ఖమ్మం ఖిల్లాపై అందరి దృష్టి… త్వరలో రానున్న బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు… తగ్గెదేలే అంటున్న గులాబీ దండు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కడమే కాదు వ్యూహాత్మకమూ అవుతోంది. చాలా కాలంగా ఇద్దరు తెలంగాణ నేతలు ఏ పార్టీలో చేరతారా అన్న చర్చ జరుగుతోంది.

ఖమ్మం ఖిల్లాపై అందరి దృష్టి... త్వరలో రానున్న బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు... తగ్గెదేలే అంటున్న గులాబీ దండు
Ponguleti Srinivasa Reddy, Puvvada Ajay , Mallu Batti Vikramarka , Renuka Chowdary
Follow us
Rajesh Sharma

|

Updated on: Jun 07, 2023 | 7:27 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కడమే కాదు వ్యూహాత్మకమూ అవుతోంది. త్రిముఖ పోరు ఖాయమన్న అభిప్రాయం మొన్నటి వరకు వున్నా ఇపుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ముఖాముఖి పోరు వుండబోతుందా అన్నంతగా పరిస్థితి మారిపోయింది. కర్నాటక ఫలితాలతో ఆవహించిన నిరాశ, నిస్పృహలతో కమల నాథులు గత మూడు వారాలుగా స్తబ్ధుగా మారిపోయారు. బీజేపీ యాక్టివిటీస్‌ కూడా బాగా తగ్గాయి. దాదాపు ప్రతి రోజు మీడియా ముందుకొచ్చే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ఇపుడు ఆఫ్ ది రికార్డు మాటలకు పరిమితమయ్యారు. అయితే, ఈ స్తబ్ధు పరిస్థితిని ఛేదించేందుకు తాజాగా చర్యలు ప్రారంభమయ్యాయి. పార్టీ శ్రేణుల్లో మళ్ళీ ఉత్సాహాన్ని నింపేందుకు అగ్రనాయకత్వం తెలంగాణకు తరలి రానున్నట్లు తాజాగా తెలుస్తోంది. జూన్ 15 నుంచి 30 మధ్య పదిహేను రోజుల వ్యవధిలో బీజేపీ అగ్ర నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించబోతున్నారు. వీరి పర్యటన తెలంగాణలో బీజేపీని తిరిగి బరిలోకి తెచ్చే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలదే దూకుడు అనిపించేలా పరిస్థితి కనిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడ రేవంత్ రెడ్డి .. అగ్ర నేత రాహుల్ గాంధీతో కలిసి అమెరికా పర్యటనలో వున్నారు. అయితేనేం ఇక్కడ తెరమీద సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వంటి వారు.. తెర వెనుక రాహుల్ రహస్య బృందం పరిస్థితిని చక్కబెడుతున్నారు. పాదయాత్ర నిర్వహిస్తున్న మల్లు.. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్నారు. అక్రమాల పుట్ట అయిన ధరణిని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. దాంతో ధరణి విషయంలో ఏకంగా సీఎం కేసీఆర్ మాట్లాడాల్సి వచ్చింది. ఇక తెరవెనుక పావులు కదుపుతున్న రాహుల్ గాంధీ రహస్య బృందం పార్టీలోకి ఎవరెవరిని చేర్చుకోవాలనే అంశంపై దృష్టి సారించారు.

