Agnipath Protest Updates: ముగిసిన రాకేష్ అంత్యక్రియులు.. సికింద్రాబాద్ ఘటనలో లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకోండి
Secunderabad Railway Station Incident: మొత్తం 200 మంది పాల్గొన్నట్లు అంచనావేస్తున్నారు. ఇప్పటికే 52మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

Agnipath Protest: అల్లర్లు, విధ్వంసంతో నిన్న అట్టుడికిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఇవాళ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పటిలాగే ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. పోలీసుల హైసెక్యూరిటీతో ప్రయాణికుల్లో భయం తొలగింది. తమతమ గమ్యస్థానాలకు వెళ్లడానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కి ప్రయాణికులు చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసంలో జరిగిన నష్టంపై మరోసారి రైల్వే అధికారులు క్లారిటీ ఇచ్చారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.12 కోట్ల ప్రాపర్టీ డ్యామేజ్ జరిగినట్లు తెలిపారు సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా. మెయిన్‌గా రెండు, మూడు, నాలుగు, ఐదు ప్లాట్‌ఫామ్స్‌లో డ్యామేజీ ఎక్కువగా జరిగిందన్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో కీలక నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్‌కి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. విధ్వంసం కేసులో అరెస్టులపర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు 22మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నరసరావుపేట అభ్యర్థులే దాడి చేసినట్టు గుర్తించారు. ఆందోళనకారుల్లో ఎక్కువ మంది..సాయిడిఫెన్స్ అకాడమీ అభ్యర్థులుగా గుర్తించారు హైదరాబాద్ పోలీసులు.
విధ్వంస ఘటనలో 200 మంది?




రైల్వే కోర్టు జడ్జి ముందు 17మంది సికింద్రాబాద్ కేసు నిందితులను హాజరుపర్చారు. సికింద్రాబాద్ అల్లర్లలో మొత్తం 200 మంది పాల్గొన్నట్లు అంచనావేస్తున్నారు. ఇప్పటికే 52మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. 17మందిని నిందితులుగా తేల్చి రిమాండ్ కోసం జడ్జి ముందు హాజరుపర్చారు. మిగతా నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ముగిసిన రాకేష్ అంత్యక్రియలు..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పోలీస్ కాల్పుల్లో మరణించిన రాకేష్ అంత్యక్రియలు అతని స్వగ్రామంలో నిర్వహించారు. అతడి అంతిమ యాత్రలో వేలాదిగా పాల్గొని కన్నీటి నివాళి అర్పించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య వరంగల్‌లో మొదలైన రాకేష్ అంతిమయాత్ర డబీర్‌పేట చేరింది. రాకేష్ కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓదార్చారు. రాకేష్ తల్లిదండ్రులతో మాట్లాడిన ఎర్రబెల్లి, అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాకేష్ మృతికి కేంద్రమే బాధ్యత వహించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
తొలుత వరంగల్ MGMలో రాకేష్ మృతదేహానికి నివాళులర్పించారు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, టీఆర్‌ఎస్ నేతలు. అక్కడి నుంచి నర్సంపేట మండలం డబీర్‌పేట వరకు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. రాకేష్ పాడే మోశారు మంత్రి ఎర్రబెల్లి.
రాకేష్ అంతిమ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత
అంతకు ముందు వరంగల్‌లో రాకేష్ అంతిమ యాత్రలో అల్లర్లు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. వరంగల్‌లోనే మూడు చోట్ల రాళ్ల దాడికి దిగారు ఆందోళనకారులు. వరంగల్ రైల్వే స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. స్టేషన్‌పై రాళ్ల దాడికి ప్రయత్నించారు. సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్‌పై రాళ్ల జరిగింది. మధ్యలో BSNL ఆఫీస్‌పైనా రాళ్లు రువ్వారు ఆందోళనకారులు.ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు.
కేంద్రం తీరు వల్లే తెలంగాణ బిడ్డ రాకేష్ మృతిచెందాడనిమంత్రి హరీష్‌రావు ఆరోపించారు. ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు.
