TSPSC Paper Leak: నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు.. TSPSC పేపర్ లీక్‌పై సంజయ్, రేవంత్ ఫైర్..
TSPSC పేపర్ లీకేజీ బాగోతం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీపై విపక్ష పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. జీవితాలను పణంగా పెట్టి చదువుతోన్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు.
TSPSC పేపర్ లీకేజీ బాగోతం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీపై విపక్ష పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. జీవితాలను పణంగా పెట్టి చదువుతోన్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు. కాగా, పేపర్ లీకేజీ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 9మందిని అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపర్చగా.. ధర్మాసనం 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. ఏ1 గా ప్రవీణ్, ఏ3గా రేణుక ను చేర్చారు. కాగా.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్‌లపై న్యాయ విచారణ జరపాలని సూచించారు. రాబోయే 2 నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కేసీఆర్ టీమ్‌కు చేరిపోయాయని కూడా సంజయ్ ఆరోపించారు. గతంలో సింగరేణి పరీక్షా పత్రాల లీకేజీ జరిగిందన్నారు. ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నిరుద్యోగులతో ప్రగతి భవన్, టీఎస్సీఎస్సీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
TSPSC పేపర్ లీక్‌లో పెద్దల హస్తముందని ఆరోపించారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన పేపర్లు చిన్న ఉద్యోగి చేతికి ఎలా వచ్చాయని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధికారం లోకి వచ్చాక ప్రతి పోటీ పరీక్ష పేపర్ లీకవుతోందని ఆరోపించారు రేవంత్‌రెడ్డి. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. 9 ఏళ్లలో జరిగిన నియామకాలపై దర్యాప్తు చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
BRS ప్రభుత్వం ఏర్పాటైన దగ్గరి నుంచి.. పేపర్స్ లీక్ అవుతున్నాయని TJS అద్యక్షుడు కోదండరాం విమర్శించారు. కాసులకు కక్కుర్తిపడి పేపర్స్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలకు తెలిసే పేపర్ లీక్ సాగుతోందని కోదండరాం తప్పుబట్టారు.
ప్రవీణ్ లీక్స్ ఎపిసోడ్ TSPSCని కుదిపేస్తోంది. BJYM, NSUI, TJS TSPSC కార్యాలయాన్ని ముట్టడించాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అటు ఓయూ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. TSPSC చైర్మన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.
మరోవైపు మొత్తం ప్రశ్నాపత్రాల లీకేజ్‌పై కింగ్‌పిన్‌గా మారిన ప్రవీణ్- మహిళలతో వ్యవహారాలు నడుపుతూ అడ్డగోలు దందా చేస్తున్నట్లు తేలింది. ప్రవీణ్ ఫోన్‌లో విచ్చలవిడిగా నగ్న చిత్రాలు, అసభ్య చాటింగ్‌లు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ప్రవీణ్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు పోలీసులు. ఈ నెల 25 తరువాత FSL నివేదిక వస్తుంది. గ్రూప్1 ప్రిలిమ్స్ పేపర్ లీక్ మ్యాటర్ ఆ నివేదికపైనే ఆధారపడి ఉంది. AE పరీక్షతోపాటు తాజాగా గ్రూప్-1 పరీక్ష పత్రం లీక్‌పైనా అనుమానాలు రావడంతో ప్రిలిమ్స్ అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మొత్తం రెండు లక్షల 86వేల మంది అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాశారు. 1:50 నిష్పత్తిలో 25వేల 50 మంది మెయిన్స్ కు క్వాలిఫై అయ్యారు. ఈ టైమ్‌లో ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం లీకేజ్ అనుమానాలతో మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నవారిలో టెన్షన్ కనిపిస్తోంది. TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో మరిన్ని కొత్త విషయాలు తెరమీదకు వస్తున్నాయి. గురుకుల ప్రిన్సిపల్ నియామకాల్లోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. రిజెక్ట్ అయిన వాళ్లను రీకరెక్షన్ పేరుతో ఉద్యోగాలకు పైరవీ చేసినట్టు ప్రవీణ్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..