“నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది”.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధమన్న గంగుల
హుజూరాబాద్ నియోజక వర్గంలో ప్రజాదీవెన పాదయాత్ర చేపట్టిన మాజీమంత్రి ఈటల రాజేందర్ సంచలనం వ్యాఖ్యలు చేశారు.
Huzurnagar Political Heat: హుజూరాబాద్ నియోజక వర్గంలో ప్రజాదీవెన పాదయాత్ర చేపట్టిన మాజీమంత్రి ఈటల రాజేందర్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఈటల పాదయాత్ర కొనసాగుతోంది. రెండో రోజు అంబాల గ్రామం నుంచి రాజేందర్ యాత్రను మొదలుపెట్టారు. ఓటమి భయంతోనే దళిత బంధును హుజూరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నారని ఈటల విమర్శించారు. మరోవైపు టైం వచ్చినప్పుడు తనపై కుట్రకు పాల్పడిన వారి పేరును బయట పెడతానన్నారు.
అంతేకాదు, తనపై హంతక ముఠాలతో దాడి చేయించదానికి జిల్లా మంత్రి కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. ఈ నేపద్యంలో ఈటల పర్యటనకు మరింత కట్టుదిట్టమైన పోలీసు భద్రత కల్పించారు. కమలాపూర్ మండలంలో ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న గ్రామాల్లో పోలీసులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
రెండవ రోజు పాదయాత్ర అంబాల గ్రామం నుండి ప్రారంభమైంది..మార్గమద్యలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్న ఈటల రాజేందర్ టీవీ9తో మాట్లాడారు. తనపై కుట్ర జరుగుతుందని కొంతమంది మాజీ నక్సలైట్లు వచ్చి స్వయంగా తనకే చెప్పారని ఈటల పేర్కొన్నారు. నయీమ్ లాంటి హంతక ముఠాలే నన్ను ఏమి చేయలేక పోయారు. ఈ చిల్లరగాళ్లు ఏంత అని హెచ్చరించారు. సందర్భం వచ్చినప్పుడు తనపై కుట్రలు చేసినవారి పేరు బయట పెడతానన్నారు. హుజూరాబాద్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ దళిత బంధు పతాకాన్ని ఇక్కడి నుండి ప్రారంభించ బోతున్నారని ఆరోపించారు ఈటల రాజేందర్..
ఇదిలావుంటే, ఈటల రాజేందర్ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని, ఆయన చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ నేతల్ని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణలో రాజకీయ హత్య ఉండవనీ, ఏదైనా ఉంటే రాజకీయ ఆత్మహత్యలేనని వ్యాఖ్యానించారు. ఈటల చెవిలో ఎవరు చెప్పారో బయటపెట్టాలని, కుట్రకు పాల్పడింది ఎవరో తేల్చాలని గంగుల డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోందన్నారు. ఈటలతో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని వివరించారు. విచారణలో తన పేరు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధం అని స్పష్టం చేశారు. ఈటల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని గంగుల ధ్వజమెత్తారు.
Read Also.. KTR appreciates DSP Video: టాలెంట్ కు ప్రోత్సహం.. మాట నిలుపుకున్న రాక్ స్టార్ దేవీ…కేటీఆర్ ఫిదా..(వీడియో).