పదహారు లోక్ సభ స్థానాలపై కమలనాథుల కన్ను.. అసెంబ్లీ ఫలితాలను డబుల్ చేసే పనిలో కాషాయదళం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఏ నియోజకవర్గానికి ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది అనే దానిపై ప్రధాన పార్టీలు కసరత్తు కూడా చేస్తున్నాయి.. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థుల విషయంలో దృష్టి పెట్టినట్టు సమాచారం.

పదహారు లోక్ సభ స్థానాలపై కమలనాథుల కన్ను.. అసెంబ్లీ ఫలితాలను డబుల్ చేసే పనిలో కాషాయదళం
BJP
Follow us
Sridhar Prasad

| Edited By: Balaraju Goud

Updated on: Dec 23, 2023 | 11:09 AM

ఆ నేతలు పార్లమెంటు సీటుపై కన్నేశారా..? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అంటున్నారా..? లోక్ సభ కు పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అదే అనిపిస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అప్పుడే లాబీయింగ్ మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. పలువురు నేతలు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఏ నియోజకవర్గానికి ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది అనే దానిపై ప్రధాన పార్టీలు కసరత్తు కూడా చేస్తున్నాయి.. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థుల విషయంలో దృష్టి పెట్టినట్టు సమాచారం. అయితే కొందరు పార్టీ నేతలు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతుండటం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు సైతం పార్లమెంట్ బరిలో దిగేందుకు సై అంటున్నారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.

ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీలు మరోసారి తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు స్థానాలు నుండి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే అదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రస్తుతం ఎంపీ పోటీ చేస్తారా లేదా అనే సందేహం వ్యక్తం అవుతుంది. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబూరావు తనకు ఆ టికెట్ ఇస్తారని హామీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, సుభాష్ రెడ్డి, కొండేటి శ్రీధర్, హుస్సేన్ నాయక్, ఆచారిలు సైతం ఎంపీలుగా పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తామని ఈటెల రాజేందర్, రఘునందన్ రావులు ఇప్పటికే ప్రకటించారు కూడా.

ఈటెల రాజేందర్ మల్కాజ్ గిరి, మెదక్ స్థానాల్లో ఏదో ఒక చోట నుండి పోటీ చేసే అవకాశం ఉంది. అయన ఎక్కడ నుండి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక మెదక్ నుండి రఘునందన్ రావు గతంలో పోటీ చేశారు. ఇప్పుడు కూడా పోటీ కి రెఢీ అంటున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి, ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన సుభాష్ రెడ్డి మరోసారి పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఇక, వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి వర్ధన్నపేట అసెంబ్లీకి పోటీ చేసిన కొండేటి శ్రీధర్ ఆశిస్తున్నారట. మహబూబాబాద్ పార్లమెంటు నుండి పోటీ చేసేందుకు మహబూబాబాద్ అసెంబ్లీకి పోటీ చేసిన హుస్సేన్ నాయక్ సిద్ధంగా ఉన్నారట. పెద్దపల్లి నుండి మరోసారి తనకు అవకాశం రావచ్చు అని ధర్మపురి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన ఎస్ కుమార్ భావిస్తున్నారట.

అయితే మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీల నుండి పోటీ చేసిన ఒకరిద్దరు కన్నేశారని కూడా పార్టీలో ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ ఓటమి చవిచూసిన తల్లోజు ఆచారి కూడా తాను సైతం ఎంపీ బరిలో అంటున్నారట. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పలువురు నేతలు, పార్లమెంట్ బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారట. మరి పార్టీ హై కమాండ్ ఎవరిని కరుణిస్తుందో.. ఎవరికి మొండి చెయ్యి చూపుతుందో వేచి చూడాల్సిందే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…