ఆ AIతో మనుషులకు ముప్పు తప్పదు! వణుకుపుట్టే విషయం చెప్పిన టైసన్
ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్ టైసన్ నియంత్రణ లేని AI సూపర్‌ఇంటెలిజెన్స్ మానవాళికి ముప్పని హెచ్చరించారు. మానవ మేధస్సును మించిన AI అభివృద్ధికి అంతర్జాతీయ ఒప్పందాలు, కఠిన నియంత్రణలు అవసరమని సూచించారు. AI మంచికి ఉపయోగపడినా, నియంత్రణ లేని దాని పురోగతి మాత్రం ప్రమాదకరమని ఆయన అభిప్రాయం.

AI వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సూపర్‌ఇంటెలిజెన్స్ దిశగా సాగుతున్న ప్రగతిపై ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్ టైసన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2026లో జరిగిన ఐజాక్ అసిమోవ్ స్మారక చర్చసందర్భంగా మాట్లాడుతూ.. మానవ మేధస్సును మించే స్థాయికి చేరుకునే AI నియంత్రణలో లేకపోతే అది మానవాళి మనుగడకు ముప్పుగా మారవచ్చని హెచ్చరించారు. ప్రస్తుతం OpenAI, xAI వంటి సంస్థలు అధునాతన AI అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్‌ఇంటెలిజెన్స్ అనే భావన మరింత చర్చనీయాంశంగా మారింది. టైసన్ అభిప్రాయం ప్రకారం.. 2030 నాటికి AI మన రోజువారీ జీవితాల్లో కీలక భాగమవుతుంది. అయితే మానవ మేధస్సును పూర్తిగా అధిగమించే AI అభివృద్ధి ప్రమాదకరమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రచ్ఛన్న యుద్ధ కాలాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఆయన మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ (MAD) భావనను ప్రస్తావించారు. అణ్వాయుధాల ముప్పు కారణంగా దేశాలు నియంత్రణకు ఒప్పుకున్నట్లే, AI అభివృద్ధిపై కూడా అంతర్జాతీయ ఒప్పందాలు అవసరమని సూచించారు. సూపర్‌ఇంటెలిజెన్స్‌ను ఎవరూ నిర్మించకూడదు అనే స్థాయిలో ఒప్పందాలు అవసరం అని ఆయన పేర్కొన్నారు. హాలీవుడ్ చిత్రాలు కూడా ఈ భయాందోళనలను ప్రతిబింబించాయి. ది మ్యాట్రిక్స్, ది టెర్మినేటర్ వంటి చిత్రాలు AI ఆధిపత్యంలోని భవిష్యత్తును చూపించాయి. టైసన్ అభిప్రాయం ప్రకారం ఇవి పూర్తిగా కల్పితం కాకపోవచ్చని సూచనలు ఉన్నాయి.
ఇక AIను ఆయుధాలుగా వినియోగించే అవకాశాలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్వయంప్రతిపత్తి గల ఆయుధ వ్యవస్థల్లో AI వినియోగం పెరిగితే, మానవ పర్యవేక్షణ లేకుండానే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో AI వినియోగంపై నియంత్రణలు, నైతిక ప్రమాణాలు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే AI పూర్తిగా ప్రతికూలమని కాదు. వైద్యరంగం, సాంకేతికత, శాస్త్ర పరిశోధనల్లో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. కానీ సూపర్‌ఇంటెలిజెన్స్ దిశగా నియంత్రణలేని అభివృద్ధి మానవాళికి ప్రమాదకరమవుతుందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
