AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR : ఆరునూరైనా వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపచేసి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే లక్ష్యం నెరవేరింది : కేసీఆర్

మిషన్ కాకతీయ తోపాటు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించామని, రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చివేసామని..

KCR : ఆరునూరైనా వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపచేసి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే లక్ష్యం నెరవేరింది : కేసీఆర్
CM KCR
Venkata Narayana
|

Updated on: May 29, 2021 | 8:43 PM

Share

CM on Telangana Agriculture : నూతన తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింప చేసి, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే సిద్దాంతంతో  వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మిషన్ కాకతీయ తోపాటు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించామని..  రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చివేసామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేసులేసి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అవాకులు చవాకులు పేలినా, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వెనకడుగు వేయకుండా పట్టుపట్టి పూర్తి చేసుకోగలిగామన్నారు. తెలంగాణ రైతుకు నేడు వ్యవసాయం మీద ధీమా పెరిగిందన్నారు. అంకితభావంతో, రైతు సంక్షేమం వ్యవసాయాభివృద్ధి పట్ల చిత్తశుద్దితో, తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడం వల్లనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగామని సీఎం అన్నారు.

వానాకాలం సీజన్ ప్రారంభమౌతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను ఫెస్టిసైడ్స్ ను అందుబాటులోకి తేవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కల్తీ విత్తనాలు, ఫెస్టిసైడ్స్, బయో ఫెస్టిసైడ్స్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద ఉక్కుపాదం మోపాలని వ్యవసాయ శాఖ , పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి విత్తనాలు ఫెస్టిసైడ్లను అనుమతించిన కంపెనీల ద్వారా మాత్రమే విక్రయాలు జరిగేలా చూడాలని, ప్రభుత్వం జారీ చేసే క్యూ ఆర్ కోడ్ సీడ్ ట్రేసబిలిటీ విధానాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. విత్తనాలు ఫెస్టిసైడుల్లో కల్తీని అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తూ, అవసరమైన చట్ట సవరణ చేయాలని, అందుకు సంబంధించి అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేయాలని సిఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

ప్రగతి భవన్ లో శనివారం వ్యవసాయ రంగం,  విత్తనాల లభ్యత,  కల్తీ విత్తనాల నిరోధం, రైతుబంధు పంపిణీ, ధాన్యం సేకరణ  మీద సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ..  రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,  ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బండి కృష్ణమోహన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, సివిల్ సప్లయిస్ కమిషనర్ అనిల్ కుమార్, సీడ్స్ కార్పోరేషన్ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.

Read also : Tragedy : కరోనా తెచ్చిన కన్నీటి గాథలు : కన్నతల్లి చనిపోవడంతో బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య