Cancer Detecter: బ్రెస్ట్ క్యాన్సర్‌కు ‘బ్రా’తో చెక్.. సంచలన ఆవిష్కరణ చేసిన శాస్త్రవేత్తలు..!
Cancer Detector: మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే స్మార్ట్ బ్రాను శాస్త్రవేత్తలు రూపొందించారు. నైజీరియా శాస్త్రవేత్తలు ఈ స్మార్ట్ బ్రాను..
Cancer Detector: మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే స్మార్ట్ బ్రాను శాస్త్రవేత్తలు రూపొందించారు. నైజీరియా శాస్త్రవేత్తలు ఈ స్మార్ట్ బ్రాను తయారు చేశారు. దీని సహాయంతో బ్రెస్ట్ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆఫ్రికాలోని మహిళలు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సి వస్తున్నందున రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఈ ప్రోటోటైప్ సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్ని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులువవడంతో పాటు వ్యాధి ముదిరిపోకుండా ఉంటుంది. ఆ విషయంలో ప్రజలకు అద్భుతంగా సహాయపడుతుందన్నారు.
రొమ్ము క్యాన్సర్‌ను ఎలా గుర్తిస్తుంది.. ఈ స్మార్ట్ బ్రాను నైజీరియన్ సంస్థ నెక్స్ట్‌వేర్ టెక్నాలజీ తయారు చేసింది. ఇందులో చిన్న అల్ట్రాసౌండ్ సెన్సార్లు ఉన్నాయి. ఈ సెన్సార్లు బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. ఈ సెన్సార్లు రొమ్మును స్కాన్ చేస్తాయి. స్కానింగ్ సమయంలో కణితి ఉంటే కనిపెట్టేస్తాయి. ఈ పరికరం సహాయంతో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతిని మరింత మెరుగ్గా చేయవచ్చని దీన్ని రూపొందించిన పరిశోధన బృందం చెబుతోంది.
ఈ బ్రా యాప్‌కి లింక్ చేయబడుతుంది. రొమ్ములో ఉన్న కణితి క్యాన్సర్ కారకమా? లేదా? అనేది పరీక్షల ద్వారా తెలుస్తుంది. టెస్ట్‌ల తర్వాత, ఫలితాలు వినియోగదారు మొబైల్ యాప్‌కు పంపబడతాయి. అలా క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించి, చికిత్స అందించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, రొమ్ము క్యాన్సర్ కణితులను గుర్తించడానికి మహిళలు ఈ బ్రాను 30 నిమిషాల పాటు ధరించాలని పరిశోధకులు చెబుతున్నారు. దీని ఫలితాలను మొబైల్‌లో చూసి.. ఆ తరువాత వైద్యులను సంప్రదించడం ద్వారా క్లారిటీ పొందవచ్చునని చెబుతున్నారు.
ఎందుకోసం ఈ బ్రా.. దీన్ని డెవలప్ చేసిన రోబోటిక్స్ ఇంజనీర్ కెమిసోలా బొలారినోవా మాట్లాడుతూ.. ‘‘2017లో బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా మా అమ్మ చనిపోయింది. రొమ్ము క్యాన్సర్‌ని ఆలస్యంగా గుర్తించడమే ఆమె మరణానికి కారణం. ఆమె అడ్మిట్ అయిన హాస్పిటల్‌లోని వార్డులో అమ్మాయిల నుండి వృద్ధుల వరకు అందరూ బ్రెస్ట్ క్యాన్సర్ బాధతో బాధపడుతున్నారు. ఈ వ్యాధితో పోరాడేందుకు నా వంతు పాత్ర పోషించాలని అప్పుడే నిశ్చయించుకున్నాను. ప్రస్తుతం, మహిళలు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం వైద్యుడి వద్దకు వెళ్లవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు స్మార్ట్ బ్రాల సహాయంతో ఇంట్లో కూడా సురక్షితమైన, సౌకర్యవంతమైన పరీక్ష అందుబాటులో ఉంటుంది.’’ అని చెప్పుకొచ్చారు.
పరీక్ష ఫలితాలు ఖచ్చితమైనవేనా.. కెమిసోలా ప్రకారం.. ఈ స్మార్ట్ బ్రా సహాయంతో ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా మరణాల సంఖ్యను తగ్గించవచ్చు. స్మార్ట్ బ్రా 70 శాతం వరకు కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని విచారణలో వెల్లడైందన్నారు. ఫలితాలు 95 నుండి 97 శాతం వరకు ఖచ్చితమైనవిగా ఉండేలా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది జూలై నాటికి ఈ బ్రా మార్కెట్‌లో అందుబాటులోకి రావచ్చునని తెలిపారు.
Also read:
Irani Chai: టీ ప్రియులకు చేదువార్త.. ఇరానీ చాయ్ ధర పెంపు.. ఒక కప్పుకు ఎంత పెంచారంటే