ఆ ఇద్దరి విషయంలో కాంగ్రెస్ సక్సెస్

చాలా కాలంగా ఇద్దరు తెలంగాణ నేతలు ఏ పార్టీలో చేరతారా అన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపి, కోట్లకు పడగలెత్తిన కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న విషయం తాజాగా ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. వీరిద్దరిని చేర్చుకునేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ యధాశక్తి ప్రయత్నించినప్పటికీ చివరికి రాహుల్ రహస్య బృందంతో జరిపిన సమాలోచనలే ఫలితమిచ్చినట్లు బోధపడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖరారైంది. జూన్ 15 తర్వాత ఎప్పుడైనా వీరిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఖమ్మం పాలిటిక్స్ ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి అన్ని ప్రధాన పార్టీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించాయి. కేసీఆర్ పార్టీ గత రెండు ఎన్నికల్లో ఇక్కడ సానుకూల ఫలితాలు పొందలేకపోయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పావులు కదిపి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలోకి రప్పించుకుంది. ఉమ్మడి ఖమ్మం పరిధిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పట్టున్నట్లు గత ఎన్నికల ఫలితాలు చాటాయి. కానీ ఈ రెండు పార్టీల తరపున గెలిచిన వారు గులాబీ దండులో చేరిపోయారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని 10 సీట్లపై కన్నేసింది. గతంలో ఇక్కడ పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.. రాష్ట్రవ్యాప్తంగా వంద సీట్లు దాటేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ భీషణ ప్రతిఙ్ఞ చేశారు. ఆయన చేసిన ప్రకటన సాక్షాత్కారం కావాలంటే ప్రస్తుత నాయకత్వ బలిమికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలవడం అనివార్యమని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. దానికి అనుగుణంగా పావులు కదిపింది. వీరి ప్రయత్నాలకు కర్నాటక ఫలితాలు కూడా తోడవడంతో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. వీరు అనుకుంటున్నట్లుగా తెలంగాణలో కాంగ్రెస్ విజృంభణ వుంటుందా అంటే ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి.

పొంగులేటి పంతం నెరవేరేనా?

ఖమ్మం జిల్లాపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున ఒక్కరిని కూడా అసెంబ్లీ మెట్లక్కనీయబోనని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రకటన జిల్లాల్లో కలకలం రేపింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీటుగా స్పందించారు. పొంగులేటి తన వాపును చూసి బలుపు అనుకుంటున్నారంటూ పువ్వాడ సెటైర్లు వేశారు. పొంగులేటి ఎక్కడ్నించి పోటీ చేసినా ఓడిస్తామని పువ్వాడ సవాల్ చేశారు. వీరి సవాళ్ళు ఎలా వున్నప్పటికీ.. పువ్వాడ మాటల్లో ఒకటి స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణాలో అన్ని చోట్ల రెండు ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాబట్టుకున్నా ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ఏమీ సాధించలేదు. ఎన్నికల తర్వాత గెలిచిన వారిని లాక్కోవడంలో మాత్రం గులాబీ పార్టీ సక్సెస్సయ్యింది. అయితే ఈసారి దాన్ని తిరగరాయాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఆ బాధ్యతలను ప్రస్తుతానికి మంత్రి పువ్వాడ చూస్తున్నా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, మంత్రి కేటీ రామారావు ఖమ్మం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ మధ్య ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళిన కేటీ రామారావు.. చాన్నాళ్ళుగా యాక్టివ్‌గా లేని రాజకీయ దురంధరుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును ఆ భేటీలో యాక్టివ్‌గా కనిపించేలా జాగ్రత్తపడ్డారు. అయితే, తుమ్మలకు పాలేరు సీటిచ్చే విషయంలో బీఆర్ఎస్ అధినాయకత్వానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ సీటులో గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ అని పదేపదే చెప్పుకుంటున్నారు. ఈక్రమంలో తుమ్మలను ఎలా బుజ్జగిస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఏది ఏమైతేనేం బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పట్టు సాధించడం వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతోంది. 2004 కంటే ముందు జిల్లాల్లో బలంగా వున్న వామపక్షాలు ఆ తర్వాత తమ ప్రభను కోల్పోయి చతికిలా పడ్డాయి. ఏదో ఒక పార్టీతో జతకడితేగానీ ఒకటో అరో సీటును గెలుచుకునే హీన స్థితికి చేరాయి. ఈక్రమంలో మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ పార్టీ సాన్నిహిత్యాన్నే కోరుకుంటున్నాయి. ఇదే జరిగితే ఖమ్మం జిల్లాలో చెరో సీటును అడిగే పరిస్థితి వుంది. ఖమ్మం హెడ్ క్వార్టర్‌ని సీపీఐ అడిగే అవకాశం వున్నా.. అక్కడ మంత్రి పువ్వాడ పాగా వేశారు. గతంలో కమ్యూనిస్టుల నేపథ్యమే వున్న పువ్వాడ.. ఖమ్మం ఖిల్లాను వదులుకోవడానికి ఎంతమాత్రం సిద్దంగా లేరు. ఇక సీపీఎం భద్రాచలం సీటును ఆశిస్తోంది. ఈ రెండు సీట్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వామపక్షాలతో ఎలా డీల్ చేస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

