Telangana: ఒకే రోజు జననం.. ఒకే రోజు మరణం.. విధి ఆట ఇదే.. మృత్యుఒడిలోకి అన్నదమ్ములు

అజయ్‌, నర్సింలు ఎంతకూ రాకపోయేసరికి మిత్రుడు లక్ష్మణ్‌ వెళ్లి చూసేసరికి పిల్లలిద్దరూ నీటిలో మునిగిపోతూ అరుస్తున్నారు. లక్ష్మణ్‌ పరుగెత్తుకెళ్లి ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు నవీన్‌కుమార్‌కు చెప్పాడు.

Telangana: ఒకే రోజు జననం.. ఒకే రోజు మరణం.. విధి ఆట ఇదే.. మృత్యుఒడిలోకి అన్నదమ్ములు
Brothers Death
Follow us

|

Updated on: Jun 23, 2022 | 2:39 PM

పాఠశాలల్లో మరుగుదొడ్డి ప్రాధాన్యంపై నెత్తీనోరూ బాదుకున్నా ఉపయోగం లేకుండా పోతోంది. సహజ సిద్ధమైన అత్యవసరమైన ఓ సదుపాయానికి పాఠశాలలు నోచుకోని దయనీయమైన స్థితి తెలంగాణలో రెండు నిండు ప్రాణాలను బలిగొన్నది. మెదక్‌ జిల్లాలో మరుగుదొడ్డి లేని ఓ పాఠశాల ఇద్దరు చిన్నారుల ప్రాణాలను హరించివేసిన ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది.  మెదక్‌ జిల్లాలోని కొంగోడ్‌లో అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లల ప్రాణాలు తీసింది ప్రకృతి అవసరం. మధ్యాహ్న భోజన విరామం సమయంలో యూరినల్స్‌ కోసం నాలుగో తరగతి చదువుతోన్న అజయ్‌, నర్సింహులు ఇద్దరూ పాఠశాలకు సమీపంలో ఉన్న నీటి గుంతవద్దకు వెళ్ళి ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయారు. స్నేహితులిద్దరూ ఎంతకూ రాకపోయేసరికి మరో విద్యార్థి గుంత దగ్గరికి వెళ్ళి చూడగా అజయ్‌, నర్సింహులు నీటిలో మునిగిపోతూ కేకలు వేస్తూ కనిపించారు. విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు పరుగు పరుగున వెళ్ళేసరికే నర్సింహులు మునిగిపోగా, అజయ్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత నర్సింహులు మృతదేహాన్ని వెలికితీశారు గ్రామస్తులు. కేవలం టాయ్‌లెట్‌ లేక, యూరినల్స్‌కి బయటకు వెళ్ళి, ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది.

స్కూల్‌లో టాయ్‌లెట్‌ లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మండిపడుతున్నారు స్థానికులు. వీరిద్దరూ అన్నదమ్ముల పిల్లలు కావడంతో ఒకే ఇంట్లో ఒకేసారి ఇద్దరు పిల్లల్ని మృత్యువు కబళించడం ఒక విషాదం అయితే, ఆ పాఠశాలలో కనీస సౌకర్యాల లోపం కొట్టొచ్చినట్టు కనపడుతోందంటున్నారు స్థానికులు. పాఠశాలలో సరైన టాయ్‌లెట్‌ సౌకర్యం లేకపోవడం వల్లనే ఈ దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. గత ఐదేళ్ళుగా స్థానికులు పాఠశాలలో కనీస సదుపాయల కోసం పదే పదే డిమాండ్‌ చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. ఆడపిల్లలు వీలైతే ఇళ్ళకు వెళ్ళి తమ అవసరాలను తీర్చుకోవాల్సిన పరిస్థితి. లేదంటే చదువు మానేసి ఇళ్ళకే పరిమితమౌతారు. కానీ మగపిల్లలు బడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోతోన్న స్థితి పాఠశాలలో టాయ్‌లెట్‌ అవసరాన్ని మరోమారు చర్చనీయాంశం చేసింది.

అయితే ఈ చిన్నారులిద్దరూ అన్నదమ్ముల పిల్లలు కావడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఒకే ఇంట ఇద్దరు పిల్లల మరణం స్థానికుల్లో విషాదాన్ని నింపింది. అయితే మరో విషయం కూడా ఈ మరణాన్ని సంచలనంగా మార్చింది. చావు పుట్టుకలు చెప్పిరావంటారు. కానీ ఈ ఇద్దరి విషయంలో ఆ నానుడి తారుమారయ్యింది. ఒకే రోజు జన్మించిన ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు ఇద్దరూ ఒకే రోజున మరణించడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మెదక్‌ జిల్లా కొంగోడ్‌లో జరిగిన ఈ ఘటన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల ఇళ్ళల్లో అంతులేని విషాదాన్ని నింపింది. షేకులు, లాలయ్యలు ఇద్దరూ అన్నదమ్ములు. షేకులు కొడుకు అజయ్‌, లాలయ్య కుమారుడు నర్సింహులు ఇద్దరూ ఒకే రోజు జన్మించడం ఆ ఇంట్లో అంతులేని ఆనందాన్ని నింపింది. ఒకే రోజు 2013 మే 22న జన్మించిన ఈ ఇద్దరు పిల్లలు కొంగోడ్‌ పాఠశాలలో నాలుగోతరగతి చదువుతున్నారు.

ఈ ఇద్దరు చిన్నారులు ఒకే రోజు పుట్టి, ఒకే రోజు మరణించిన ఘటన స్థానికులను విషాదంలో ముంచింది. ఇద్దరి పుట్టుక ఎవరో నిర్ణయించినట్టుగా ఒకే రోజు జరగడం, వీరిద్దరినీ మృత్యువు కూడా ఒకే రోజు కబళించడం ఒక విషాదం అయితే, ఆ పాఠశాలలో కనీస సౌకర్యాల లోపం స్థానికుల కడుపుమండేలా చేస్తోంది. పాఠశాలలో సరైన టాయ్‌లెట్‌ సౌకర్యం లేకపోవడం వల్లనే ఈ దారుణం జరగడం సర్వత్రా కలకలం రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి