నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉరేసుకుని మరో విద్యార్థి ఆత్మహత్య
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సనత్ అనే ఎంబిబిఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సనత్ అనే ఎంబిబిఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 10 నెలల క్రితం అదే ప్రభుత్వ ఆసుపత్రిలో పీజీ విద్యార్థిని శ్వేత ఆత్మహత్య చేసుకుంది. గత ఫిబ్రవరి 25న హర్ష అనే ఎంబీబీఎస్ మూడో ఏడాది విద్యార్థి కళాశాల వసతి గృహంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరుసగా ముగ్గురూ ఆ కళాశాలలో ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లిలో సెంటెనరీ కాలనీకి చెందిన సనత్ తండ్రి సింగరేణి లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే సనత్ సోదరుడు చదువుల కోసం యూఎస్ వెళ్ళాడు.
అయితే వసతి గృహంలో రాత్రి మూడు గంటల వరకు తోటి విద్యార్థులతో చదువుకున్న సనత్ తన గదికి వెళ్లిపోయాడు. ఎంతకు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన విద్యార్థులు కళాశాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తలుపులు తెరవగా సునత్ ఉరేసుకున్న విషయం బయటకు వచ్చింది. అంతకు ముందు రోజు తోటి విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడుకుని.. తెల్లవారుజాము వరకు చదువుకున్న సనత్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం కళాశాలలో కలకలం రేపింది. తెల్లవారుజామున 3.11 గంటలకు వాట్సాప్ లో తల్లిదండ్రులకు సారీ అమ్మానాన్న, అన్నయ్య.. అంటూ మెసేజ్ పెట్టాడు. ఫార్మా 1 పరీక్ష సమయంలోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని.. కానీ అమ్మా నాన్నలు డిస్టర్బ్ అవుతారని ఆగినట్టు ఆ మెసేజ్ లో చెప్పాడు. అన్నయ్య యూఎస్ నుంచి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో ఉండాలని వాట్సప్ మెసేజ్ లో పేర్కొన్నాడు. ప్రిన్సిపల్ డా.ఇందిర, ఆర్డిఓ రవి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఒకటో పట్టణ సీఐ విజయ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
