AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సద్గురు కావేరీ కాలింగ్ సదస్సుకు 6 వేల మంది రైతులు.. చెట్ల ఆధారిత సాగుపై శాస్త్రవేత్తల కీలక సూచనలు

Tree-Based Agriculture: సద్గురు కావేరీ కాలింగ్ ఉద్యమం ఆధ్వర్యంలో తిరుచిరాపల్లిలో నిర్వహించిన ఫుడ్ ఫారెస్ట్ సదస్సుకు 6 వేల మందికి పైగా రైతులు హాజరయ్యారు. చెట్ల ఆధారిత వ్యవసాయం రైతుల ఆదాయాన్ని పెంచడంలో, నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకమని నిపుణులు పేర్కొన్నారు.

సద్గురు కావేరీ కాలింగ్ సదస్సుకు 6 వేల మంది రైతులు.. చెట్ల ఆధారిత సాగుపై శాస్త్రవేత్తల కీలక సూచనలు
Sadhguru Cauvery Calling Conference
Srilakshmi C
|

Updated on: Jun 15, 2026 | 7:52 AM

Share

తిరుచిరాపల్లి, జూన్‌ 15: ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ప్రారంభించిన ‘సేవ్ సాయిల్ – కావేరీ కాలింగ్’ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన ‘ఫుడ్ ఫారెస్ట్ కల్టివేషన్ అండ్ సౌత్ ఇండియన్ ఫ్రూట్స్ ఫెస్టివల్’ మహాసదస్సుకు 6 వేల మందికి పైగా రైతులు, ప్రజలు హాజరయ్యారు. తమిళనాడులోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, తిరుచిరాపల్లి క్యాంపస్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆహార అడవుల (ఫుడ్ ఫారెస్ట్స్) సాగు, చెట్ల ఆధారిత వ్యవసాయం రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు, రైతులు పేర్కొన్నారు. కావేరీ కాలింగ్ సమన్వయకర్త తమిళ్‌మారన్ మాట్లాడుతూ.. ఉద్యమం ద్వారా రైతుల్లో చెట్ల ఆధారిత వ్యవసాయంపై అవగాహన గణనీయంగా పెరిగిందన్నారు. దీంతో నర్సరీల్లో మొక్కల డిమాండ్ భారీగా పెరిగిందని తెలిపారు. ఈ విధానం నేల సారాన్ని, నీటి నిల్వ సామర్థ్యాన్ని, నదుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతుందని చెప్పారు.

ఇటీవల హోసూరులో జరిగిన వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ‘అగ్రోఫారెస్ట్రీ’ పేరును ‘ట్రీ-బేస్డ్ అగ్రికల్చర్’గా మార్చాలని కోరగా.. అందుకు ఆయన అంగీకరించి అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు తమిళ్‌మారన్ వెల్లడించారు. అధిక రసాయన ఎరువుల వినియోగం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతిని దిగుబడులు తగ్గిపోయాయని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా డైరెక్టర్ డాక్టర్ సెల్వరాజన్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో చెట్ల ఆధారిత వ్యవసాయం అవసరం ఉందన్నారు. తమ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన కావేరీ అరటి రకం సుక్రోజ్ లేకుండా ఉండటం వల్ల మధుమేహ రోగులు కూడా తీసుకోవచ్చని తెలిపారు. అరటి పండ్లతో 40కిపైగా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు.

కొబ్బరి తోటల్లో ఫుడ్ ఫారెస్ట్స్ ఏర్పాటు గురించి నిపుణుడు బాల మోహన్ మాట్లాడుతూ.. ఒక ఎకరా కొబ్బరి తోటలో ఖాళీగా ఉండే స్థలాన్ని బహుళ పంటల సాగుకు ఉపయోగించవచ్చన్నారు. దీని ద్వారా సూర్యరశ్మి సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు నేల తేమ, సేంద్రియ కార్బన్ శాతం పెరుగుతుందని చెప్పారు. ఫలితంగా రైతులకు అదనపు, స్థిరమైన ఆదాయం లభిస్తుందని వివరించారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన రైతు వల్లువన్ మాట్లాడుతూ.. మొదట్లో తాను కేవలం కొబ్బరి సాగు మాత్రమే చేసేవాడినని, చెట్ల ఆధారిత వ్యవసాయంపై నమ్మకం లేదని చెప్పారు. అయితే సద్గురు, ఇషా ఫౌండేషన్ మార్గదర్శకత్వంలో నేల సేంద్రియ పదార్థాల ప్రాముఖ్యత తెలుసుకుని ఇప్పుడు తన కొబ్బరి తోటలో మామిడి, పనస, అరటి, సపోటా, జాజికాయ, మిరియాలు సహా 14 రకాల పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో ఐసీఏఆర్‌ సహా నాలుగు వ్యవసాయ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు మామిడి, పనస, అవకాడో సాగు, మార్కెట్ అవకాశాలు, నిర్వహణ పద్ధతులపై సాంకేతిక మార్గదర్శకత్వం అందించారు. నిఫ్టెమ్ (NIFTEM) తంజావూరు శాస్త్రవేత్తలు పండ్ల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ అవకాశాలపై వివరించారు. అలాగే ఐదు రాష్ట్రాలకు చెందిన రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన రైతు రమణారెడ్డి మైదాన ప్రాంతాల్లో యాపిల్ సాగులో సాధించిన విజయాలను వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్త శరవణన్ లాభదాయకమైన బొప్పాయి సాగు పద్ధతులను వివరించగా, మాజీ వ్యవసాయ ఉప సంచాలకుడు హరిదాస్ 100కిపైగా పనస రకాలను ప్రదర్శించి వాటి ప్రత్యేకతలను వివరించారు. ఈ కార్యక్రమంలో ‘మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన పద్మశ్రీ కలీం ఉల్లా ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ఒకే చెట్టుపై 300 రకాల మామిడి పండ్లను పండించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. మామిడి సాగులో తన అనుభవాలను రైతులతో పంచుకున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో 60కిపైగా అరటి రకాలు, 100కుపైగా మామిడి, పనస రకాలను ప్రదర్శించారు. మామిడి, పనస, అవకాడో, యాపిల్ తదితర పండ్ల మొక్కలను రాయితీ ధరలకు అందుబాటులో ఉంచగా రైతులు, సందర్శకులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు.

Follow Us