Cyber Crime: సైబర్ మోసగాళ్ల ఆట కట్టించడానికి కేంద్రం సంచలన నిర్ణయం..!
Cyber Crime: మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. I4C ఎప్పుడూ సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో ముందుంటుంది. 1930 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ఎంతో మంది బాధితులకు సహాయం చేసిందని జియోట్టస్ క్రిప్టో ప్లాట్‌ఫామ్..

ఇక పై సైబర్ నేరాల ద్వారా సంపాదించిన నల్లధనాన్ని తెల్లగా మార్చే వారి భరతం పట్టేందుకు ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (I4C)కి మరింత పవర్ వచ్చింది.ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లు, బ్యాంకింగ్ మోసాలు, క్రిప్టోకరెన్సీ మోసాలు ఎంతలా పెరిగిపోయాయో ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. వీటన్నిటి వెనుక ఉన్న డబ్బు మాయాజాలాన్ని ఛేదించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించింది. ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ-లాండరింగ్ యాక్ట్’ (PMLA) కింద I4Cని చేర్చింది. అంటే ఇకపై I4C ఇతర దర్యాప్తు సంస్థలతో సమాచారం పంచుకోగలదు. అంతేకాదు సైబర్ నేరస్తుల గుండెల్లో దడ పుట్టించగలదు.
దీని ద్వారా హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థకు ఇప్పుడు కీలకమైన డేటాను యాక్సెస్ చేసే వీలుంటుంది. దీనివల్ల సైబర్ నేరగాళ్లు దాచిన డబ్బు ఎటు పోతుందో కనిపెట్టడం, వారిని పట్టించడం కూడా చాలా సులువు అవుతుంది.
ఇది నిజంగా ఒక గొప్ప ముందడుగు అనే చెప్పాలి. మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. I4C ఎప్పుడూ సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో ముందుంటుంది. 1930 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ఎంతో మంది బాధితులకు సహాయం చేసిందని జియోట్టస్ క్రిప్టో ప్లాట్‌ఫామ్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు.
I4C క్రిప్టో ఇండస్ట్రీతో కలిసి పనిచేస్తోంది. అంతేకాదు బాధ్యతాయుతమైన ఎక్స్ఛేంజ్‌లతో కలిసి దర్యాప్తు సామర్థ్యాలను పెంచుతోంది. డిజిటల్ ఆస్తుల విషయంలో సురక్షితమైన లావాదేవీల కోసం మంచి పద్ధతులను ప్రోత్సహిస్తోంది. దీనివల్ల నమ్మకం ఏర్పడి, మోసాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడానికి వీలైందని సుబ్బురాజ్ తెలిపారు. వీరి సంస్థ డిజిటల్ ఆస్తులకు సంబంధించిన మోసాలను దర్యాప్తు చేయడంలో I4Cకి సహాయం చేస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సైబర్ నేరాలను అరికట్టాలనే పట్టుదలకు నిదర్శనం. ఇకపై దర్యాప్తు సంస్థలు మరింత వేగంగా, సమర్థవంతంగా స్పందించగలవు.
PMLA కింద I4Cకి మరిన్ని అధికారాలు ఇవ్వడం వల్ల క్రిప్టో ఆస్తులకు సంబంధించిన ఆర్థిక నేరాలను గుర్తించడం, నిరోధించడం, వాటి పై వేంటనే స్పందించడం మరింత సులువు అవుతుందని నిపుణులు అంటున్నారు. ఇది టెక్నాలజీని ప్రోత్సహిస్తూనే బాధ్యతగా ఉండాలనే ఒక మంచి సంకేతం ఇస్తోంది అని అన్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల ఆటలు ఇక సాగవు. I4C ఇప్పుడు మరింత పవర్‌ఫుల్‌గా, వేగంగా నేరస్థుల పట్టిస్తుంది.
మరిన్నిటెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




