టైల్స్, మార్బుల్, గ్రానైట్.. ఇంటి ఫ్లోరింగ్‌కు ఏది బెస్ట్..? తక్కువ బడ్జెట్‌లో ఇలా ప్లాన్ చేసుకోండి..
కొత్త ఇల్లు కడుతున్నారా.. లేక ఫ్లోరింగ్ మార్చాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మార్బుల్ వేయించాలా.. టైల్స్ వేస్తే బాగుంటుందా.. గ్రానైట్ ఎక్కడ వాడాలి అనే డౌట్ మీకూ వచ్చి ఉంటుంది. ఒకప్పుడు మార్బుల్ క్రేజ్ ఉండేది.. కానీ ఇప్పుడు టైల్స్ సైతం మార్బుల్‌కు మించిన రాయల్ లుక్‌ను ఎలా ఇస్తున్నాయో తెలుసా? మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేసే ఫ్లోరింగ్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భావోద్వేగ ప్రయాణం. జీవితకాలంలో ఒక్కసారే చేసే భారీ పెట్టుబడి కావడంతో గోడలు, రంగులు, తలుపుల నుంచి ఫ్లోరింగ్ వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా ఇంటికి నిండుదనాన్ని, అందాన్ని తెచ్చే ఫ్లోరింగ్ విషయంలో ఎక్కువమంది గందరగోళానికి గురవుతుంటారు. మార్కెట్లో మార్బుల్, గ్రానైట్, టైల్స్ ఇలా రకరకాల ఎంపికలు అందుబాటులో ఉండటంతో దేన్ని ఎంచుకోవాలో తేల్చుకోలేరు. మరి ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఇంటికి ఏది ఉత్తమమైనది? బడ్జెట్ ఎంత అవుతుంది? ఇంటీరియర్ నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
టైల్స్ హవా: రకరకాల డిజైన్లు.. తక్కువ బడ్జెట్..
ఇటీవలి కాలంలో ఇంటి నిర్మాణాల్లో టైల్స్‌కు విపరీతమైన ఆదరణ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో నేడు గ్లాసీ, మ్యాట్, 3D ప్రింటెడ్, వుడ్‌గ్రెయిన్, స్టోన్‌వర్క్ వంటి అధునాతన డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. హాల్ లేదా లివింగ్ రూమ్‌లకు రిచ్ లుక్ ఇచ్చేందుకు గ్లాసీ ఫినిషింగ్ టైల్స్, బెడ్‌రూమ్‌లలో ప్రశాంతమైన వాతావరణం కోసం వుడెన్ లేదా మ్యాట్ ఫినిషింగ్ టైల్స్ మంచి ఎంపిక. మంచి నాణ్యత కలిగిన బ్రాండెడ్ టైల్స్ ధర సాధారణంగా చదరపు అడుగుకు సుమారు రూ.50 నుండి రూ.70 నుంచి ప్రారంభమవుతాయి. బ్రాండ్, సైజు, డిజైన్‌ను బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి.
మార్కెట్లో కొత్త ట్రెండ్: పెద్ద సైజు స్లాబ్ – నానో టైల్స్
గతంలో మాదిరిగా చిన్న టైల్స్ కాకుండా ప్రస్తుతం పెద్ద పరిమాణంలో ఉండే నానో, స్లాబ్ శైలి టైల్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటి సైజు పెద్దగా ఉండటం వల్ల ఫ్లోరింగ్‌పై జాయింట్లు తక్కువగా ఉండి, ఫ్లోర్ మొత్తం మార్బుల్ వేసినట్లు సహజంగా, గ్రాండ్‌గా కనిపిస్తుంది. విశాలమైన హాల్స్‌కు ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని ఫిక్స్ చేయడానికి నైపుణ్యం కలిగిన నిపుణులు ఉండాలి. సరైన లెవలింగ్‌తో వేస్తేనే వీటి లుక్ సంపూర్ణంగా వస్తుంది.
మార్బుల్ ఎందుకు వెనుకబడింది? గ్రానైట్ ప్రాధాన్యత ఏంటి?
మార్బుల్ సహజసిద్ధమైన రాయి కావడం వల్ల దీనిలో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వీటిపై టీ, కాఫీ, నూనె మరకలు పడితే త్వరగా వదలవు. పైగా కట్ చేయడం, ఫిట్టింగ్ తర్వాత పాలిష్ చేయించడం వంటి పనులతో లేబర్ ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. అందుకే మధ్యతరగతి ఇంటి నిర్మాణాల్లో మార్బుల్ వాడకం క్రమంగా తగ్గుతోంది.
గ్రానైట్ ఎక్కడ వాడాలి?: గ్రానైట్ అత్యంత గట్టిదనం, మన్నిక కలిగిన రాయి. అయితే ఇల్లంతటా గ్రానైట్ వేయడానికి బదులుగా వంటగది ప్లాట్‌ఫామ్‌లు , మెట్లు, బాల్కనీలు, పార్కింగ్ ఏరియాల్లో వాడటం ఎంతో మంచిది.
ఫ్లోరింగ్ ఎంపికలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు
తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ లుక్, తేలికపాటి మెయింటెనెన్స్ కోరుకునేవారికి టైల్స్ అత్యుత్తమ ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కేవలం బాహ్య రూపాన్ని చూసి మాత్రమే కాకుండా.. టైల్స్ మన్నిక, జారకుండా ఉండే గుణం, నీటిని పీల్చుకునే సామర్థ్యం వంటి సాంకేతిక అంశాలను కూడా పరిశీలించి ఇంటికి తగిన మెటీరియల్‌ను ఎంచుకోవాలి.
