ఉదయం బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా? నోటి ఆరోగ్యంపై డెంటల్ సర్జన్ ఏం చెబుతున్నారంటే..
ఉదయాన్నే పళ్లు తోముకోవడానికి ముందే ఒక గ్లాసు నీరు తాగడం నోటి ఆరోగ్యానికి, శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ రామకృష్ణ టి. తెలిపారు. బ్రష్ చేయకుండా నీరు తాగితే నోట్లోని బ్యాక్టీరియా కడుపులోకి వెళ్తుందనేది తప్పుడు నమ్మకమని, కడుపులోని శక్తివంతమైన ఆమ్లాలు ఆ బ్యాక్టీరియాను నశింపజేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ అలవాటు రాత్రిపూట నోట్లో పేరుకుపోయిన ఆమ్లాలను పలచన చేసి నోటి pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. అలాగే, బ్రష్ చేసిన వెంటనే నీరు తాగకూడదని చెబుతున్నారు. పూర్తి వివరాల్లేంటో ఇప్పుడు చూద్దాం..

మనలో చాలామందికి ఉదయాన్నే నిద్రలేవగానే ఒక గ్లాసు నీరు తాగే అలవాటు ఉంటుంది. అయితే, పళ్లు తోముకోకుండా నీరు తాగితే నోట్లోని క్రిములు బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లి అనారోగ్యం కలుగుతుందేమోనని కొందరు భయపడుతుంటారు. కానీ, ఈ అలవాటు పూర్తి సురక్షితమైనదని, నోటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ సీనియర్ డెంటల్ సర్జన్ డాక్టర్ రామకృష్ణ టి. స్పష్టం చేస్తున్నారు. రాత్రి సమయంలో నోట్లో ఏం జరుగుతుంది?
మనం నిద్రపోతున్నప్పుడు నోట్లో లాలాజలం ఊరడం సహజంగానే తగ్గుతుంది. దీనివల్ల నోరు పొడిబారుతుంది. లాలాజలం తగ్గడం వల్ల నోట్లోని బ్యాక్టీరియా ఆహార కణాలపై చర్య జరిపి ఆమ్లాలను విడుదల చేస్తుంది. దీనివల్ల నోటి pH స్థాయి తగ్గి, దంతాల ఎనామెల్ తాత్కాలికంగా బలహీనపడుతుంది.
బ్రష్ చేయడానికి ముందు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఆమ్లాల తీవ్రత తగ్గుతుంది: ఉదయాన్నే ఒక గ్లాసు నీరు తాగడం వల్ల రాత్రంతా నోట్లో ఉత్పత్తయిన ఆమ్లాల తీవ్రత తగ్గి, నోటి pH స్థాయి సమతుల్యమవుతుంది. ఇది దంతాల ఎనామెల్ దెబ్బతినకుండా కాపాడుతుంది. కడుపులోని ఆమ్లాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి:
పళ్లు తోమకుండా నీళ్లు తాగితే బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్లిపోతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. మన కడుపులో ఉండే బలమైన యాసిడ్స్ ఆ బ్యాక్టీరియాను తక్షణమే నశింపజేస్తాయి. కాబట్టి, నీరు తాగడం వల్ల నోరు శుభ్రపడటమే కాకుండా జీర్ణవ్యవస్థ కూడా ఉత్తేజితమవుతుంది.
లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది: ఉదయాన్నే నీరు తాగడం వల్ల లాలాజల గ్రంథులు క్రియాశీలమవుతాయి. లాలాజలంలోని క్యాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు దంతాలను సహజంగా రక్షిస్తాయి.
బ్రష్ చేసిన వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు?చాలామంది టూత్‌పేస్ట్‌లలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది దంతాల ఉపరితలంపై ఒక రక్షణ పొరను ఏర్పాటు చేసి, పుచ్చిపోకుండా కాపాడుతుంది. బ్రష్ చేసిన వెంటనే నీళ్లు తాగడం లేదా నోరు బాగా ముక్కళించడం వల్ల ఈ ఫ్లోరైడ్ కొట్టుకుపోతుంది. కాబట్టి, బ్రష్ చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల వరకు నీరు, టీ, కాఫీ లేదా ఆహారం తీసుకోకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
సరైన ఉదయపు నోటి సంరక్షణ నియమాలు:
ఉదయాన్నే లేవగానే ఒక గ్లాసు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని నోట్లో తిప్పుతూ తాగాలి. ఆ తర్వాత ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌తో దంతాలను మృదువుగా బ్రష్ చేసుకోవాలి. నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. బ్రష్ చేసిన తర్వాత నోట్లో ఉన్న పేస్ట్‌ను మాత్రమే ఉమ్మివేయాలి, వెంటనే నీటితో బాగా ముక్కళించకూడదు. పళ్లు తోముకున్న తర్వాత టీ, కాఫీ లేదా అల్పాహారం తీసుకోవడానికి కనీసం 30 నిమిషాల గ్యాప్ ఇవ్వాలి. ఈ చిన్నపాటి చిట్కాలను నిత్యం పాటించడం ద్వారా దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు!




