AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానేరువాగు ఒడ్డున గాయంతో తల్లడిల్లిన వలస పక్షి.. ప్రాణదాతగా నిలిచిన పక్షి ప్రేమికుడు..!

చలికాలం వచ్చిందంటే చాలు.. రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామ సమీపంలోని మానేరువాగు తీర ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు, పక్షి పరిశీలకులకు స్వర్గధామంగా మారుతుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే అరుదైన పల్లాస్ గల్ పక్షులు ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఆశ్రయంగా చేసుకుంటాయి. నీలాకాశం, వాగు ఒడ్డు, వాటి విహారం కలిసి అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి.

మానేరువాగు ఒడ్డున గాయంతో తల్లడిల్లిన వలస పక్షి.. ప్రాణదాతగా నిలిచిన పక్షి ప్రేమికుడు..!
Saved Russian Migratory Bird
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 27, 2026 | 1:10 PM

Share

చలికాలం వచ్చిందంటే చాలు.. రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామ సమీపంలోని మానేరువాగు తీర ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు, పక్షి పరిశీలకులకు స్వర్గధామంగా మారుతుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే అరుదైన పల్లాస్ గల్ పక్షులు ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఆశ్రయంగా చేసుకుంటాయి. నీలాకాశం, వాగు ఒడ్డు, వాటి విహారం కలిసి అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి.

ఈ అరుదైన క్షణాలను తమ కెమెరాల్లో బంధించేందుకు ప్రతి సంవత్సరం పక్షి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో మానేరువాగు తీరానికి తరలివస్తుంటారు. ప్రకృతి అందాల మధ్య పక్షుల స్వేచ్ఛాయుత విహారం చూడటమే వారి లక్ష్యం. ఇదే క్రమంలో ఈ సంవత్సరం కూడా పక్షులను వీక్షించేందుకు వచ్చిన అబ్దుల్ రహీం అనే పక్షి ప్రేమికుడికి ఊహించని దృశ్యం ఎదురైంది. వాగు తీరంలో ఒక రష్యా దేశం నుంచి వచ్చిన పల్లాస్ గల్ పక్షి నేల మీదే ఉండిపోయింది. ఎగరడానికి ప్రయత్నించి విఫలమవుతుండటం ఆయన గమనించారు. దగ్గరగా వెళ్లి పరిశీలించగా ఆ పక్షికి ఒక రెక్క తీవ్రంగా గాయపడి తెగిపోయిన స్థితిలో కనిపించింది.

ఎగరలేని స్థితిలో ఉన్న ఆ పక్షి ఎప్పుడైనా ఇతర జంతువుల దాడికి గురయ్యే ప్రమాదం ఉందని రహీం గుర్తించారు. ప్రకృతిలోని ఒక జీవి ప్రాణం కళ్ల ముందే ఆగిపోతుందేమోనన్న ఆందోళనతో ఆయన వెంటనే స్పందించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు రహీం. అటవీ శాఖ అధికారుల సూచనల మేరకు అత్యంత జాగ్రత్తగా ఆ పక్షిని కాపాడుతూ అక్కడే ఉండిపోయారు. అటవీ శాఖ అధికారులు ఇద్దరు స్థానికులని సహాయానికి పంపించగా, పక్షి ప్రేమికుడే స్వయంగా బాధ్యత తీసుకుని గాయపడిన పక్షిని సురక్షిత ప్రదేశానికి తరలించారు.

అధికారుల సమన్వయంతో ఆ పల్లాస్ గల్‌ను కరీంనగర్‌లోని డీర్ పార్క్‌కు అప్పగించారు. అక్కడ వైద్య చికిత్స అందించి పక్షి ప్రాణాలను కాపాడే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పర్యావరణం పట్ల, పక్షుల పట్ల అబ్దుల్ రహీంకు ఉన్న అపారమైన ప్రేమను డీర్ పార్క్ నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. విదేశాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి మన ప్రాంతాలకు వచ్చే వలస పక్షులు మన అతిథులని, వాటి రక్షణ మన బాధ్యతేనని అబ్దుల్ రహీం తెలిపారు. చిన్న నిర్లక్ష్యం ఒక జీవి ప్రాణాన్ని హరిస్తుందని, ప్రతి ఒక్కరూ పక్షులు, జంతువుల పట్ల ప్రేమతో, జాగ్రత్తతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మానేరువాగు తీరంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రకృతి పరిరక్షణలో సామాన్య పౌరుల పాత్ర ఎంత కీలకమో మరోసారి చాటిచెప్పింది. కెమెరాతో దృశ్యాలు బంధించాలనుకున్న పక్షి ప్రేమికుడు, అవసరమైతే ప్రాణాలను కాపాడే బాధ్యత కూడా తీసుకోవచ్చని అబ్దుల్ రహీం తన చర్యలతో నిరూపించారు.

వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..