KTR: ముందు వాటి ధరలు తగ్గించండి.. కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ..
జీఎస్టీ సమావేశంలో వేళ కేంద్రానికి కేటీఆర్ లేఖ రాశారు. బీజేపీకి ప్రజల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు కావాల్సింది ప్రకటనలు కాదని అన్నారు. అంతేకాకుండా ఆ లేఖలో కేటీఆర్ కీలక విషయాలను ప్రస్తావించారు.

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం బుధవారం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ భారం తగ్గిస్తామని.. ఈ సారి ప్రజలు డబుల్ దీపావళి జరుపుకుంటారని ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రకటించారు. ఈ క్రమంలో ఏం మార్పులు ఉండనున్నాయనేది ఆసక్తిగా మారింది. జీఎస్టీ సమావేశం వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖలో కేంద్రం తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. జీఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుందని.. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుందంటూ ఊదరగొడుతుందని ఎద్దేవా చేశారు.
గత పుష్కరకాలంగా పెంచిన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్ల రూపంలో కేంద్రం ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకుందని కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు పెట్రోల్,డీజిల్, ఎల్పీజీ రూపంలో భారం మోపుతూ.. జీఎస్టీ స్లాబ్ మార్పు వలన కేవలం పదుల రూపాయల భారం తగ్గిస్తామంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ధరల తగ్గింపుపైన చిత్తశుద్ధి ఉంటే.. దానికి ప్రాథమిక కారణమైన పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ తగ్గితే రవాణా భారం తగ్గి.. దాదాపు అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు. పెట్రోల్, డీజిల్ పన్నులు తగ్గించి.. సెస్‌లను పూర్తిగా ఎత్తివేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. లేకపోతే బీజేపీ మాటలు మరొక జుమ్లాగా మిగిలిపోతాయని విమర్శించారు.
చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కేటీఆర్ అన్నారు. ‘‘అన్ని జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. విద్యకు సంబంధిత ఫీజులపై విధించే జీఎస్టీని పూర్తిగా తొలగించాలి. క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు, ప్రాణాలు కాపాడే జీవనావశ్యక ఔషధాలపై జీఎస్టీ ఎత్తేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వీటి ధరలను తగ్గించాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