నర్సంపేటలో ఉద్రిక్తత..
నర్సంపేటలోనూ టెన్షన్ నెలకొంది. MLA క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు రాకేశ్ అంతిమ యాత్రలో నర్సంపేట ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం దగ్గర కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాకేష్ సొంత గ్రామం డబీర్‌పేటలోనూ టెన్షన్ నెలకొంది. ఎలాంటి ఘటనలు జరగకుండా అంత్యక్రియలు పూర్తయ్యే వరకు పోలీసులు పెద్దయెత్తున భద్రత కల్పించారు.
రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
రాకేష్ అంతిమ యాత్రలో పాల్గొని, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అడ్డుకున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. టోల్ గేట్ దగ్గర పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు రేవంత్‌రెడ్డి. ఈ సమయంలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. చివరకు రేవంత్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు ఘట్‌కేసర్ పోలీసులు.
14 మందికి కొనసాగుతున్న చికిత్స..
అటు సికింద్రాబాద్ అల్లర్లలో గాయపడ్డ 14మందికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఈ 14మందిలో ఐదుగురికి బుల్లెట్ గాయాలు కాగా, మిగతా 9మందికి సాధారణ గాయాలైనట్లు తెలిపారు గాంధీ సూపరింటెండెంట్. చెస్ట్, తొడ, కాళ్లకు బుల్లెట్ గాయాలు తగిలినట్లు చెప్పారు.
ఆర్మీలో కొత్త విప్లవం కోసం అగ్నిపథ్.. రాజ్‌నాథ్
అగ్నిపథ్‌పై దేశంలో అపోహలు సృష్టిస్తున్నారన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్. ఆర్మీలో ఓ కొత్త విప్లవం తీసుకొచ్చేందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చామన్నారు. గత రెండు మూడేళ్లుగా మాజీ సైనికాధికారులు, ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత కేంద్ర సర్కార్ అగ్నిపథ్ తీసుకొచ్చిందన్నారు. దేశ యువతలో క్రమశిక్షణ, దేశభక్తిని తీసుకొచ్చేందుకే ఈ పథక ముఖ్య ఉద్దేశమన్నారు.
అటు త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. బీహార్‌లో ఇవాళ కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సమీక్ష..
అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళన నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ అలెర్టయింది. త్రివిధ దళాధిపతులతో డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్‌సింగ్ సమీక్ష నిర్వహించారు. అగ్నిపథ్ స్కీమ్‌పై రక్షణశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అగ్నిపథ్‌లో పనిచేసి పదవీ విమరణ పొందే అగ్నివీరులకు రక్షణశాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు రక్షణ శాఖ శనివారం ట్విటర్ వేదికగా వెల్లడించింది.
దిద్దుబాటు చర్యలు..అగ్నిపథ్‌లో మార్పులు
అర్హత ఉన్న అగ్నివీరులకు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్ట్‌లతో పాటు 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ విభాగాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాతో పాటు ఈ రిజర్వేషన్ అమలవుతుందని తెలిపారు. దీనికోసం నియామక నిబంధనల్లో తగిన సవరణలు చేస్తున్నామని ప్రకటించారు. అంతేకాదు ఏజ్ లిమిట్ కూడా చేస్తున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది.
మద్ధతు తెలిపిన సోనియాగాంధీ..
అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించారు. ఈ వివాదాస్పద పథకాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో పార్టీ మీకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కానీ నిరసనను శాంతియుతంగా జరపాలని అభ్యర్థులను కోరారు. కేంద్ర సర్కార్ ఆర్మీ ఉద్యోగార్థుల ప్రయోజనాలను పట్టించుకోకుండా దిక్కు,దిశలేని కొత్త రకం సైనిక రిక్రూట్‌మెంట్ పథకాన్ని ప్రకటించడం తీవ్ర నిరాశకు గురిచేసిందంటూ ట్వీట్ చేశారు సోనియా. ఈ ట్వీట్‌ను పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..
