వార్డ్‌రోబ్ పేరుతో AI ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్! ఫొటోలు ఎక్కువ దిగేవారికి పండగే!
గూగుల్ ఫోటోస్ ‘వార్డ్‌రోబ్’ ఫీచర్‌తో డిజిటల్ అల్మరాకు స్వాగతం. AI సాయంతో మీ ఫోటోల్లోని దుస్తులు, యాక్సెసరీలను గుర్తించి, వర్గీకరిస్తుంది. ఇది దుస్తులను సులభంగా కనుగొనడం లో, అవుట్‌ఫిట్‌లు ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది. వర్చువల్ ట్రై-ఆన్ సౌకర్యంతో కొత్త కాంబినేషన్‌లు ప్రయత్నించవచ్చు.

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన ఫోటో స్టోరేజ్ యాప్ గూగుల్ ఫోటోస్ కోసం భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది. ‘వార్డ్‌రోబ్’ అనే ఈ కొత్త ఫీచర్, యూజర్ల ఫోటో లైబ్రరీని డిజిటల్ అల్మరాగా మార్చే లక్ష్యంతో రూపొందించబడింది. కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో మీ ఫోటోల్లో ఉన్న దుస్తులు, యాక్సెసరీలను గుర్తించి, వాటిని ఆటోమేటిక్‌గా వర్గీకరించడం ఈ టూల్ ప్రత్యేకత. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే, యాప్‌లో ఉన్న ఫోటోలను స్కాన్ చేసి, షర్టులు, జీన్స్, జాకెట్లు, బూట్లు, బ్యాగులు వంటి వస్తువులను గుర్తించి వేర్వేరు కేటగిరీల్లో అమర్చుతుంది. దీంతో వినియోగదారులు తమ దగ్గర ఉన్న దుస్తులను సులభంగా గుర్తించవచ్చు. చాలా మంది తమ అల్మరాల్లో ఉన్న పాత దుస్తులను మర్చిపోతుంటారు. ఈ కొత్త ఫీచర్ ఆ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది.
వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను కేటగిరీ వారీగా వెతకవచ్చు. ఉదాహరణకు స్నీకర్లు లేదా సీజనల్ దుస్తులు వంటి వాటిని ప్రత్యేకంగా ఫిల్టర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇష్టమైన లుక్స్‌ను ఫేవరెట్‌గా సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఈ ఫీచర్‌లో డిజిటల్ డ్రాగ్-అండ్-డ్రాప్ సిస్టమ్ కూడా ఉంది. దీని ద్వారా వినియోగదారులు వివిధ దుస్తులను కలిపి కొత్త అవుట్‌ఫిట్‌లను రూపొందించవచ్చు. పని, పెళ్లిళ్లు, ప్రయాణాలు లేదా ఇతర ప్రత్యేక సందర్భాల కోసం ముందుగానే డ్రెస్ ప్లానింగ్ చేయడం సులభమవుతుంది. ఈ అవుట్‌ఫిట్‌లను స్నేహితులతో పంచుకుని వారి అభిప్రాయం కూడా తెలుసుకోవచ్చు.
మరొక ఆకర్షణీయమైన అంశం వర్చువల్ ట్రై-ఆన్. వినియోగదారులు బట్టలను నిజంగా ధరించకుండానే, వాటి కాంబినేషన్‌ను ముందుగానే చూసుకోవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, సరైన ఎంపిక చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ ‘వార్డ్‌రోబ్’ ఫీచర్ 2026 వేసవిలో ప్రారంభమవుతుందని గూగుల్ వెల్లడించింది. మొదట ఆండ్రాయిడ్ పరికరాల్లో, తరువాత iOS లో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలు స్మార్ట్ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకున్న గూగుల్ ఫొటోస్, ఈ కొత్త టూల్‌తో రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేసే ప్రయత్నం చేస్తోంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
