Telangana: కళ్లెదుటే ఎన్నో రోడ్డు ప్రమాదాలు.. చలించిపోయిన రిక్షావాలా.. చేశాడో తెలుసా?
రహదారిపై గుంతలను అధికారులు పట్టించుకోకపోవడంతో తన కళ్లెదుటే ఎన్నో ప్రమాదాలు జరిగి వాహనదారులు ఆసుపత్రి పాలయ్యారని షేక్ బాబా చెబుతున్నాడు
రహదారులపై నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాద సమయంలో అటుగా వెళ్లే వాహనదారులు తమకేమీ పట్టనట్లుగా బాధ్యతా రాహిత్యంగా ఉంటారు. ప్రమాద క్షతగాత్రులను పట్టించుకోకుండా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంటారు. కానీ తాను నిత్యం వెళ్లే ఆ రహదారిపై ప్రమాదాలు జరుగుతుండడంతో ఓ రిక్షా కార్మికుడు ఏం చేశాడో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..!
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశమిది. వందలాది వాహనాలు రాకపోకలు సాగించే సూర్యాపేట – దంతాలపల్లి ప్రధాన రహదారి. రహదారిపై అక్కడక్కడా ఏర్పడిన భారీ గుంతలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకమంది వాహన దారులు ప్రమాదాల బారిన పడి గాయాలపాలవుతున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా.. కాళ్ళు, చేతులు విరుగుతున్నా, వాహనాలు గుల్లగా మారుతున్నా… అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు అటువైపు కన్నెత్తి చూడలేదు. వాహనదారులు, పౌరులు సైతం నాకెందుకులే అని వదిలేసి పోయేవాళ్ళే తప్ప ఎవరూ పట్టించుకోవడంలేదు. తాను నిత్యం రాకపోకలు సాగించే రహదారిపై గుంతల కారణంగా ప్రమాదాలు జరగడం చూసి నాకెందుకులే అని ఓ రిక్షా కార్మికుడు వదిలేయలేదు..!
కుడకుడకు చెందిన షేక్ బాబా అనే రిక్షా కార్మికుడు.. ప్రతిరోజు సూర్యాపేట పట్టణానికి ఉపాధి కోసం వెళుతుంటాడు. గుంతల మయంగా మారిన రహదారిపై తరచూ ప్రమాదాల బారిన పడుతున్న క్షతగాత్రులను తన రిక్షాలోనే హాస్పిటల్ కు తరలించేవాడు. చాలామంది వాహనదారులు ప్రమాదాల బారిన పడుతుండడం, రహదారిని ఎవరు పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందాడు. బాధ్యత గల పౌరుడిగా తన రిక్షాపై చిన్న, చిన్న రాళ్ళు, మట్టిని తెచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న గుంతలను పూడ్చాడు.
రహదారిపై గుంతలను అధికారులు పట్టించుకోకపోవడంతో తన కళ్లెదుటే ఎన్నో ప్రమాదాలు జరిగి వాహనదారులు ఆసుపత్రి పాలయ్యారని షేక్ బాబా చెబుతున్నాడు. తట్టెడు మట్టి పోస్తే పోయే పనికి లక్షల్లో ఆసుపత్రి బిల్లులు కట్టడం మంచిదా అని ప్రశ్నించుకున్నానని.. అందుకే గుంతలను పూడ్చానని అంటున్నాడు సదరు రిక్షా కార్మిక సోదరుడు. మరి బాధ్యత ఎరిగి పౌరునిగా వ్యవహరించి ఆదర్శంగా నిలిచిన రిక్షా అన్నకు వేసుకుందాం ఒక సలాం..!
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..