AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాలా సీక్రెట్ మ్యాటర్‌… ఎవరికి చెప్పొద్దంటూ రూ.18.50 లక్షల టోకరా!

కొంపముంచిన ఒకే ఒక్క ఫోన్ కాల్.. ఖాతా నుంచి విడతలవారీగా లక్షల రూపాయలు మాయం చేసిన ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. తాను మోసం పోయానని తెలుసుకున్న ఆ వ్యక్తి చివరికి పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

చాలా సీక్రెట్ మ్యాటర్‌... ఎవరికి చెప్పొద్దంటూ రూ.18.50 లక్షల టోకరా!
Cyber Crime
Boorugu Shiva Kumar
| Edited By: SN Pasha|

Updated on: Jul 12, 2025 | 4:21 PM

Share

మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన కల్వ కన్నయ్య వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత నెల 19వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి తాను పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి మాట్లాడుతున్నాను అని కనకయ్య కు కాల్ చేశాడు. మీ ఆధార్ కార్డ్ మిస్ యూస్ అయిందని, మీ ఫోన్ నెంబర్ ట్రాక్ చేస్తున్నారని చెప్పారు. మీ ఫోన్ నెంబర్ కొత్తది తీసుకొని ఏటీఎం ద్వారా ఎవరో అమౌంట్ డ్రా చేశారని నమ్మించారు. మీ పేరు మీద కేసు బుక్ అయింది. బెంగళూరులోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామని బెదిరించారు. మేం చెప్పినట్లు చేస్తే మీరు ఈ కేసుల నుంచి బయటపడతారని నమ్మించారు.

అంతేకాకుండా ఇది నేషనల్ సీక్రెట్ మీరు ఎవరికైనా చెప్పినట్లయితే ఈ కేసు నుంచి బయటకురాలేరని కూడా నమ్మబలికారు. అలాగే మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది, మీరు జైల్లో ఉండాల్సి వస్తుందని భయాందోళకు గురి చేశారు. తాము చెప్పినట్లు విని ఎవరికి చెప్పవద్దని ఒప్పించారు. ఆ తర్వాత కాసేపటికి వీడియో కాల్ చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు చూపించారు. ఇక సైబర్ నేరగాళ్ళ మాటలు, వీడియో కాల్ కు కన్నయ్య మోసపోయాడు. వాళ్ళు చెప్పే అంశాలన్నీ నిజమే అని నమ్మాడు. ఇంతలోనే సైబర్ నేరగాళ్ళు ఆధార్ కార్డును రెగ్యులర్ చేసుకోవాలని బలవంత పెట్టారు. దీంతో వారిని గుడ్డిగా నమ్మి ఏకంగా రూ.18 లక్షల 50 వేల రూపాయలను సమర్పించుకున్నాడు కన్నయ్య.

మొదట మహబూబ్ నగర్ లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెళ్ళి తన అకౌంట్ ద్వారా రూ.6లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబర్ కు RTGS ద్వారా పంపాడు కన్నయ్య. అదేవిధంగా రెండవసారి మరో రూ.10 లక్షలు పంపాడు. ఆ తర్వాత మరోసారి మొత్తం అమౌంట్ వెనక్కి పంపిస్తాం మరో రూ.2.50లక్షల రూపాయలు పంపాలని కన్నయ్య ను నమ్మించారు. ఈ సారి తన భార్య అకౌంట్ నుంచి మరో 2 లక్షల 50 వేల రూపాయలు పంపాడు. 20 రోజులు గడిచిన సైబర్ నేరగాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. విషయం సమీప బంధువులకు చెప్పడంతో వెంటనే చిన్నచింతకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అపరిచితుల వ్యక్తుల నుండి ఫోన్ కాల్ వస్తే అకౌంట్ కు సంబంధించిన వివరాలు చెప్పవద్దని చిన్నచింతకుంట ఎస్సై రామ్ లాల్ నాయక్ ప్రజలకు సూచించారు. అనేక రకాలుగా అవగాహన కల్పిస్తున్న కొంతమంది ఇంకా మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి