Public Wi-Fi: పబ్లిక్ వైఫై వాడుతున్నారా..? మీ బ్యాంక్ డీటైల్స్ లీక్.. ఫోన్‌లో ఈ ఒక్క పనిచేస్తే మీరు సేఫ్
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇంటర్నెట్ అనేది అందరికీ అవసరమే. ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు. అందుకే ఫోన్‌లో ఎప్పుడూ ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు డేటా లేనప్పుడు ఫోన్‌కు పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసుకుటూ ఉంటారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఇటీవల ప్రభుత్వాలన్నీ సిటీలలో ఫ్రీ పబ్లిక్ వైఫైను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, బస్టాఫ్ట్, పార్క్‌లు, లైబ్రరీలు, పర్యాటక ప్రదేశాలు లాంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని అమర్చుతున్నారు. మొబైల్ ఫోన్‌లో డేటా లేని సమయంలో చాలామంది పబ్లిక్ వైఫైను వాడుతూ ఉంటారు. పబ్లిక్ వైఫై వాడటం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఎవరైనా ఈజీగా యాక్సెస్ చేసే సదుపాయం ఉండటం వల్ల సైబర్ నేరగాళ్లు దీనిని తమ మోసాలకు ఎంచుకుంటున్నారు. పబ్లిక్ వైఫైను హ్యాక్ చేసి యూజర్లు పర్సనల్ డేటా, బ్యాంక్ వివరాలు లాంటివి తెలుసుకుంటున్నారు. దీంతో పబ్లిక్ వైఫై వాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
బ్యాంకింగ్ పనుల కోసం
బ్యాంకింగ్ కార్యకలాపాల గురించి పబ్లిక్ వైఫై వాడేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. పబ్లిక్ వైఫైను సైబర్ క్రిమినల్స్ త్వరగా హ్యాక్ చేసి మీ వివరాలను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వైఫై సర్వర్లను కూడా హ్యాక్ చేసి యూజర్ల డేటాను సేకరించే ప్రమాదముంది. దీని వల్ల బ్యాంకింగ్ పనుల కోసం పబ్లిక్ వైఫైను వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అలాగే బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలను కూడా ఓపెన్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు వాటిని ఓపెన్ చేయాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు చెబుతున్నారు. పబ్లిక్ వై-ఫై ఉపయోగించి ఆన్‌లైన్ షాపింగ్ కూడా చేయవద్దని అంటున్నారు. ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌లో షాపింగ్ చేసేటప్పుడు వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు ఇవ్వల్సి ఉంటుందని, ఇది ప్రమాదకరమని అధికారులు తెలిపారు.
ఆఫ్ చేసుకోండి
మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఫోన్‌లో ఆటోమేటిక్ వైఫై కనెక్టివిటీని ఆఫ్ చేసుకోండి. తెలియని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఆఫ్ చేసుకోవడం మంచిదని పోలీసులు చెబుతున్నారు. ఇక పబ్లిక్ ప్రదేశాల్లో బ్లూటూత్ కనెక్టివిటీని కూడా ఆఫ్ చేసుకోవాలని చెబుతున్నారు. బ్లూటూత్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఫోన్‌ను హ్యాక్ చేసే అవకాశం ఉందని, దీని వల్ల బ్లూటూత్ ఆఫ్ చేసుకోవడం ఉత్తమమని అంటున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో వైఫై, బ్లూటూత్ జాగ్రత్తగా ఉపయోగించాలని, డబ్బులు ఏమైనా విత్ డ్రా అయితే తమను వెంటనే సంప్రదించాలని పోలీసులు చెబుతున్నారు.