త్వరలో ప్రియాంక రాక

ఇక కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి ఖమ్మంలో మంచి ఓటు బ్యాంకు వుంది. 2004కు పూర్వం వున్న వామపక్షాల ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ తమవైపు మళ్ళించుకుంది. ఫలితంగా ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సీట్లను గెలుస్తూ వస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, ప్రస్తుత సీఎల్పీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క వంటి సీనియర్ నేతలున్నారు. ఇపుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకప్పుడు రేణుకా చౌదరిపైనే విజయం సాధించి లోక్‌సభకు వెళ్ళారు. ఆయన ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తే ఒకే.. అలా కాకుండా ఎంపీగా పోటీ చేయాలనుకుంటే మాత్రం ఆయనకు రేణుకా చౌదరి రూపంలో పెద్ద హర్డిలే ముందుంటుంది. ఖమ్మంలో ఎక్కువ సీట్లను గెలుచుకునేందుకు పావులు కదుపుతున్న కాంగ్రెస్ నేతలు.. పొంగులేటిని చేర్చుకునే విషయంలో సక్సెస్సయ్యారు. దీనికి కొనసాగింపుగా త్వరలో ఖమ్మం కేంద్రంగా భారీ బహిరంగ సభకు వారు ప్లాన్ చేస్తున్నారు. దానికి అగ్రనేత ప్రియాంక వధేరాను రప్పించబోతున్నారు. ఈ ప్రయత్నాలు గనక సానుకూలమైతే ఖమ్మం ఖిల్లా తమదేనని గాంధీ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

మళ్ళీ రేసులోకి బీజేపీ!

ఇక ఖమ్మం జిల్లా నామమాత్రపు బలమున్న బీజేపీ కూడా అక్కడ ఎలాగైనా పాగా వేయాలని పావులు కదుపుతోంది. ఇందుకోసం పొంగులేటిని చేర్చుకోవడం ఉత్తమమని భావించి దాదాపు ఆరు నెలల పాటు ఆయన్ను చేర్చుకోవడంపై కమలనాథులు దృష్టి పెట్టారు. కానీ ఆయన చివరికి కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూపుతున్నట్లు బోధపడిన తర్వాత చేరికల కమిటీ కన్వీనర్‌గా వున్న ఈటల రాజేందర్ నైరాశ్యపు మాటలు మాట్లాడారు. రాజేందర్ మాటలు పార్టీలో కలకలం రేపాయి. కర్నాటక ఫలితాలు తమ ఆకర్ష స్కీమ్‌కు గండికొట్టాయన్న కంక్లూజన్‌కి వచ్చిన బీజేపీ నేతలు రెండు, మూడు వారాలుగా స్తబ్ధుగా మారిపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కోలుకోలేమని అనుకున్నారేమో ప్లాన్ బీకి తెరలేపారు కమలనాథులు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ ఓటు బ్యాంకును కలిగి వున్న చంద్రబాబునాయుడుకు కబురు పెట్టారు. ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు నెరిపారు. మంతనాల సారాంశమేమిటో ఇరు పార్టీలు అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఈ రెండు పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాలలో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయన్న ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇక మునుగడ అసాధ్యం అనుకుంటున్న తరుణంలోను ఖమ్మం జిల్లా ఓటర్లు టీడీపీ పక్షాన నిలబడ్డారు. టీడీపీకి అండగా నిలిచే సామాజిక వర్గం ఓటర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద సంఖ్యలోనే వున్నారు. వీరిని దగ్గర చేసుకునేందుకు చంద్రబాబుతో చేతులు కలిపే దిశగా బీజేపీ అగ్రనాయకత్వం అడుగులు పడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక బీజేపీలో నెంబర్ టూ గా భావించే హోం మంత్రి అమిత్ షా జూన్ 15న ఖమ్మం జిల్లాలో నిర్వహించే సభలో పాల్గొనబోతున్నారు. ఒకేరోజున ఆయన అటు ఏపీ సభలోను, తెలంగాణ సభలోను పాల్గొనబోతున్నారు. ఇలా ఖమ్మంలో బలపడేందుకు బీజేపీ యత్నం చేస్తోంది. ఇక ఖమ్మంలో పాగా వేసేందుకు దివంగత వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల కూడా ప్రయత్నిస్తున్నారు. ఆమె పాలేరులో పోటీ చేయడం ద్వారా జిల్లాలో కనీసం రెండు, మూడు సీట్లను కైవసం చేసుకోవాలని ఆమె భావిస్తున్నారు.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!