగా ఎంఐఎం పార్టీ కూడా అడుగు మోపింది. హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ సమగ్రతా దినోత్సవంగా పాటించాలంటూ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (ASADUDDIN OWAISI) అటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశారు. సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ పాతబస్తీలో తిరంగా యాత్రలు నిర్వహించి, బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు సీనియర్ ఓవైసీ వెల్లడించారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఈ తిరంగా యాత్రలో పాల్గొంటాయని ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 17 అంశాన్ని ఇలా మూడు పార్టీలు టేకప్ చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్పందించారు. తన పార్టీ అధ్వర్యంలోను తెలంగాణ విలీన వేడుకలను నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC PRESIDENT REVANT REDDY) ప్రకటించారు. ఇలా వజ్రోత్సవ సందర్భంలో సెప్టెంబర్ 17 అంశం రాజకీయ కోణంలోకి అడుగుపెట్టినట్లయ్యింది. వచ్చే సంవత్సరం తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలు (TELANGANA ASSEMBLY ELECTIONS 2023) జరగబోతున్న తరుణంలో వజ్రోత్సవ వేడుకలను నాలుగు రాజకీయ పార్టీలు తమతమ ప్రయోజనాల కోసం ప్లాన్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు.