ఆరేళ్ల బుడ్డోడి వినతికి ఫిదా అయిన మంత్రి.. గ్రామస్తుల ప్రశంసలు..! ఇంతకీ ఆ చిన్నారి కోరిక ఏంటంటే..
చిన్నతనంలోనే ఊరి సమస్యను గుర్తించి, ఏకంగా రాష్ట్ర మంత్రినే కలిసి వినతిపత్రం సమర్పించిన ఒక ఆరేళ్ల బాలుడి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఆ చిన్నారి చొరవకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణ స్పందనకు నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంతకీ ఆ ఊరికి ఉన్న సమస్య ఏంటి..? ఆ బుడ్డొడి వినతి పత్రంలో ఏముందో తెలియాలంటే..పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

ఖమ్మం జిల్లా కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఒక ఆరేళ్ల బాలుడు చూపించిన చొరవ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. కల్లూరులో రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న సమయంలో, ఒక ఆరేళ్ల బాలుడు తన తండ్రితో కలిసి మంత్రి వద్దకు వచ్చాడు. మా ఊరికి బస్సు వేయించండి మంత్రి గారు అంటూ ఒక వినతిపత్రాన్ని మంత్రి చేతికి అందించాడు. చిన్నారి అమాయకత్వం, ఆవేదన చూసి మంత్రి పొంగులేటి ఎంతగానో మురిసిపోయారు.
కల్లూరు మండలం చెన్నూరు నుంచి లింగాల గ్రామానికి వెళ్లే మెయిన్ రోడ్డుకు దాదాపు 2 కిలోమీటర్ల లోపలికి ఎర్రబోయినపల్లి గ్రామం ఉంటుంది. లింగాల నుంచి ఎర్రబోయినపల్లికి కేవలం 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నప్పటికీ, స్థానిక ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరి నుంచి రూ. 50 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో రోజూ బడికి వెళ్లే పాఠశాల విద్యార్థులు, గ్రామస్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చెన్నూరు నుంచి లింగాల మధ్య నడిచే బస్సును ఎర్రబోయినపల్లి గ్రామం మీదుగా నడపాలని ఆ చిన్నారి మంత్రిని కోరాడు.
ఆ బాలుడు అందించిన వినతిపత్రానికి, అతని చొరవకు ఫిదా అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే వేదికపై నుంచే ఆర్టీసీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మీ ఊరికి వారం రోజుల్లోగా బస్సు వస్తుంది… సరేనా చిన్నోడా! అని మంత్రి ఆ బాలుడిని ప్రేమగా మురిపెం చేస్తూ హామీ ఇచ్చారు. వారం రోజుల్లోగా ఎర్రబోయినపల్లికి ఆర్టీసీ బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కచ్చితంగా ఆదేశించారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఆరేళ్ల వయసులోనే గ్రామ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, స్వయంగా బస్సు సౌకర్యం కల్పించేలా చేసిన ఆ బాలుడిని ఎర్రబోయినపల్లి గ్రామస్థులు శభాష్ రా బుడ్డోడా! అంటూ కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.




