బతుకమ్మ పాటల్లో ఆర్ద్రత ఉంటుంది.. ఆవేశమూ ఉంటుంది..

బతుకమ్మ పాటల్లో హితోక్తులు ఎక్కువ. వాటితో పాటు ఆర్ర్దత వుంటుంది. ఆవేశం వుంటుంది. ఆవేదన వుంటుంది. అణచివేతకు గురైన ఆవేశం వుంటుంది. ఉద్వేగం, ఉక్రోషం, ఉద్యమం, ప్రేమలు, అనురాగాలు, నిరాశ, దు:ఖాలు అన్నీ వుంటాయి.

బతుకమ్మ పాటల్లో ఆర్ద్రత ఉంటుంది.. ఆవేశమూ ఉంటుంది..
Follow us

|

Updated on: Oct 23, 2020 | 4:38 PM

బతుకమ్మ పాటల్లో హితోక్తులు ఎక్కువ. వాటితో పాటు ఆర్ర్దత వుంటుంది. ఆవేశం వుంటుంది. ఆవేదన వుంటుంది. అణచివేతకు గురైన ఆవేశం వుంటుంది. ఉద్వేగం, ఉక్రోషం, ఉద్యమం, ప్రేమలు, అనురాగాలు, నిరాశ, దు:ఖాలు అన్నీ వుంటాయి. బతుకమ్మ ఆడుతున్నప్పుడు శరీరాలు ఉద్వేగంతో ఊగిపోతాయి… అలసిపోయినవాళ్లు వరుసలోంచి బయటకొచ్చి…కాసేపు సేదతీరి మళ్లీ కలుస్తారు… బతుకమ్మ పాట పాడుకోవటానికి ఆశువుగా అల్లుకోవడానికి సులువుగా వుంటుంది. ఈ పాటల్లో అనేక ఇతివృత్తాలు ఇమిడి వున్నాయి. బతుకమ్మ పుట్టుక కథల నుంచి, స్త్రీల జీవితం చుట్టూ అల్లుకుని ఉన్న కష్టాల నుంచి, అత్తింటి ఆరళ్ల నుంచి, అన్నా చెల్లెల అనురాగాల నుంచి ఎన్నో కథనాలు సుదీర్ఘంగా సాగుతాయి. జనగామ రైలు ప్రమాదం, చెరువు కట్ట తెగిన వరద ప్రమాదం, కరువు కాటకాలు, కాల వైపరీత్యాలు, తెలంగాణ వీరుల అమరగాధలు, జానపద గాధలు, ఉద్యమాలు ఇవన్నీ ఈ పాటల నిండా మారుమోగుతుంటాయి. ఈ పాటలేవి అక్షరబద్దమైనవి కావు. అప్పటికప్పుడు సందర్భోచితంగా కూర్చిన పాటలు. పాటల్లోని భావరాగాలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. తాళలయలు తప్పే ప్రసక్తే వుండదు. ఆడవాళ్లంతా అడుగడుగు కుడిపక్కకు వేస్తూ … బతుకమ్మ చుట్టూ తిరుగుతూ…..వంగిలేస్తూ దానికి అనుగుణంగా చేతులు ఊపి చప్పట్లు కొడతారు…. కొన్ని ప్రాంతాల్లో అడుగులకు తగినట్టుకు డప్పుల దరువు కూడా వుంటుంది…

సంజె చీకటి ముదిరేంత వరకు, పొద్దు గూటిలో పడేంతవరకు బతుకమ్మను ఆడతారు. ఆ తర్వాత బతుకమ్మలను నెత్తిన పెట్టుకుని ఊరి చెరువు దగ్గరకు బయలుదేరుతారు. అలా బయలుదేరిన గుంపులోంచి ఒకరు, ఒక్కొక్క ఎలిగే పండూ గౌరమ్మ-దూరనా దోరపండూ గౌరమ్మ అంటూ పాటనందుకుంటారు. ఆ పాటకు అందరూ గళం కలుపుతారు. అలా పాడుకుంటూ చెరువు కట్ట దగ్గరికి చేరుకుంటారు. అక్కడ బతుకమ్మలను దించి, మళ్లీ అక్కడ బతుకమ్మను ఆడతారు.

బతుకమ్మను చెరువులో వదలడంలో ఓ శాస్త్రీయ కోణం వుంది. బతుకమ్మలో పేర్చిన ప్రతీ పువ్వులోనూ ఔషధ గుణాలున్నాయి… ఆ పువ్వులు నీట చేరి కాలుష్యాన్ని నివారిస్తాయి. బతుకమ్మ పండుగ వచ్చే నాటికి వర్షరుతువు ముగింపులో ఉంటుంది.. చెరువులు, తటాకాలు, కుంటలు నీలి బంగారంతో నిండుగా ఉంటాయి.. ఈసారి అలుగుపోసేటంత ఎక్కువగా చెరువులు నిండాయి.. ఎక్కడ చూసిన హరితవర్ణమే! పూలన్నీ విరగబూసి ఉంటాయి.. నేలపైకి హరివిల్లు వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. బతుకమ్మలో వాడే తంగేడుపూలు, గునుగుపూలు, గుమ్మడిపూలు లాంటి పూలు చెరువు నీటిని శుద్ధి చేస్తాయి. తంగేడుపువ్వుకు సూక్ష్మజీవులను చంపే గుణం ఉంది.. అన్నట్టు పండుగ కొనసాగుతున్నన్ని రోజులు పంచే ఫలహారాలలో ఖనిజ, విటమిన్‌ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కరోనా కాలంలో ఇది ఎంతో ప్రయోజనకరం!

బతుకమ్మను విడవడంలోనూ ఓ పద్దతి వుంటుంది… చెరువులో మోకాళ్ల వరకు నీళ్లలో దిగిన తర్వాత నీళ్లపై బతుకమ్మ పళ్లాన్ని వుంచుతారు. అలా కొంత దూరం నడిచి నీళ్లపై తేలుతున్న బతుకమ్మ నుంచి ఆ పళ్లాన్ని మెల్లగా కిందకి ఒత్తి పైకి తీస్తారు. నీళ్లపై తేలుతున్న బతుకమ్మను అలలతో ముందుకు నెట్టి వెనక్కి వచ్చేస్తారు. వస్తున్నప్పుడు పళ్లెంలో కొన్ని నీళ్లు తెచ్చి అందరిపైనా చల్లుతారు. ఆ తర్వాత ప్రసాదాలను ఒకరికొకరు పంచుకుంటారు… ఇదీ బతుకమ్మ పండుగ విశిష్టత.

రంగురంగుల పూలు ఉయ్యాలో… రకరకాల మనసులుయ్యాలో.. అందరికి శాంతిని ఉయ్యాలో .. అందించి దయ సూడు ఉయ్యాలో… కరోనాను తరిమికొట్టు ఉయ్యాలో.. అందరికి ఆరోగ్యం ప్రసాదించు ఉయ్యాలో…