Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకాశంలో మహా అద్భుతం.. ఒకే కక్ష్యలోకి ఐదు గ్రహాలు.. ఇలా చూసేయ్యండి..

అద్భుతాలకు కొదవలేని ఆకాశంలో మరో మహా అద్భుతం. ఎప్పుడో కాదు. ఈరోజే. సూర్యాస్తమయం తర్వాత కనువిందు చేయబోతోంది..

ఆకాశంలో మహా అద్భుతం.. ఒకే కక్ష్యలోకి ఐదు గ్రహాలు.. ఇలా చూసేయ్యండి..
Five Planets
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 28, 2023 | 6:00 PM

అద్భుతాలకు కొదవలేని ఆకాశంలో మరో మహా అద్భుతం. ఎప్పుడో కాదు. ఈరోజే. సూర్యాస్తమయం తర్వాత కనువిందు చేయబోతోంది మన నీలీనీలీ ఆకాశం. చీకటిపడితే కనిపించే ముద్దులొలికే చందమామకు మరో నాలుగు గ్రహాలు తోడవుతున్నాయి. ఒకే కక్ష్యలో కనువిందు చేయబోతున్నాయి. మార్చి 28. అంటే ఈరోజే. చీకటిపడగానే నాలుగ్గోడల మధ్య ఉండకండి. అలా బయటికి రండి. ఆకాశంవైపు చూడండి. రోజూ చూసేదే కదా అనుకోకండి. ఈరోజు నింగిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. చందమామకు తోడుగా మరో నాలుగు గ్రహాలు కనువిందు చేయబోతున్నాయి. చంద్రుడితోపాటు గురు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, యురేనస్ గ్రహాలు ఒకే కక్ష్యలో ఈరోజు మనకు కనిపిస్తాయి. ఈ గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఒకానొక సమయంలో ఆర్క్‌లాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఆ క్షణాల్ని ఎక్స్‌రే కళ్లతో వీక్షించాలన్నా, జ్ఞాపకాల లాకర్‌లో భద్రంగా దాచుకోవాలన్నా ఆకాశం వైపు చూడాల్సిందే. ఆ అందమైన దృశ్యాన్ని ఆస్వాదించాల్సిందే.

సూర్యాస్తమయం తర్వాత పడమర వైపు కనిపించబోతోందీ అద్భుత దృశ్యం. 50 డిగ్రీల పరిధిలోనే ఈ ఐదు గ్రహాలూ మనకు కనిపిస్తాయి. ఇందులో గురు, శుక్ర, అంగారక గ్రహాలను నేరుగా కళ్లతో చూడవచ్చు. బుధగ్రహం, యురేనస్‌లని మాత్రం బైనాక్యులర్‌తో చూస్తేనే మంచిదంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. శుక్రగ్రహం సమీపంలోనే యురేనస్ కనిపించనుంది. అయితే అది ప్రకాశవంతంగా లేకపోవటంతో స్పష్టంగా కనిపించే అవకాశం లేదు. కానీ అంగారక గ్రహం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

ఆకాశంలో కనిపించే ఐదు గ్రహాల సమూహంలో శుక్ర గ్రహం దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. బుధ గ్రహానికి ఎడమ వైపున గురు, శుక్ర గ్రహాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఫిబ్రవరి మాసమంతా గురు, శుక్ర గ్రహాలు చంద్రునితో పాటు కనిపించాయి. ఈ మూడు గ్రహాలు సమీపంలోకి వచ్చినట్లు దృశ్యం ఆవిష్కృతమైంది. సౌర వ్యవస్థలో గ్రహాల మధ్య గ్రహాల మధ్య అప్పుడప్పుడు సంయోగం జరుగుతుంది. గ్రహాలు సూర్యుని చుట్టూ వేర్వేరు కక్ష్యల్లో తిరుగుతుంటాయి. ఒకానొక సమయంలో ఒకదానితో ఒకటి సరళరేఖను ఏర్పరుస్తాయి. మనం భూమిపై నుంచి చూసినప్పుడు ఈ దృశ్యంలో ఆయా గ్రహాలు అతి దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తుంది కానీ.. వాటి మధ్య కొన్ని కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. స్పష్టమైన ఆకాశం, చెట్లు, భవనాలు ఏవీ అడ్డుగా లేకపోతే ఈ ఖగోళ అద్భుతాన్ని ఎక్కడి నుంచైనా వీక్షించవచ్చు. గురు, అంగారక గ్రహాలను మాత్రం అనువైన ప్రదేశంనుంచే చూసే వీలుంటుంది. ప్రకాశవంతంగా ఉండే శుక్ర గ్రహ వీక్షణం అందరికీ సులభమే.

అద్భుత దృశ్యాన్ని ఎప్పుడు చూడవచ్చు…

మార్చి 28వ తేదీ సాయంత్రం 6.36 గంటల నుంచి 7.15 గంటల వరకు ఈ ఐదు గ్రహాలు ఒకే క్షక్ష్యపైకి రావడాన్ని మనం చూడవచ్చు. మెర్క్యూరి, ప్లూటో గ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించి.. 30 నిమిషాల్లో అదృశ్యమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే సుమారు 7.06 గంటలకు ఈ రెండు గ్రహాలు మాయమవుతాయి.