Black Hole: భూమి వైపు దూసుకొస్తున్న మాసివ్ బ్లాక్ హోల్.. భూమికి ముప్పు పొంచి ఉందా? వివరాలు తెలుసుకోండి..
గెలాక్సీ మధ్యలో ఉన్న ఓ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ తన దిశను మార్చుకుందని పేర్కొన్నారు. అంతేకాక అది భూమి వైపు ప్రయాణిస్తుందని వివరించారు. ఆ గెలాక్సీ మనకు 657 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.
విశ్వం ఓ మహా అద్భుతం. అంతరిక్షంలో లెక్కకు మించిన, మానవ ఊహకు మించిన సంగతులున్నాయి. అక్కడి రహస్యాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఆందోళన కర విషయాన్ని ఖగోళ పరిశోధకులు కనుగొన్నారు. గెలాక్సీ మధ్యలో ఉన్న ఓ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ తన దిశను మార్చుకుందని పేర్కొన్నారు. అంతేకాక అది భూమి వైపు ప్రయాణిస్తుందని వివరించారు. ఆ గెలాక్సీ మనకు 657 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. దీని పేరు PBC J2333.9-2343 గా పేర్కొన్నారు. దీనివల్ల భూమికి కలిగే నష్టం ఏమిటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది? తెలుసుకుందాం రండి..
ఖగోళ పరిశోధకుల బృందంలో ఒకరైన రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ శాస్త్రవేత్త డాక్టర్ లోరెనా హెర్నాండెజ్ గార్సియా ఇలా అన్నారు: ‘మేము ఈ గెలాక్సీని అధ్యయనం చేయడం ప్రారంభించాము. ఎందుకంటే ఇది అకస్మాత్తుగా వింతగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఇక్కడ ఉన్న బ్లాక్ హోల్ ముఖం అవతలి వైపుకు తిరిగిందని మేము గమనించాము. ఇప్పుడు దీనిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.’
అత్యంత శక్తి కలిగిన రేడియో గెలాక్సీ..
పరిశోధకులు మాసివ్ బ్లాక్ హోల్ గురించి మాట్లాడుతూ.. నిజానికి ఇది ఒక రేడియో గెలాక్సీ అని చెప్పారు. అంతరిక్షంలో వచ్చిన మార్పుతో అది 90 డిగ్రీలు తన గమనాన్ని మార్చుకుని ప్రస్తుతం భూమికి అభిముఖంగా ఉచ్చినట్లు వివరించారు. అంటే గెలాక్సీ ఇప్పుడు ‘బ్లేజర్’గా మారిందన్నమాట. ఇటువంటి బ్లేజర్‌లు చాలా ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. విశ్వంలో ఇటువంటి సంఘటనలు అరుదైనవి మాత్రమే సంభవిస్తాయని.. ఇవి అత్యంత శక్తివంతమైనవిగా కూడా ఉంటాయన్నారు. దీని నుంచి వచ్చే రేడియేషన్ చాలా ప్రభావవంతంగా ఉంటుందంటున్నారు. అయితే ఈ బ్లాక్ హోల్ దిశ మన భూమిని ఎలా ప్రభావితం చేస్తుందో ఇంకా స్పష్టంగా తెలియలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ దిశ ఎలా మారింది..
అసలు ఈ బ్లాక్ హోల్ దిశ ఎలా మారిందన్న అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకూ వారు ఒక అంచనాకు రాలేకపోయారు. అయితే కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం ఈ PBC J2333.9-2343 బ్లాక్ హోల్ మరొక గెలాక్సీని ఢీకొట్టిందని, ఫలితంగా దిశ మారి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేేయండి..