మీ ఇంట్లో ఏసీ ఉందా..? కరెంట్ బిల్లు తక్కువగా రావాలంటే ఇలా చేయండి.. బెస్ట్ ట్రిక్స్ ఇవే..
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎయిర్ కండిషనర్ (ఏసీ) ఇంట్లో తప్పనిసరిగా మారింది. అయితే, ఏసీ వాడకంపై కొన్ని భయాలు, అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా ఏసీ పేలుళ్ల ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏసీలను సురక్షితంగా, సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి, విద్యుత్ ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి అనే విషయాలను తెలుసుకోండి..

ఎండలు దంచికొడుతున్నాయి.. దీంతో చాలా మంది చల్లగా ఉండేందుకు ఎయిర్ కండిషనర్‌లను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత వేసవికాలంలో ఎయిర్ కండిషనర్ (ఏసీ) గాలి లేకుండా రోజు గడవడమంటే ఊహించలేని విషయం. అయితే, ఏసీ వాడకంపై ప్రజల్లో కొన్ని భయాలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఏసీ పేలుళ్ల ఘటనలు ఇంట్లో బాంబులు పెట్టుకుంటున్నామా అనే ఆందోళనను పెంచాయి. ఈ నేపథ్యంలో, ఏసీలను సురక్షితంగా, సమర్థవంతంగా ఎలా వినియోగించాలి, విద్యుత్ ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
ఏసీ పేలుళ్ల వెనుక కారణాలు, నివారణ చర్యలు:
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాత నాన్-ఇన్వర్టర్ ఏసీలలో వాడే R-22 రెఫ్రిజిరెంట్ మండే గుణం లేనిది. కానీ, ఇప్పుడు వస్తున్న ఇన్వర్టర్ ఏసీలలో ఓజోన్ పొరకు హానికరం కాని R-32 రెఫ్రిజిరెంట్ ఉపయోగిస్తున్నారు.. దీనికి మండే గుణం ఉంది. అయినప్పటికీ, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పేలుళ్ల ప్రమాదాన్ని నివారించవచ్చు.
ఎర్తింగ్, స్టెబిలైజర్: ఇంట్లో ప్రతి ఎలక్ట్రికల్ పరికరానికి సరైన ఎర్తింగ్ ఉండటం తప్పనిసరి. ఏసీకి అదనపు రక్షణ కోసం స్టెబిలైజర్ ఉపయోగించడం హై వోల్టేజ్, లైటింగ్ ఎఫెక్ట్‌ల నుండి కాపాడుతుంది.
అవుట్‌డోర్ యూనిట్ ప్లేస్‌మెంట్: ఏసీ అవుట్‌డోర్ యూనిట్‌ను గరిష్ట వెంటిలేషన్ ఉండే ప్రదేశంలో అమర్చాలి. ఇది క్లోజ్డ్ ఏరియాలో ఉండకూడదు. వెంటిలేషన్ లేకపోతే కంప్రెషర్‌పై ఒత్తిడి పెరిగి ఏసీ ట్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది, అయితే ఇది పేలుళ్లకు నేరుగా కారణం కాదు.
గ్యాస్ ప్రెజర్ తనిఖీ: సర్వీసింగ్ సమయంలో R-32 లేదా R-410 రెఫ్రిజిరెంట్ గ్యాస్ ప్రెజర్ 130 నుండి 140 PSI మధ్య ఉందో లేదో తనిఖీ చేయించుకోవడం అత్యంత కీలకం. ఈ ప్రెజర్ పరిధిలో ఉంటే ఏసీ సురక్షితంగా ఉన్నట్టే. టెక్నీషియన్ వచ్చినప్పుడు ఈ వివరాలను అడిగి తెలుసుకోవడం మంచిది.
విద్యుత్ పొదుపు, సరైన వినియోగం:
ఏసీ వాడకంతో సంబంధం లేకుండా అధిక విద్యుత్ బిల్లులు రాకుండా ఉండాలంటే ఈ కింది పద్ధతులు పాటించాలి.
ఎంసీబీ ఆఫ్ చేయడం: ఏసీని రిమోట్‌తో ఆఫ్ చేసినప్పటికీ, అది స్టాండ్‌బై మోడ్‌లో ఉండి విద్యుత్‌ను వినియోగిస్తూ ఉంటుంది. కాబట్టి, ఏసీ వాడకం అయిపోయిన తర్వాత దాని ఎంసీబీని ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్ వృథాను పూర్తిగా నివారించవచ్చు. ఇది థండర్, లైటింగ్ ఎఫెక్ట్‌ల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది.
సముచిత ఉష్ణోగ్రత: బయటి ఉష్ణోగ్రత 45-50 డిగ్రీలు ఉన్నప్పుడు ఏసీని 16-18 డిగ్రీల వద్ద పెట్టడం సరికాదు. శరీరానికి అనుకూలమైన ఉష్ణోగ్రత 24 నుండి 28 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేయడం వల్ల చర్మ అలర్జీలు, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది కంప్రెషర్‌పై అనవసరమైన ఒత్తిడిని తగ్గించి, విద్యుత్ పొదుపునకు కూడా సహాయపడుతుంది.
నిరంతర ఆపరేషన్ (ఇన్వర్టర్ ఏసీలు): ఆధునిక ఇన్వర్టర్ ఏసీలు సెట్ చేసిన ఉష్ణోగ్రతను నిరంతరం మెయింటెయిన్ చేస్తాయి. కాబట్టి, రాత్రిపూట తరచుగా ఏసీని ఆఫ్ చేసి, మళ్లీ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది విద్యుత్ వినియోగాన్ని మరింత సమర్థవంతంగా చేస్తుంది.
ఫిల్టర్ శుభ్రత: ఏసీ ఆన్‌లో ఉండగా డోర్ తెరవడం, గదిలో దుమ్ము పేరుకుపోవడం వంటివి ఏసీ ఫిల్టర్‌లను బ్లాక్ చేస్తాయి. బ్లాక్ అయిన ఫిల్టర్‌లు కూలింగ్ సామర్థ్యాన్ని తగ్గించి, విద్యుత్ వినియోగాన్ని పెంచుతాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిల్టర్‌లను సులభంగా తీసి శుభ్రం చేసుకోవడం ద్వారా కూలింగ్ స్థిరంగా ఉండి, విద్యుత్ ఆదా అవుతుంది.
క్రమబద్ధమైన సర్వీసింగ్:
ఏసీ నిర్వహణలో సర్వీసింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.
సర్వీసింగ్ సమయం: ప్రతి తొమ్మిది నెలలకు ఒకసారి, ముఖ్యంగా వేసవికాలం ప్రారంభం కావడానికి ఒకటి లేదా రెండు నెలల ముందు ఏసీని సర్వీసింగ్ చేయించుకోవడం ఉత్తమం. ఇది ఏసీలోని సమస్యలను ముందుగానే గుర్తించి, పెద్ద మరమ్మతులను నివారిస్తుంది.
టెక్నీషియన్‌తో ప్రశ్నలు: సర్వీసింగ్ కోసం వచ్చిన టెక్నీషియన్‌ను ఏసీ హెల్త్ కండిషన్ గురించి, ముఖ్యంగా గ్యాస్ ప్రెజర్ గురించి అడిగి తెలుసుకోవాలి. కూలింగ్ సరిగా రాకపోవడం లేదా గది కూల్ అవ్వకపోవడం వంటి సమస్యలు తరచుగా గ్యాస్ తక్కువ అవ్వడం లేదా ఫిల్టర్‌లు బ్లాక్ అవ్వడం వల్ల జరుగుతాయి. గ్యాస్ తక్కువైతే, దానిని తిరిగి ఫిల్ చేయమని అడగాలి.
ఏసీని సమర్థవంతంగా, సురక్షితంగా ఉపయోగించడానికి ఈ సూచనలను పాటించడం ద్వారా విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడమే కాకుండా, ఏసీ పేలుళ్ల వంటి ప్రమాదాల బారి నుండి మన ప్రాణాలను రక్షించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి..
టిఫిన్ తినాల్సిన పనే లేదు.. జస్ట్ 5 నిమిషాల్లోనే సూపర్ ఫుడ్.. ఒక్క కప్పు తింటే చాలు..
